సాక్షి, హైదరాబాద్: రైతులకు పెట్టుబడి సొమ్ము కేటాయించే ప్రక్రియ మొదలైంది. వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక సాఫ్ట్‌వేర్ ద్వారా ఈ కార్యక్రమం శరవేగంగా జరుగుతోంది. ఐదారు రోజుల్లో ఇది పూర్తి కానుంది. తర్వాత ఆ వివరాలను బ్యాంకులకు పంపిస్తారు. అనంతరం రైతు పేర్లతో బ్యాంకులు చెక్కులు ముద్రిస్తాయి. భూ రికార్డుల ప్రక్షాళన ద్వారా సమగ్ర రైతు సమాచారాన్ని రెవెన్యూ శాఖ ఇప్పటికే సిద్ధం చేసిన సంగతి తెలిసిందే. మొత్తం 10,823 గ్రామాలకు 7 వేల గ్రామాల భూముల వివరాలను వ్యవసాయశాఖకు అందజేసింది.
ఆ భూముల వివరాలను వ్యవసాయ శాఖ ప్రత్యేక సాఫ్ట్‌వేర్ ద్వారా పరిశీలన చేస్తుంది. అలాగే రైతుల భూమి, వారి సర్వే నంబర్, వారికి ఎంతెంత సొమ్ము ఇవ్వాల్సి ఉంటుందో అధికారులు నిర్ధారణ చేస్తున్నారు. రైతుకున్న భూమి ప్రకారం సాఫ్ట్‌వేర్ ఆటోమేటిక్‌గా సొమ్మును పక్కనున్న కాలమ్‌లో సిద్ధం చేస్తుంది. జిల్లాలు, మండలాలు, గ్రామాల వారీగా ఈ జాబితాను తయారు చేసి బ్యాంకులకు అందజేయనున్నారు.
గుంట గుంటకూ లెక్క
సన్న, చిన్నకారు రైతుల్లో చాలా మందికి ఐదు, పది గుంటల భూమి ఉంటుంది. అంతకంటే తక్కువ భూమి ఉండేవారూ ఉన్నారు. అలాంటి వారికి కూడా గుంట గుంటనూ లెక్కించి పెట్టుబడి సాయం అందిస్తారు. ఉదాహరణకు కేవలం ఒక గుంట భూమి ఉండి, అందులో కూరగాయలు పండించుకునే వారికి రూ.100 చొప్పున పెట్టుబడి సాయం అందుతుంది. పది గుంటల భూమి ఉంటే రూ.వెయ్యి చొప్పున ఇస్తారు. అంతేకాదు ఒక రైతుకు ఒక ఎకరా ఒక గుంట భూమి ఉంటే అతనికి ఆ లెక్కన రూ.4,100 అందిస్తారు. ఈ మేరకు సాఫ్ట్‌వేర్‌ను ఆటోమేటిక్‌గా జాబితా రూపొందిస్తోంది. ఆ జాబితాను నిర్ధారించిన ఆరు బ్యాంకులకు అందజేస్తారు. ఆ బ్యాంకులు రైతుల పేరుతో చెక్కులు ముద్రిస్తాయి. వాటిని వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో గ్రామసభలు పెట్టి పంపిణీ చేస్తారు. చెక్కులను తెలుగులో ముద్రించాలని భావిస్తున్నారు.
హైదరాబాద్ నుంచే చెక్కులు
ఆరు బ్యాంకులు ఏ రాష్ట్రంలో చెక్కులను ముద్రించినా వాటిని రాష్ట్ర వ్యవసాయశాఖకు అందజేస్తాయి. హైదరాబాద్‌లోని ఆయా బ్యాంకుల ప్రధాన కార్యాలయాల వద్ద ప్రత్యేక కౌంటర్లు పెట్టి జిల్లా వ్యవసాయశాఖ అధికారులకు పంపిణీ చేయాలని రాష్ట్ర వ్యవసాయశాఖ నిర్ణయించింది. జిల్లా వ్యవసాయాధికారులు వాటిని తీసుకెళ్లి జిల్లా కేంద్రాల్లో సరఫరా కౌంటర్లు ఏర్పాటు చేస్తారు. ఆయా జిల్లాల్లో పెద్ద మైదానంలో కౌంటర్లు ఏర్పాటు చేసి మండలాల వారీగా సరఫరా చేస్తారు. ముందుగా జిల్లాల వారీగా చెక్కుల బండిళ్లు కడతారు. అందులో గ్రామాలు, మండలాల వారీగా బండిళ్లు ఉంటాయి. అక్షర క్రమం ప్రకారం చెక్కులను బండిళ్లుగా సిద్ధం చేస్తారు.
మరోవైపు రైతు జాబితాలను గ్రామాల్లో ప్రదర్శిస్తారు. ఇందులో ఎవరికైనా అన్యాయం జరిగితే ఫిర్యాదు చేసే అవకాశముంది. ఫిర్యాదు కోసం ఒక ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేస్తారు. జాబితాను ప్రదర్శించిన తర్వాత గ్రామ సభల్లో ఆయా రైతులకు చెక్కులను అందజేస్తారు. 15 రోజుల్లోపు మండలంలోని అన్ని గ్రామాల్లో చెక్కుల పంపిణీ పూర్తయ్యేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఇలా మూడు విడతల్లో చెక్కులు పంపిణీ చేస్తారు. ఒకవేళ ఆ రోజు ఎవరైనా చెక్కులు తీసుకోని పరిస్థితి ఉంటే మండల వ్యవసాయశాఖ కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్ ఉంటుంది. అక్కడ ప్రతీ రోజూ చెక్కులు ఇచ్చేలా ఏర్పాటు చేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment