Special software
-
AP: ఆస్తుల రిజిస్ట్రేషన్లు సులభతరం.. స్పెషల్ సాఫ్ట్వేర్ ‘కార్డ్ ప్రైమ్’
సాక్షి, అమరావతి: ఇది టెక్నాలజీ యుగం. అన్ని పనులు ఆన్లైన్లోనే, అరచేతిలోనే నిమిషాల్లో అయిపోతున్నాయి. ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేదు. వేచి ఉండాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఇకపై ఆస్తుల రిజిస్ట్రేషన్లు కూడా ఆన్లైన్లోనే చేసుకోవచ్చు. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖను రాష్ట్ర ప్రభుత్వం టెక్నాలజీ వైపు నడిపిస్తోంది. కంప్యూటర్ ఎయిడెడ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ డిపార్టుమెంట్ (కార్డ్)ను ఆధునీకరించి కార్డ్ 2.0కు రూపకల్పన చేస్తోంది. ‘కార్డ్ ప్రైమ్’ పేరుతో ప్రత్యేక సాఫ్ట్వేర్ రూపొందిస్తోంది. దీని ద్వారా స్టాంపు పేపర్లు, సంతకాలతో పనిలేకుండా రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు. డాక్యుమెంట్‌ను ఎవరికివారే ఆన్లైన్లో తయారు చేసుకుని, ఆన్లైన్లోనే చలానా (స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు) కట్టి, ఒక టైం స్లాట్‌ను (అపాయింట్మెంట్) బుక్ చేసుకుని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం, లేదా గ్రామ, వార్డు సచివాలయానికి వెళితే అక్కడ వెంటనే రిజిస్ట్రేషన్ పూర్తి చేసే విధానం త్వరలో అందుబాటులోకి రానుంది. కొత్త విధానంలో సులభంగా రిజిస్ట్రేషన్లు ప్రస్తుత విధానంలో డాక్యుమెంట్ తయారీ, చలానా కట్టడం వంటివన్నీ రిజిస్ట్రేషన్ల శాఖతో సంబంధం లేకుండా బయట జరుగుతున్నాయి. వీటిని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఇస్తే అక్కడ రిజిస్ట్రేషన్ చేస్తారు. ఇదో పెద్ద ప్రహసనం. కార్డ్ ప్రైమ్ విధానంలో చాలా తక్కువ సమయంలో సులభంగా రిజిస్ట్రేషన్లు ప్రక్రియ పూర్తవుతుంది. కేవలం బయోమెట్రిక్ ద్వారా వేలిముద్ర వేయడానికి 5 నుంచి 10 నిమిషాలు ఉంటే సరిపోతుందని అధికారులు చెబుతున్నారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం బయట జరిగే పనిని సులభంగా ఆన్లైన్లో చేసుకోవచ్చు. దీన్ని పబ్లిక్ డేటా ఎంట్రీ ఇంటిగ్రేషన్ అంటారు. అంటే వినియోగదారులే ఆన్లైన్లో డాక్యుమెంట్ తయారు చేసుకోవచ్చు. ఆస్తి వివరాలు, పేరు, ఆధార్, సాక్షులు వంటి సమాచారాన్ని ఆన్లైన్లో ఎంటర్ చేస్తే వెంటనే ఆస్తి మార్కెట్ విలువ, స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు, యూజర్ ఛార్జీలు ఎంత కట్టాలో చూపిస్తుంది. ఆ సొమ్మును ఆన్లైన్లో చెల్లించొచ్చు. ఆఫ్‌లైన్, స్టాక్‌హోల్డింగ్ ద్వారా కూడా చలానా కట్టొచ్చు. అనంతరం రిజి్రస్టేషన్కి టైమ్ స్లాట్ బుక్ చేసుకోవాలి. ఆ సమయానికి సబ్ రిజి్రస్టార్ కార్యాలయం లేదా గ్రామ/వార్డు సచివాలయానికి వెళితే అక్కడ అప్లికేషన్లో నమోదు చేసిన ఆధార్ వివరాలను సరి చూస్తారు. బయోమెట్రిక్ ద్వారా వినియోగదారుని వేలిముద్ర తీసుకుంటారు. రిజిస్ట్రేషన్‌తోపాటే సబ్ డివిజన్, మ్యుటేషన్ ఇదంతా అయిన తర్వాత ఆ ఆస్తిని సబ్ డివిజన్ చేయాల్సి వస్తే వెంటనే చేస్తారు. పాత విధానంలో రిజి్రస్టేషన్ పూర్తయ్యాక దాన్ని రెవెన్యూ శాఖలో సబ్ డివిజన్ చేయించడం ఓ పెద్ద ప్రహసనం. కార్డ్ ప్రైమ్‌లో రిజిస్ట్రేషన్ సమయంలోనే సబ్ డివిజన్ (అవసరమైతే) పూర్తవుతుంది. వ్యవసాయ భూములైతే మ్యుటేషన్ కూడా ఆటోమేటిక్‌గా జరిగిపోతుంది. దానికోసం తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం ఉండదు. రెవెన్యూ రికార్డుల్లో పేరు కూడా వెంటనే మారిపోతుంది. ఇందుకోసం కార్డ్ 2.0ని రెవెన్యూ శాఖ వెబ్‌ల్యాండ్ సాఫ్ట్వేర్కి అనుసంధానం చేస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత రిజిస్ట్రేషన్లు డాక్యుమెంట్‌ను ప్రింట్ తీసి ఇస్తారు. గతంలో మాదిరిగా స్టాంప్ పేపర్ల అవసరం ఉండదు. వినియోగదారుడు కోరుకొంటే స్టాంప్ పేపర్లపై ప్రింట్ ఇస్తారు. ఈ విధానంలో వినియోగదారుడు ఎక్కడా సంతకం పెట్టాల్సిన అవసరం ఉండదు. ఈ–సైన్‌తోనే పని పూర్తవుతుంది. సులభం.. పారదర్శకం.. కార్డ్ ప్రైమ్ ద్వారా రిజిస్ట్రేషన్ల విధానం మరింత సులభమవుతుంది. మొత్తం ప్రక్రియ ఆన్లైన్లోనే పూర్తవుతుంది. రిజిస్ట్రేషన్లు చాలా తక్కువ సమయంలో సులభంగా, పారదర్శకంగా జరుగుతాయి. అవకతవకలకు ఆస్కారం ఉండదు. ప్రభుత్వ అనుమతితో త్వరలో దీన్ని అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. – వి. రామకృష్ణ, కమిషనర్ అండ్ ఐజీ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ. ఇది కూడా చదవండి: ఏపీకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల వరద.. టీడీపీకి షాకిచ్చిన రిపోర్ట్! -
నోటరీ విధానం ఇక పక్కా: తప్పుడు స్టేట్మెంట్లకు చెక్!
సాక్షి, అమరావతి: నోటరీలు పారదర్శకంగా పనిచేసేలా ప్రభుత్వం కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకురానుంది. కొందరు నోటరీలు తప్పుడు స్టేట్మెంట్లను నోటిఫై చేస్తున్నారనే ఆరోపణలు చాలాకాలంగా ఉన్నాయి. మరికొందరు లైసెన్సు లేకపోయినా నోటరీ చేస్తున్నారనే ఫిర్యాదులున్నాయి. వీటివల్ల నోటరీలు చేయించుకున్న వ్యక్తులు ఇబ్బందులు పడటంతోపాటు వివాదాలు ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో నోటరీ వ్యవస్థలో లోపాలను సరిదిద్దేందుకు రిజిస్ట్రేషన్ల శాఖ నడుం బిగించింది. నోటరీలు ఇచ్చే అఫిడవిట్లు, ఇతర సర్టిఫికెట్లను రిజిస్ట్రేషన్ల శాఖ వెబ్సైట్లో అప్లోడ్ చేసేలా చర్యలు తీసుకుంటోంది. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ సాఫ్ట్‌వేర్‌ను రూపొందిస్తోంది. ఇకపై ప్రతి నోటరీకి వెబ్సైట్లో లాగిన్ అయ్యేందుకు యూజర్ ఐడీ, పాస్వర్డ్ ఇచ్చి వారు జారీ చేసే సర్టిఫికెట్లను అప్లోడ్ చేయించేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే లైసెన్సు ఉన్న ప్రతి నోటరీకి ఒక యూనిక్ ఐడీ ఇవ్వనున్నారు. నోటరీలు జారీచేసే అఫిడవిట్లపై ఈ యూనిక్ ఐడీ ఉంటుంది. దీనివల్ల ఇబ్బందులు ఎదురైనప్పుడు వాటిని పరిష్కరించేందుకు, విచారించేందుకు రిజిస్ట్రేషన్ల శాఖకు అవకాశం ఉంటుంది. నోటరీలను పర్యవేక్షించేందుకు ఈ రెండు చర్యలు ఉపయోగపడతాయని భావిస్తున్నారు. అవతవకలకు ఆస్కారం ఉండదని చెబుతున్నారు. రెండు నెలల్లో వీటిని అమల్లోకి తీసుకువచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు. నోటరీ లైసెన్సులు పెంచేందుకు చర్యలు మరోవైపు నోటరీ లైసెన్సుల్ని పెంచేందుకు చర్యలు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో 1,906 మంది నోటరీలకు కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. అంతకుముందు 13 జిల్లాల్లో సుమారు 2,400 మంది నోటరీలు ఉండేవారు. తక్కువ మంది నోటరీలకే అవకాశం ఉండటంతో దానికి అనుగుణంగా లైసెన్స్ పీరియడ్ ముగిసిన వారికి రెన్యువల్ చేయడం నిలిపివేశారు. కొత్తగా నోటరీ లైసెన్సుకు దరఖాస్తు చేసుకున్న వారికి అవకాశం ఇవ్వలేకపోతున్నారు. దీంతో నోటరీల అవసరం, న్యాయవాదుల ఉపాధి వంటి విషయాలను దృష్టిలో పెట్టుకుని మరో 500 మందికి నోటరీ లైసెన్సులు ఇచ్చేందుకు అనుమతి ఇవ్వాలని రిజిస్ట్రేషన్ల శాఖ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. అనుమతి వస్తే కొత్తగా మరికొందరు న్యాయవాదులకు నోటరీ లైసెన్సులు జారీ చేసే అవకాశం ఉంది. లోపాలను సరిదిద్దేందుకు చర్యలు నోటరీ వ్యవస్థ పారదర్శకంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. అక్కడక్కడా కొందరిపై ఫిర్యాదులు వస్తున్నాయి. అవకతవకలకు ఆస్కారం లేకుండా ఉండేందుకు యూనిక్ ఐడీ విధానం, వారు జారీ చేసిన అఫిడవిట్లను ప్రభుత్వ వెబ్సైట్లో అప్లోడ్ చేయించేలా కొత్త వ్యవస్థను తీసుకురాబోతున్నాం. – ఎంవీ శేషగిరిబాబు, కమిషనర్ అండ్ ఐజీ, రిజిస్ట్రేషన్ల శాఖ -
కాల్ చేస్తే లొకేషన్ తెలిసిపోద్ది!
రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ ఓ వ్యక్తి డయల్ 100కి కాల్ చేశాడు. కానీ అవతలివారు కాల్ లిఫ్ట్ చేసేలోపే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. అతడిది బేసిక్ ఫోన్ కావడంతో ఆ వ్యక్తి ఎక్కడున్నాడో కనుక్కునే సరికి చాలా ఆలస్యమైంది. పోలీసులు, అంబులెన్సు చేరుకునే సరికి అతడు మరణించాడు. మరో ఘటనలో రైలు నుంచి కిందపడ్డ ఓ వ్యక్తి కాళ్లు విరిగినా డయల్ 100కి కాల్ చేశాడు. తాను మాట్లాడగలిగాడు. కానీ చీకట్లో తానెక్కడ ఉన్నాడో చెప్పలేకపోయాడు. ఫలితంగా అతడిని వెతికేసరికి నాలుగైదు గంటలు పట్టింది. సాక్షి, హైదరాబాద్: భవిష్యత్తులో డయల్ 100కి కాల్ చేసే బాధితులకు ఇలాంటి కష్టాలు ఉండవు. గతంలో డయల్ 100కి ఫోన్ చేసినవారు తామెక్కడ ఉన్నది చెప్పాల్సి వచ్చేది. పైగా ఏ ఏరియాలో ఉన్నారో తెలిసేది కాదు. ఇకపై ఆ సమస్యలన్నీ తొలగిపోనున్నాయి. దీనికోసం తెలంగాణ పోలీసులు డయల్ 100 విషయంలో మరో అదనపు సదుపాయం చేర్చారు. బాధితులు ఫోన్ చేయగానే ముందు వారెక్కడ ఉన్నారో ఇట్టే తెలిసిపోతుంది. గస్తీ పోలీసులకు బాధితుల లొకేషన్ గాడ్జెట్లపై ప్రత్యక్షమవుతుంది. దాంతో అవతలివారు ఫోన్ మాట్లాడినా, మాట్లాడకపోయినా.. శివారు, మారుమూల, నిర్మానుష్య, అటవీ, రోడ్డు, రైలు ఇలా మార్గమేదైనా.. ఏ మూలన ఉన్నా.. పోలీసులు గస్తీ వాహనాల్లో క్షణాల్లో అక్కడకు చేరుకుంటారు. సరికొత్త సాఫ్ట్వేర్ రూపకల్పన.. డయల్ 100 విషయంలో బాధితుల లొకేషన్ తెలుసుకోవడం కష్టంగా మారుతున్న విషయంపై తెలంగాణ పోలీసులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. చాలాకాలం క్రితమే ఈ సమస్యలపై పలు సాఫ్ట్వేర్ నిపుణులతో చర్చించారు. బాధితుల లొకేషన్‌ను క్షణాల్లో గుర్తించడమే దీనికి పరిష్కారమని సూచించారు. ఈ మేరకు ఓ సాఫ్ట్వేర్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుని, ప్రత్యేకంగా ఈ సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేయించుకున్నారు. ఇప్పటికే సాఫ్ట్‌వేర్‌ను విజయవంతంగా పరీక్షించారు. కొత్త సంవత్సరం నుంచి రాష్ట్రవ్యాప్తంగా పోలీసులందరికీ అందుబాటులో తీసుకువచ్చేందుకు ప్రతీ పోలీసు గాడ్జెట్లలోనూ ఈ సాఫ్ట్‌వేర్‌ను త్వరలో ఇన్స్టాల్ చేస్తారు. నేరాలు, ప్రాణనష్టం నివారణ.. హైవేలపై జరిగే రోడ్డు ప్రమాదాల్లో చాలామటుకు ల్యాండ్‌మార్క్ చెప్పడం చాలాకష్టం. రైలు ప్రమాదాల్లోనూ అంతే. ఇక కొత్తగా మారుమూల, పట్టణాలకు వచి్చన వారి పరిస్థితి అంతే. ఈ సదుపాయం అందుబాటులోకి వస్తే.. రోడ్డు ప్రమాద బాధితులను త్వరితగతిన ఆస్పత్రికి తరలించవచ్చని, తద్వారా ప్రాణ నష్టం తగ్గుతుందని పోలీసులు చెబుతున్నారు. రోడ్డు ప్రమాదాలు జరిగిన (గోల్డె¯Œ అవర్)లో చికిత్స అందితే బాధితులను 90 శాతం కాపాడే అవకాశాలు మరింత పెరుగుతాయి. అంతేకాకుండా కిడ్నాపులు, ఇతర నేరాలు జరిగినప్పుడు ఘటనాస్థలం కనిపెట్టడం ఇకపై క్షణాల్లో పని అని అంటున్నారు పోలీసులు. -
కేంద్రం ప్రతిపాదనకు వాట్సాప్ నో
న్యూఢిల్లీ: సందేశాలు తొలుత ఎక్కడి నుంచి వచ్చాయో కనిపెట్టగలిగే సాంకేతికతను అభివృద్ధి చేస్తే యూజర్ల వ్యక్తిగత గోప్యతతో పాటు ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఉద్దేశాలు దెబ్బతింటాయని ప్రముఖ సోషల్‌మీడియా సంస్థ వాట్సాప్ భారత ప్రభుత్వానికి స్పష్టంచేసింది. నకిలీ సందేశాలను అడ్డుకునేందుకు వార్తల మూలాలను కనిపెట్టే సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేయాలన్న ప్రభుత్వ ప్రతిపాదనను తిరస్కరించింది. ఈ నేపథ్యంలో వాట్సాప్ అధికార ప్రతినిధి మీడియాతో మాట్లాడారు. ‘దీనివల్ల వాట్సాప్ ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిష్షన్(మెసేజ్ పంపేవారు, రిసీవ్ చేసుకునేవారు తప్ప మరెవరూ సమాచారాన్ని చూడలేని సాంకేతికత) ఉద్దేశాలు దెబ్బతింటాయి. ఒకవేళ అలాంటి సాఫ్ట్‌వేర్‌ను తయారుచేస్తే మా యూజర్లకు సంబంధించి సున్నితమైన సమాచారం, గోప్యత తీవ్రమైన ప్రమాదంలో పడతాయి. యూజర్ల గోప్యత నిబంధనల్ని ఉల్లంఘించే పనులను వాట్సాప్ ఎన్నడూ చేయబోదు’ అని ఆయన అన్నారు. నకిలీ వార్తలు, వదంతుల కారణంగా సంభవిస్తున్న మూకహత్యలను నియంత్రించేందుకు వీలుగా ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను రూపొందించాలని కేంద్రం గతంలో వాట్సాప్‌ను కోరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నకిలీ వార్తలపై ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలను తాము చేపడుతున్నట్లు వాట్సాప్ తెలిపింది. ఇందుకోసం భారత్‌లో ఓ బృందాన్ని నియమించామని, వాట్సాప్‌లో ఓసారి గరిష్టంగా పంపగలిగే సందేశాల సంఖ్యను తగ్గించామని పేర్కొంది. సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ కొనుగోలు చేసిన వాట్సాప్‌కు ప్రస్తుతం భారత్‌లో 20 కోట్లకుపైగా వినియోగదారులు ఉన్నారు. -
చకచకా ‘పెట్టుబడి’
సాక్షి, హైదరాబాద్: రైతులకు పెట్టుబడి సొమ్ము కేటాయించే ప్రక్రియ మొదలైంది. వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా ఈ కార్యక్రమం శరవేగంగా జరుగుతోంది. ఐదారు రోజుల్లో ఇది పూర్తి కానుంది. తర్వాత ఆ వివరాలను బ్యాంకులకు పంపిస్తారు. అనంతరం రైతు పేర్లతో బ్యాంకులు చెక్కులు ముద్రిస్తాయి. భూ రికార్డుల ప్రక్షాళన ద్వారా సమగ్ర రైతు సమాచారాన్ని రెవెన్యూ శాఖ ఇప్పటికే సిద్ధం చేసిన సంగతి తెలిసిందే. మొత్తం 10,823 గ్రామాలకు 7 వేల గ్రామాల భూముల వివరాలను వ్యవసాయశాఖకు అందజేసింది. ఆ భూముల వివరాలను వ్యవసాయ శాఖ ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా పరిశీలన చేస్తుంది. అలాగే రైతుల భూమి, వారి సర్వే నంబర్, వారికి ఎంతెంత సొమ్ము ఇవ్వాల్సి ఉంటుందో అధికారులు నిర్ధారణ చేస్తున్నారు. రైతుకున్న భూమి ప్రకారం సాఫ్ట్వేర్ ఆటోమేటిక్‌గా సొమ్మును పక్కనున్న కాలమ్‌లో సిద్ధం చేస్తుంది. జిల్లాలు, మండలాలు, గ్రామాల వారీగా ఈ జాబితాను తయారు చేసి బ్యాంకులకు అందజేయనున్నారు. గుంట గుంటకూ లెక్క సన్న, చిన్నకారు రైతుల్లో చాలా మందికి ఐదు, పది గుంటల భూమి ఉంటుంది. అంతకంటే తక్కువ భూమి ఉండేవారూ ఉన్నారు. అలాంటి వారికి కూడా గుంట గుంటనూ లెక్కించి పెట్టుబడి సాయం అందిస్తారు. ఉదాహరణకు కేవలం ఒక గుంట భూమి ఉండి, అందులో కూరగాయలు పండించుకునే వారికి రూ.100 చొప్పున పెట్టుబడి సాయం అందుతుంది. పది గుంటల భూమి ఉంటే రూ.వెయ్యి చొప్పున ఇస్తారు. అంతేకాదు ఒక రైతుకు ఒక ఎకరా ఒక గుంట భూమి ఉంటే అతనికి ఆ లెక్కన రూ.4,100 అందిస్తారు. ఈ మేరకు సాఫ్ట్‌వేర్‌ను ఆటోమేటిక్‌గా జాబితా రూపొందిస్తోంది. ఆ జాబితాను నిర్ధారించిన ఆరు బ్యాంకులకు అందజేస్తారు. ఆ బ్యాంకులు రైతుల పేరుతో చెక్కులు ముద్రిస్తాయి. వాటిని వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో గ్రామసభలు పెట్టి పంపిణీ చేస్తారు. చెక్కులను తెలుగులో ముద్రించాలని భావిస్తున్నారు. హైదరాబాద్ నుంచే చెక్కులు ఆరు బ్యాంకులు ఏ రాష్ట్రంలో చెక్కులను ముద్రించినా వాటిని రాష్ట్ర వ్యవసాయశాఖకు అందజేస్తాయి. హైదరాబాద్‌లోని ఆయా బ్యాంకుల ప్రధాన కార్యాలయాల వద్ద ప్రత్యేక కౌంటర్లు పెట్టి జిల్లా వ్యవసాయశాఖ అధికారులకు పంపిణీ చేయాలని రాష్ట్ర వ్యవసాయశాఖ నిర్ణయించింది. జిల్లా వ్యవసాయాధికారులు వాటిని తీసుకెళ్లి జిల్లా కేంద్రాల్లో సరఫరా కౌంటర్లు ఏర్పాటు చేస్తారు. ఆయా జిల్లాల్లో పెద్ద మైదానంలో కౌంటర్లు ఏర్పాటు చేసి మండలాల వారీగా సరఫరా చేస్తారు. ముందుగా జిల్లాల వారీగా చెక్కుల బండిళ్లు కడతారు. అందులో గ్రామాలు, మండలాల వారీగా బండిళ్లు ఉంటాయి. అక్షర క్రమం ప్రకారం చెక్కులను బండిళ్లుగా సిద్ధం చేస్తారు. మరోవైపు రైతు జాబితాలను గ్రామాల్లో ప్రదర్శిస్తారు. ఇందులో ఎవరికైనా అన్యాయం జరిగితే ఫిర్యాదు చేసే అవకాశముంది. ఫిర్యాదు కోసం ఒక ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేస్తారు. జాబితాను ప్రదర్శించిన తర్వాత గ్రామ సభల్లో ఆయా రైతులకు చెక్కులను అందజేస్తారు. 15 రోజుల్లోపు మండలంలోని అన్ని గ్రామాల్లో చెక్కుల పంపిణీ పూర్తయ్యేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఇలా మూడు విడతల్లో చెక్కులు పంపిణీ చేస్తారు. ఒకవేళ ఆ రోజు ఎవరైనా చెక్కులు తీసుకోని పరిస్థితి ఉంటే మండల వ్యవసాయశాఖ కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్ ఉంటుంది. అక్కడ ప్రతీ రోజూ చెక్కులు ఇచ్చేలా ఏర్పాటు చేస్తారు. -
కొత్త రూట్లో...
సమస్యలు స్వయంగా గుర్తించనున్న జీహెచ్ఎంసీ అధికారులు నూతన సాంకేతిక విధానంతో చెక్ వాహనాలకు హైడెఫినిషన్ కెమెరాలు.. ప్రత్యేక సాఫ్ట్వేర్ రోజుకు 2000 కి.మీ. పరిధిలో పరిశీలన సాక్షి, సిటీబ్యూరో: గుంతలతో నిండిన రోడ్లు.. ఎక్కడి కక్కడ రోడ్లపై గుట్టలుగా చెత్త.. రహదారులపై పొంగిపొర్లే డ్రైనేజీలు... వేలాడుతున్న కేబుల్‌వైర్లు.. మరమ్మతులకు నోచుకోని వీధి దీపాలు... మూతలు లేని మ్యాన్‌హోళ్లు.. ఇవన్నీ నగర ప్రజల నిత్య సమస్యలు. ఇవే కాదు వివిధ ప్రాంతాల్లో అనుమతిలేనిహోర్డింగులు.. అక్రమంగా వెలుస్తున్న భవనాలు... ఫుట్‌పాత్‌ల ఆక్రమణ.. ట్రాఫిక్ ఇబ్బందులపై జీహెచ్ఎంసీకి క్రమం తప్పకుండా ఫిర్యాదులు అందుతూనే ఉన్నాయి. పరిష్కారం అంతంతమాత్రమే. వారం వారం జరిగే ప్రజావాణిలో మొర పెట్టుకున్నా.. కాల్‌సెంటర్‌కు తెలిపినా చర్యలు శూన్యమని ప్రజల నుంచి పదేపదే ఫిర్యాదులు.. అధికారులపై విమర్శలు. ఇదీ ప్రస్తుత పరిస్థితి. త్వరలో దీనికి స్వస్తి చెప్పబోతున్నారు. భవిష్యత్‌లో తమంతటతాముగా సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరిస్తామంటున్నారు జీహెచ్ఎంసీ అధికారులు. ఇందులో భాగంగా దేశంలో ఎక్కడా లేనివిధంగా అధునాతన కెమెరాలను అమర్చిన వాహనాలను నగరంలో తిప్పుతూ సమస్యలను గుర్తిస్తామని చెబుతున్నారు. సంబంధిత అధికారులు వెంటనే వాటిని పరిష్కరించే లా ఏర్పాట్లు చేస్తామంటున్నారు. దీని కోసం హైడెఫినిషన్ కెమెరాలను సంబంధిత వాహనం పైభాగంలో నాలుగు వైపులా అమరుస్తారు. వీటి ద్వారా సమస్యలను గుర్తించి... సంబంధిత అధికారులను అప్రమత్తం చేస్తారు. జీపీఎస్ విధానంతో సమస్య ఎక్కడుందో సంబంధిత అధికారికి తెలుస్తుంది. దాంతో వెంటనే సిబ్బందిని రంగంలోకి దింపి.. పరిష్కరిస్తారని చెబుతున్నారు. ‘అడ్వాన్స్డ్ సిటిజెన్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్’గా వ్యవహరించే ఈ విధానంతో ప్రజలు ఫిర్యాదు చేసేంతదాకా ఆగకుండా తామే పరిష్కరిస్తామని అంటున్నారు. తొలిదశలో 12 వాహనాలను వినియోగించనున్నారు. వీటిలో రెండింటిని అత్యవసర సమయాల్లో వాడేందుకు విడిగా ఉంచుతారు. మిగతా పది వాహనాలు ఒక్కొక్కటి రోజుకు దాదాపు 200 కి.మీ. చొప్పున నగరంలో 2000 కి.మీ. పరిధిలో తిరుగుతాయి. ప్రత్యేక సాఫ్ట్వేర్.. కోడ్ నెంబర్‌తో... వీధుల్లో గుర్తించిన సమస్యలను వాహనంలోనే ఏర్పాటు చేసే ప్రత్యేక సాఫ్ట్వేర్ సిస్టమ్ ద్వారా ఫొటోలు/వీడియోల రూపంలో కోడ్ నెంబరు ద్వారా సంబంధిత అధికారులు, డిప్యూటీ కమిషనర్లకు అందే అవకాశం ఉంటుంది. కేంద్ర కార్యాలయంలోని సెంట్రల్ కమాండ్ సిస్టమ్ ద్వారా ఏ సమస్య ఎంత వ్యవధిలో పరిష్కారమైందీ తెలుసుకునే వీలుంటుంది. దీనిని ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, తమ పరిధిలో అవసరమైన చర్యలు చేపడతారు. జీహెచ్ఎంసీలో ప్రస్తుతం అనేక విభాగాల మధ్య సమన్వయం లేదు. కొత్త విధానంతో పూర్తి స్థాయి సమన్వయానికి వీలుంటుందని భావిస్తున్నారు. దీని అమలుకు సోమవారం జీహెచ్ఎంసీలో నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో స్పెషలాఫీసర్ సోమేశ్ కుమార్, నగర పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి, దీన్ని అమలు చేయనున్న కన్సల్టెన్సీ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. కొత్త యాప్.. ప్రజలు తాము గుర్తించిన సమస్యలను ఫొటోల రూపంలో పంపిం చేందుకు స్మార్ట్ఫోన్లు ఉన్న వారు వినియోగించేలా ప్రత్యేక యాప్‌ను అందుబాటులోకి తెచ్చే యోచన ఉందని సోమేశ్‌కుమార్ తెలిపారు. -
ఎల్బీటీ చెల్లించకపోతే కఠిన చర్యలు
ఎస్ఎంసీ కమిషనర్ చంద్రకాంత్ గూడేంవార్ సాక్షి, ముంబై: స్థానిక సంస్థల పన్ను (ఎల్బీటీ) చెల్లించని వారిపై చర్యలు తప్పవని షోలాపూర్ మున్సిపల్ కార్పొరేషన్ (ఎస్ఎంసీ) కమిషనర్ చంద్రకాంత్ గూడేంవార్ హెచ్చరించారు. పట్టణానికి చెందిన అనేక మంది వ్యాపారులు ఎల్బీటీ చెల్లించలేదు. ఈ విషయమైం చంద్రకాంత్ గూడేంవార్ శనివారం స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ హాలులో ఓ వర్క్‌షాపు నిర్వహించారు. ఈ సమావేశంలో మేయర్ సుశీల అయాటే, ఫ్లోర్ లీడర్ సంజయ్ హేమగడ్డి, కార్పొరేషన్ పదాధికారులతోపాటు అనేక మంది వ్యాపారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రకాంత్ మాట్లాడుతూ అనేక మంది వ్యాపారులు ఎల్బీటీ చెల్లించడంలేదన్నారు. కార్పొరేషన్‌కు ప్రతి నెల సుమారు 20వ తేదీవరకు రూ. 50 లక్షల వరకు ఎల్బీటీ రూపంలో ఆదాయం కార్పొరేషన్‌కు వచ్చేదన్నారు. అయితే గతకొంత కాలంగా ఎవరూ చెల్లించకపోవడంతో రాబడి బాగా తగ్గిపోయిందన్నారు. ఈ విషయంపై అనేక పర్యాయాలు హెచ్చరించామని, అయినప్పటికీ స్పందన కరువైందన్నారు. అందువల్ల ఈ నెల 20వ తేదీలోగా వ్యాపారులంతా ఎల్బీటీ చెల్లించాలని సూచించారు. ఇకపై ఎల్బీటీ చెల్లించకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జరిమానా కూడా వసూలు చేయనున్నట్టు తెలిపారు. ఎల్బీటీ చెల్లింపునకు ప్రత్యేక సాఫ్ట్వేర్: వ్యాపారులంతా ఇళ్లు, కార్యాలయాల నుంచే ఎల్బీటీ చెల్లించేవిధంగా ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను షోలాపూర్ మున్సిపల్ కార్పొరేషన్ (ఎస్ఎంసీ) రూపొందించినట్టు చంద్రకాంత్ పేర్కొన్నారు. ఈ సాఫ్ట్వేర్ గురించి తెలియజేసేందుకు ఈ వర్క్‌షాపు నిర్వహించామన్నారు. దీంతో సునాయాసంగా ఆన్‌లైన్‌ద్వారా ఎల్బీటీ చెల్లిచేందుకు వీలవుతుందన్నారు. -
మీరు దూకుడుగా వాహనాలు నడుపుతారా
మీరు దూకుడుగా వాహనాలు నడుపుతారా... రోడ్డు నిబంధనలు ఖాతరు చేయరా... రాజకీయ, ఆర్థిక బలాలన్నీ ఉన్నాయి.. ఎదురులేదనుకుంటున్నారా... అయితే, ఇకపై వీటన్నీటికీ చెక్ చెప్పండి. వాహనం నడపడంలో జాగ్రత్తలు పాటించండి. లేకుంటే మీ లెసైన్స్ రద్దువుతుంది. వాహనం నడిపేందుకే పనికిరారు... త్వరలో జిల్లాలో అమలుకానున్నస్మార్ట్కార్డు లెసైన్స్ విధానంలో ఇదే జరగనుంది. తస్మాత్ జాగ్రత్త..! అరసవల్లి:దేశంలోనే తొలిసారిగా రవాణాశాఖ సమూల మార్పులకు నాంది పలికింది. రోడ్డు నిబంధనలు పాటించకుండా, తప్పు చేసిన సమయంలో అపరాధ రుసుం చెల్లిస్తూ.. నిరభ్యంతరంగా నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కొరఢా ఝులిపించేందుకు రవాణాశాఖ సిద్ధమైంది. ఈ మేరకు సన్నాహాలు ప్రారంభించింది. దీనికోసం ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో పాటు, కొత్త పరికరాలను జిల్లాకు అందజేసింది. ప్రస్తుతం రవాణాశాఖ ఇస్తున్న స్మార్ట్ కార్డులతో కొత్త టెక్నాలజీని అనుసంధానం చేస్తూ నూతన ఒరవడికి శ్రీకారం చుడుతోంది. లెసైన్సే కీలకంగా... వాహనం నడిపే ప్రతి వ్యక్తికి లెసైన్స్ కీలకం. స్థానికతను కూడా లెసైన్సే తెలియజేస్తుంది. ద్విచక్రవాహనం నుంచి హెవీ వాహనం వరకు దేనిని నడిపినా లెసైన్స్ తప్పని సరి. దీనినే ఆధారం చేసుకుని వాహనదారులందరూ రోడ్డు నిబంధనలు పాటించేలా చర్యలకు ఉపక్రమించింది. వాహనాల నడపడంలో దూకుడు తనానికి చెక్చెబుతూ, నకిలీలను అరికడుతూ, లెసైన్స్‌దారు పూర్తి సమాచారం కార్డులోనే ఇమిడిపోయే నూతన స్మార్ట్‌కార్డు విధానాన్ని ప్రవేశటింది. ఈ కార్డు కేవలం స్మార్ట్ కాదండోయో.. వ్యక్తి(కార్డుదారుడి) సమాచారం ఎల్లప్పుడు అప్డేట్లా ఉండే నూతన సాఫ్ట్‌వేర్‌తో కూడిన చిప్ అనుసంధానమై ఉంటుంది. రోడ్డు నిబంధనలు అతిక్రమించి ఫైన్ కట్టేసి వెళ్లి పోతామంటే ఇకపై కుదరదు. చిప్‌లో తప్పులు ఎక్కువ నమోదైతే లెసైన్స్ రద్దు చేస్తారు. గుట్టంతా కార్డులోనే... వాహనం నడిపేందుకు జారీచేసిన లెసైన్స్‌లో అభ్యర్థి పూర్తి వివరాలు ఉండేలా, స్మార్ట్ కార్డు రూపంలో డ్రైవింగ్ లెసైన్స్‌లు రవాణాశాఖ జారీ చేస్తుంది. ఇది స్మార్ట్ అని అంతా అనుకున్నారు. కాని ఆ స్మార్ట్‌లో ఉన్న స్మార్ట్ చూస్తే ఇంత ఉందా అనక తప్పదు. లెసైన్స్‌పై పేరు ఇతర వివరాలు కాకుండా.. కార్డుతో అనుసంధానంగా ఉండే చిప్‌లో అభ్యర్థి ఫొటో, ఎడమచేతి బొటన వేళిముద్ర, పూర్తివివరాలు ఉంటాయి. లెసైన్స్‌ను తీసుకున్న రోజు నుంచి రవాణాశాఖ నిబంధనలకు విరుద్ధంగా ఏ పనిచేసినా కార్డులో నమోదవుతుంది. దీని కోసం ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను చిప్‌లో పొందుపరిచారు. లెసైన్స్ రెన్యువల్ చేసే సమయంలో రవాణాశాఖ కార్యాలయంలో ఉన్న ‘కార్డు రీడరు’ అనే మిషన్‌లో లెసైన్స్‌ను(స్మార్ట్‌కార్డును) పెడతారు. వాహనదారుడు చేసిన తప్పులన్నీ చిప్‌లో అప్డేట్ అయి ఉంటాయి కాబట్టి కార్డు పెట్టగానే సిస్టంపై కనిపిస్తాయి. రవాణాశాఖ అధికారుల తనిఖీ చేస్తున్న సమయంలో వారి వద్ద ఉండే ‘కార్డు రీడర్ల’లో ఒకసారి కార్డు పెడితే చాలు... ఇక అంతా అప్డేట్ అయిపోతుంది. అక్కడికక్కడే పూర్తి వివరాలు, చేసిన తప్పుల వివరాలు జాబితా వెంటనే ప్రత్యక్షమవుతుంది. దీంతో లెసైన్స్దారుడిపై చర్యలకు ఉపక్రమిస్తారు. ప్రమాదాల నివారణే లక్ష్యంగా... రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య ఏటా పెరుగుతోంది. మరణాలు ఎక్కువయ్యూయి. వీటిని తగ్గించేందుకు ప్రభుత్వం నడుంబిగించింది. నిర్లక్ష్యంగా, నిబంధనలకు విరుద్ధంగా వాహనం నడపం, తెలిసి కూడా తప్పులు చేయడం, తక్కువ అపరాధరుసుం కావడంతో పలుమార్లు నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై చర్యలు తీసుకుని, గాడిలో పెట్టేందుకు చర్యలు ప్రారంభించింది. రవాణాశాఖ చట్టం ప్రకారం నిబంధనలు అతిక్రమించడం శృతిమించితే అభ్యర్థి లెసైన్స్‌ను శాశ్వతంగా రద్దు చేసేందుకు మార్గదర్శకాలను రూపొందిస్తోంది. సెల్ఫోన్లో మాట్లాడుతూ డ్రైవింగ్, రాంగ్ రూట్, మద్యం సేవించి వాహనాన్ని నడపడం, నిర్లక్ష్యంగా వ్యవహరించి ప్రమాదాలు చేయడం, ప్రమాదంలో వ్యక్తుల పాణాలు పోవడానికి కారణమవ్వడం ఇలా.. ఏ తప్పు చేసినా కార్డులో నమోదు అయిపోతుంది. తప్పులు ఎక్కువైతే.. ఆరు నెలలు వాహనం నడపకుండా సప్పెండ్ చేస్తారు. ఆ తరువాత కూడా మారక పోతే 5 ఏళ్లపాటు తాత్కాలిక రద్దు(చేసిన తప్పును బట్టి శాశ్వత రద్దు) చేసే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. జిల్లాకు చేరిన కార్డు రీడర్లు.. రవాణాశాఖలో పని చేస్తున్న ఎంవీఐ, ఏఎంవీఐలకు ‘కార్డు రీడర్’ అనే ప్రత్యేకమైన మిషన్‌ను ప్రభుత్వం త్వరలోనే అందజేయనుంది. ఇప్పటికే జిల్లాకు కార్డు రీడర్లు చేరాయి. వాటి సాఫ్ట్ వేర్ఇంకా లోడ్చేయక పోవడంతో అందజేయలేదు. కొద్ది రోజుల్లోనే తనిఖీ అధికారులకు ఇవి అందజేస్తారు. వీటిలో స్మార్ట్ కార్డును పెట్టగానే అభ్యర్థి వివరాలు పూర్తిగా ప్రత్యక్షమవుతాయి. కార్డు నఖీలీదా కాదా, అభ్యరిథ అవునాకాదా, ఏ వాహననానికి అర్హుడు, ఎన్ని తప్పులు చేశాడు అన్న సమగ్ర సమాచారం ఎంవీఐ వద్ద ఉన్న మిషన్‌లో తెలిసిపోతుంది. దీంతో కలర్ జిరాక్స్ లెసైన్స్‌లు, డూప్లికేట్ ఇలాంటి ఇట్టే కనిపెట్టేయవచ్చు. త్వరలో నూతన విధానం ప్రారంభిస్తాం ‘కార్డు రీడర్’లు జిల్లాకు చేరాయి. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు త్వరలో నూతన విధానం ప్రారంభిస్తాం. గతంలో లెసైన్స్‌పై అభ్యర్థి ఫొటో, పేరు ఇతర వివరాలు ఉండేవి. ఇప్పుడు జారీచేస్తున్న స్మార్ట్‌కార్డుల్లో కార్డుపైనే కాకుండా కార్డులో ఉండే చిప్‌లో అభ్యర్థి ఫొటో, ఎడమచేతి బొనవేలిముద్ర తదితర పూర్తివివరాలు ఉంటాయి. నకిలీ, కలర్జిరాక్స్ లెసైన్స్‌లను అరికట్టేందుకు కార్డురీడర్లు ఉపయోగపడతారుు. వాహనాన్ని నడిపేటప్పుడు తప్పని సరిగా ఒరిజినల్ లెసైన్స్ ఉండాలి. అంతా ఆన్లైన్ కాబట్టి ప్రతి ఉల్లంఘనా నమోదు అవుతుంది. తనిఖీ అధికారికి డ్రైవర్ లేదా లైస్న్స్ దారుడి పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది. -ఎస్.వెంకటేశ్వరావు, ఉప రవాణాశాఖ అధికారి(శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు) డ్రైవర్ల తప్పుల చిట్టా చిప్‌లో భద్రం దేశంలోనే మొదటి సారిగా జిల్లాలో స్మార్ట్ విధానం లెసైన్స్దారుడి సమగ్ర సమాచారం కార్డులోనే.. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు కొద్ది రోజుల్లోనే శ్రీకాకుళం జిల్లాలో అమలుకు శ్రీకారం.. త్వరలో అన్ని జిల్లాలకు మార్గదర్శకాలు జిల్లాకు చేరిన కార్డు రీడర్లు, త్వరలో తనిఖీ అధికారులకు అందజేత.. -
రుణమాఫీలో లోతుగా పరిశీలన
సాక్షిప్రతినిధి, కరీంనగర్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రుణమాఫీ పథకంలో సూక్ష్మపరిశీలనకు నడుం బిగించింది. ఇప్పటికే వివిధ రకాలుగా అసలైన లబ్ధిదారులను గుర్తించేందుకు చర్యలు చేపట్టగా.. తాజాగా మరో అడుగు ముందుకేసింది. నకిలీ పాస్బుక్ల వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా వెలుగు చూడడంతో బోగస్ లబ్ధిదారులను ఏరివేసేందుకు వడపోతకు శ్రీకారం చుట్టింది. ఇప్పటివరకు జాబితాను పరిశీలించిన ప్రభుత్వం రెవెన్యూ రికార్డులకు అనుసంధానం చేస్తూ రూపొందించిన ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను జిల్లాకు పంపించింది. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు రుణమాఫీకి నియమించిన మండల ప్రత్యేక కమిటీలు తిరిగి 1బీ రిజిస్టర్‌లోని భూముల వివరాలతో రుణాల లెక్కలను సరి చూసి అసలైన లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. జిల్లాలో మార్చి 31, 2014 వరకు 4,76,717 మంది రైతులకు రూ.2,505.66 కోట్ల పంట రుణాలు మంజూరు చేశారు. ఇందులో రూ.2,221.2 కోట్ల పంటరుణాలు, రూ.234.63 కోట్ల బంగారం తాకట్టుతో రుణాలు మంజూరయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన రుణమాఫీ మార్గదర్శకాల ప్రకారం ఒక కుటుంబానికి సంబంధించి గరిష్టంగా రూ.లక్ష వరకు మాత్రమే మాఫీ చేయనున్నట్లు స్పష్టం చేసింది. మరోసారి పట్టణాల్లో బంగారు తాకట్టుపెట్టి పంటరుణాలు తీసుకున్న వారికి మాఫీ లేనట్లేనని ఉత్తర్వులు జారీ చే సింది. ఇందులో భాగంగా ఒక్కో రైతు రెండు, మూడు బ్యాంకు ల్లో తీసుకున్న రుణ వివరాలను సేకరిస్తూ వాటన్నింటినీ క్రోడీకరించి గరిష్టంగా రూ.లక్ష వరకు మాఫీ చేసేలా చర్యలు చేపట్టింది. రుణమాఫీ పథకం కింద జిల్లాలో 4 లక్షల మంది రూ.1,779 కోట్లు లబ్ధిపొందనున్నట్లు అధికారులు ప్రాథమిక నివేదిక రూపొందించారు. జిల్లాలో అన్ని మండలాల బ్యాంకర్ల సంయుక్త కమిటీలు విచారించి ఆమోదించారు. బ్యాంకుల వారీగా లబ్ధిదారుల వివరాలను పోల్చిచూస్తూ మండల స్థాయిలోని అన్ని బ్యాంకుల్లో వివరాలను సరిపోల్చిన అనంతరం జిల్లా స్థాయిలో ఈ వివరాలను క్రోడీకరించి తుదిజాబితా తయారు చేశారు. దీంతో జిల్లాలో రూ.1,683.14 కోట్లు రుణమాఫీకి 3,84,105 మంది రైతులను అర్హులుగా తుదిజాబితా రూపొందించారు. రైతులు తీసుకున్న రుణం, అధికారులు రూపొందించిన ప్రాథమిక నివేదికకు తుది జాబితాలో భారీ వ్యత్యాసం కనిపించింది. అక్రమాలతో మళ్లీ మొదటికి! పంట రుణాల మాఫీకి అర్హత కలిగిన రైతులను గుర్తించేందుకు గత నెలలో బ్యాంకర్ల సంయుక్త కమిటీ చేపట్టిన సామాజిక తనిఖీలో అనేక అక్రమాలు వెలుగుచూశాయి. అసలు పంటలు వేయకుండా రుణాలు తీసుకున్న వారు. రియల్‌వ్యాపారం కోసం కొనుగోలు చేసిన భూములకు రుణాలు తీసుకున్న వారు.. వ్యవసాయ యోగ్యత లేని భూములకు. నకిలీ పాస్ పుస్తకాలతో రుణాలు తీసుకున్న వైనం వెలుగు చూడడంతో బ్యాంకర్ల డొల్లతనం బయటపడింది. ఏ, బీ, సీ, డీ, ఈ పేరిట ఫార్మాట్లను రూపొందించి బ్యాంకర్లు ఇచ్చిన జాబితాను జల్లెడ పట్టి తుది జాబితాను ఖరారు చేశారు. అయితే వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో జిల్లా తుది జాబితా పూర్తయినప్పటికీ బ్యాంకర్లు జిల్లాస్థాయిలో సిద్ధం చేయకపోవడంతో ప్రభుత్వానికి నివేదిక పంపలేదు. తాజాగా మరోసారి ప్రభుత్వం తహశీల్దార్ల వద్ద ఉన్న 1బీ రికార్డులతో అర్హులను సరిచూడాలని ఆదేశించడంతో మళ్లీ కసరత్తు మొదలైంది. ప్రభుత్వం రూపొందించిన ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌లో సర్వేనంబర్ల వారీగా పట్టాభూమి, అక్షరమాల ఆధారంగా లబ్ధిదారుల పేర్లు ఉంటాయని అధికారులు చెబుతున్నారు. వీటి ఆధారంగా పంట రుణం తీసుకున్న లబ్ధిదారులను సరిపోల్చి అర్హుల తుది జాబితాను సిద్ధం చేసే పనిలో ఉన్నామని చెబుతున్నారు. కాగా నకిలీలను ఏరివేయడంతోపాటు ఆర్థికభారం తగ్గించుకునే దిశగా సర్కారు దశలవారీగా నిశిత పరిశీలనలంటూ ఫిల్టరింగ్ చేస్తూ ముందుకు పోతున్నట్లు తెలుస్తోంది. -
గ్రామాల్లో ఆస్తి పన్ను వడ్డనకు రంగం సిద్ధం
చింతలపూడి : జిల్లాలో ఆస్తి పన్ను బాదుడుకు రంగం సిద్ధమైంది. సుమారు 80 శాతం మేర పన్ను పెరగనుంది. మరో 15 రోజుల్లో ఇందుకు సంబంధించి స్పష్టమైన ఆదేశాలు ప్రభుత్వం నుంచి వచ్చే అవకాశం ఉంది. గ్రామ పంచాయతీల ఆదాయాన్ని పెంచుకునేందుకు ప్రభుత్వం ఈ చర్య చేపట్టినట్టు జిల్లా పంచాయతీ అధికారి ఎ.నాగరాజువర్మ చెప్పారు. బుధవారం చింతలపూడి ఎంపీడీవో కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో ఆస్తి పన్ను పెంపుకు పటిష్ట ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. ఆస్తి పన్ను ద్వారా జిల్లాలో పంచాయతీలకు రూ.60 కోట్ల ఆదాయం వస్తోందని, ప్రస్తుతం పన్ను పెంపు ద్వారా మరో రూ.40 కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉందన్నారు. దీంతో జిల్లాలో పంచాయతీల ఆదాయం రూ.100 కోట్లకు చేరుకుంటుందన్నారు. ఇందుకోసం ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను రూపొందిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ ధరల ప్రకారమే ఆస్తి పన్ను నిర్ధారణ చేస్తామన్నారు. వాణిజ్య భవనాలకు నూటికి 50 పైసలు, వాణిజ్యేతర భవనాలకు నూటికి 25 పైసలు చొప్పున పన్ను విధిస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని పంచాయతీలు తీర్మానాలు చేశాయన్నారు. అలాగే పంచాయతీలకు వీధిదీపాల నిర్వహణ భార ంగా ఉందని, దీనిని అధిగమించేందుకు అన్ని పంచాయతీల్లో సీఎఫ్ఎల్, ఎల్ఈడీ బల్బులను వీధిలైట్లకు వినియోగించాలని ఆదేశాలిచ్చామన్నారు. దీని వల్ల పంచాయతీల్లో విద్యుత్ ఆదా అవుతుందన్నారు. గ్రామ పంచాయతీల్లో గ్రౌండ్‌ఫ్లోర్‌తో పాటు రెండు అంతస్తులకే అనుమతి ఉంటుందని, ఆపైన కావాలంటే టౌన్ ప్లానింగ్ నుంచి అనుమతులు తెచ్చుకోవాల్సి ఉంటుందన్నారు. అనుమతులు లేకుండ జి+2కి మించి నిర్మిస్తున్న అపార్ట్మెంట్లకు విద్యుత్ సర్వీసులు ఇవ్వొద్దని విద్యుత్ శాఖాధికారులకు సూచించామన్నారు. అటువంటి అనుమతులు లేని కట్టడాలు ఉంటే తమ దృష్టికి తీసుకు వస్తే విద్యుత్ సరఫరా నిలుపుదల చేస్తామని హెచ్చరించారు. అదేవిధంగా సెల్లార్లో ఎటువంటి షాపులు, కట్టడాలు ఉండకూడదన్నారు. జిల్లాలో 200 పంచాయతీలకు సొంత భవనాలు లేవన్నారు. ఇటీవలే 158 పంచాయతీలకు భవన నిర్మాణాలు మంజూరు అయ్యాయని, ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాగానే పనులు ప్రారంభిస్తామని వివరించారు. సమావేశంలో ఎంపీపీ దాసరి రామక్క, ఎంపీడీవో పరదేశికుమార్ పాల్గొన్నారు.