సాక్షిప్రతినిధి, కరీంనగర్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రుణమాఫీ పథకంలో సూక్ష్మపరిశీలనకు నడుం బిగించింది. ఇప్పటికే వివిధ రకాలుగా అసలైన లబ్ధిదారులను గుర్తించేందుకు చర్యలు చేపట్టగా.. తాజాగా మరో అడుగు ముందుకేసింది. నకిలీ పాస్‌బుక్‌ల వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా వెలుగు చూడడంతో బోగస్ లబ్ధిదారులను ఏరివేసేందుకు వడపోతకు శ్రీకారం చుట్టింది. ఇప్పటివరకు జాబితాను పరిశీలించిన ప్రభుత్వం రెవెన్యూ రికార్డులకు అనుసంధానం చేస్తూ రూపొందించిన ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను జిల్లాకు పంపించింది. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు రుణమాఫీకి నియమించిన మండల ప్రత్యేక కమిటీలు తిరిగి 1బీ రిజిస్టర్‌లోని భూముల వివరాలతో రుణాల లెక్కలను సరి చూసి అసలైన లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు.
జిల్లాలో మార్చి 31, 2014 వరకు 4,76,717 మంది రైతులకు రూ.2,505.66 కోట్ల పంట రుణాలు మంజూరు చేశారు. ఇందులో రూ.2,221.2 కోట్ల పంటరుణాలు, రూ.234.63 కోట్ల బంగారం తాకట్టుతో రుణాలు మంజూరయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన రుణమాఫీ మార్గదర్శకాల ప్రకారం ఒక కుటుంబానికి సంబంధించి గరిష్టంగా రూ.లక్ష వరకు మాత్రమే మాఫీ చేయనున్నట్లు స్పష్టం చేసింది. మరోసారి పట్టణాల్లో బంగారు తాకట్టుపెట్టి పంటరుణాలు తీసుకున్న వారికి మాఫీ లేనట్లేనని ఉత్తర్వులు జారీ చే సింది. ఇందులో భాగంగా ఒక్కో రైతు రెండు, మూడు బ్యాంకు ల్లో తీసుకున్న రుణ వివరాలను సేకరిస్తూ వాటన్నింటినీ క్రోడీకరించి గరిష్టంగా రూ.లక్ష వరకు మాఫీ చేసేలా చర్యలు చేపట్టింది.
రుణమాఫీ పథకం కింద జిల్లాలో 4 లక్షల మంది రూ.1,779 కోట్లు లబ్ధిపొందనున్నట్లు అధికారులు ప్రాథమిక నివేదిక రూపొందించారు. జిల్లాలో అన్ని మండలాల బ్యాంకర్ల సంయుక్త కమిటీలు విచారించి ఆమోదించారు. బ్యాంకుల వారీగా లబ్ధిదారుల వివరాలను పోల్చిచూస్తూ మండల స్థాయిలోని అన్ని బ్యాంకుల్లో వివరాలను సరిపోల్చిన అనంతరం జిల్లా స్థాయిలో ఈ వివరాలను క్రోడీకరించి తుదిజాబితా తయారు చేశారు. దీంతో జిల్లాలో రూ.1,683.14 కోట్లు రుణమాఫీకి 3,84,105 మంది రైతులను అర్హులుగా తుదిజాబితా రూపొందించారు. రైతులు తీసుకున్న రుణం, అధికారులు రూపొందించిన ప్రాథమిక నివేదికకు తుది జాబితాలో భారీ వ్యత్యాసం కనిపించింది.
అక్రమాలతో మళ్లీ మొదటికి!
పంట రుణాల మాఫీకి అర్హత కలిగిన రైతులను గుర్తించేందుకు గత నెలలో బ్యాంకర్ల సంయుక్త కమిటీ చేపట్టిన సామాజిక తనిఖీలో అనేక అక్రమాలు వెలుగుచూశాయి. అసలు పంటలు వేయకుండా రుణాలు తీసుకున్న వారు. రియల్‌వ్యాపారం కోసం కొనుగోలు చేసిన భూములకు రుణాలు తీసుకున్న వారు.. వ్యవసాయ యోగ్యత లేని భూములకు. నకిలీ పాస్ పుస్తకాలతో రుణాలు తీసుకున్న వైనం వెలుగు చూడడంతో బ్యాంకర్ల డొల్లతనం బయటపడింది. ఏ, బీ, సీ, డీ, ఈ పేరిట ఫార్మాట్లను రూపొందించి బ్యాంకర్లు ఇచ్చిన జాబితాను జల్లెడ పట్టి తుది జాబితాను ఖరారు చేశారు. అయితే వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో జిల్లా తుది జాబితా పూర్తయినప్పటికీ బ్యాంకర్లు జిల్లాస్థాయిలో సిద్ధం చేయకపోవడంతో ప్రభుత్వానికి నివేదిక పంపలేదు. తాజాగా మరోసారి ప్రభుత్వం తహశీల్దార్ల వద్ద ఉన్న 1బీ రికార్డులతో అర్హులను సరిచూడాలని ఆదేశించడంతో మళ్లీ కసరత్తు మొదలైంది.
ప్రభుత్వం రూపొందించిన ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌లో సర్వేనంబర్ల వారీగా పట్టాభూమి, అక్షరమాల ఆధారంగా లబ్ధిదారుల పేర్లు ఉంటాయని అధికారులు చెబుతున్నారు. వీటి ఆధారంగా పంట రుణం తీసుకున్న లబ్ధిదారులను సరిపోల్చి అర్హుల తుది జాబితాను సిద్ధం చేసే పనిలో ఉన్నామని చెబుతున్నారు. కాగా నకిలీలను ఏరివేయడంతోపాటు ఆర్థికభారం తగ్గించుకునే దిశగా సర్కారు దశలవారీగా నిశిత పరిశీలనలంటూ ఫిల్టరింగ్ చేస్తూ ముందుకు పోతున్నట్లు తెలుస్తోంది.
రుణమాఫీలో లోతుగా పరిశీలన
Published Tue, Sep 9 2014 2:40 AM | Last Updated on Mon, Oct 1 2018 2:03 PM
Advertisement