ప్రత్యేక సాఫ్ట్‌వేర్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా నిందితుల్ని గుర్తిస్తున్న అమెరికా స్వచ్ఛంద సంస్థ
వివిధ దేశాల్లోని నోడల్ ఏజెన్సీల ద్వారా తదుపరి చర్యలకు సిఫార్సు చేస్తున్న ఎన్‌సీఎంఈసీ
ఆ సంస్థ సమాచారంతో తాజాగా ఓ హైదరాబాదీపై నగర సైబర్ క్రైం ఠాణాలో కేసు నమోదు
హైదరాబాద్‌కు చెందిన ఓ విపరీత మనస్తత్వంగల యువకుడు చైల్డ్ పోర్న్ వీడియోను దర్జాగా తన సోషల్ మీడియాఖాతాలో పోస్ట్ చేశాడు. ఇదేమీ పెద్ద నేరం కాదని.. తన చర్యను ఎవరూ పసిగట్టరని అనుకున్నాడు. కానీ అతను వీడియో పోస్ట్ చేసిన కాసేపటికే అమెరికాకు చెందిన ఓ సంస్థ నిందితుడి చర్యను కనిపెట్టింది. చిటికెలో అతని ఐపీ అడ్రస్ ద్వారా జాడ కనుక్కొని ఆ వివరాలన్నింటినీ హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు పంపింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు బుధవారం నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు.
సాక్షి, హైదరాబాద్: చిన్నారులపై అత్యంత హేయమైన నేరాల్లో ఒకటైన చైల్డ్ పోర్నోగ్రఫీపై ప్రపంచవ్యాప్తంగా నిషేధం కొనసాగుతోంది. ఈ తరహా వీడియోల కట్టడి, నిందితుల గుర్తింపు కోసం అగ్రరాజ్యం వేదికగా నిరంతర నిఘా కొనసాగుతోంది. అమెరికాకు చెందిన నేషనల్ సెంటర్ ఫర్ మిస్సింగ్ అండ్ ఎక్స్‌ప్లాయిటెడ్ చిల్డ్రన్ (ఎన్‌సీఎంఈసీ) అనే స్వచ్ఛంద సంస్థ ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియా ఖాతాలను జల్లెడపడుతూ పోర్న్ వీడియోలు చూసిన లేదా షేర్ చేసిన లేదా అప్‌లోడ్/డౌన్‌లోడ్ చేసిన వారిపై నిఘా పెడుతోంది. చైల్డ్ సెక్యువల్ అబ్యూజ్డ్ మెటీరియల్‌ను (సీఎస్‌ఏఎం) కనిపెట్టడానికి ఈ సంస్థ అత్యాధునిక సాఫ్ట్‌వేర్ వినియోగిస్తోంది.
భారత్‌లో ప్రతి 40 సెకన్లకు ఓ వీడియో...
ఆన్‌లైన్‌లో చైల్డ్ పోర్నోగ్రఫీ అత్యంత వేగంగా పెరుగుతోందని, భారత్‌లో ప్రతి 40 సెకన్లకు ఓ వీడియో క్యాప్చర్ అవుతోందని ఎన్‌సీఎంఈసీ అంచనా వేస్తోంది. సీఎస్‌ఏఎంని గుర్తించడానికి అమెరికా సంస్థ ప్రత్యేక సాఫ్ట్‌వేర్ సాయం తీసుకుంటోంది. అందులో కొన్ని కీలక పదాలను పొందుపరిచింది. ప్రపంచంలో ఎవరైనా ఆయా సోషల్ మీడియా వేదికలపై సీఎస్‌ఏఎంను సెర్చ్ చేసినా, వీక్షించినా, డౌన్‌లోడ్/అప్‌లోడ్ చేసినా తక్షణం ఆ సాఫ్ట్‌వేర్ గుర్తిస్తుంది. ఆయా యూజర్లకు సంబంధించిన ఐపీ అడ్రస్‌లను వెంటనే సర్వర్‌లో నిక్షిప్తం చేసుకుంటుంది.
ఎన్‌సీఎంఈసీ వాటిని ప్రాధాన్యతా క్రమంలో క్రోడీకరించి ఆయా దేశాల నోడల్ ఏజెన్సీలకు పంపిస్తుంది. భారత్‌లో జాతీయ స్థాయిలో జాతీయ నేర గణాంకాల బ్యూరో (ఎన్సీఆర్బీ), రాష్ట్ర స్థాయిలో సీఐడీ ఎన్‌సీఎంఈసీకి నోడల్ ఏజెన్సీలుగా ఉన్నాయి. ఒకవేళ రాష్ట్ర స్థాయిలో చైల్డ్ పోర్నోగ్రఫీకి సంబంధించిన డౌన్‌లోడ్/అప్‌లోడ్ లేదా వీక్షించడం జరిగితే సీఐడీ అధికారులు ఆ ఐపీ అడ్రస్ వినియోగదారుడు నివసించే స్థానిక సైబర్ క్రైం ఠాణాకు ఆయా వివరాలు పంపిస్తారు. అనంతరం వారికి నోటీసులు ఇవ్వడమో లేదా కేసుపెట్టి అరెస్టు చేసి చార్జిషీట్ దాఖలు చేయడమో జరుగుతుంది.
నేరం రుజువైతే తీవ్ర శిక్షలు
చైల్డ్ పోర్న్ వీడియోలు, ఫొటోలను చూసినా నేరమే. దీన్ని బ్రౌజ్ చేసిన వారి సమాచారం మాకు అందుతుంది. దీని ఆధారంగా బాధ్యులపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటాం. ఈ కేసుల్లో దర్యాప్తు పూర్తి చేసి పక్కా ఆధారాలతో చార్జిïÙట్లు దాఖలు చేస్తాం. కోర్టులో నేరం రుజువైతే దోషిగా తొలిసారి నేరం చేసిన వారికి గరిష్టంగా మూడేళ్ల జైలు, రూ. 5 లక్షల వరకు జరిమానా.. రెండోసారి నేరం చేస్తే ఐదేళ్ల వరకు శిక్ష, రూ. 10 లక్షల వరకు జరిమానా పడుతుంది.
బాధితులు నేరుగా వచ్చి ఫిర్యాదు చేస్తే పోక్సో చట్టం కింద కేసులను సైతం నిందితులపై నమోదు చేస్తాం. ఆయా కేసుల్లో కోర్టులు వారిని దోషులుగా నిర్ధారిస్తే జీవితఖైదు వరకు పడే ఆస్కారం ఉంది. చైల్డ్ పోర్నోగ్రఫీ అత్యంత హేయమైన నేరమని ప్రతిఒక్కరూ గుర్తుంచుకోవాలి. – శివమారుతి, హైదరాబాద్ సైబర్ క్రైం ఠాణా ఏసీపీ
ఆ సర్వర్లన్నీ విదేశాల్లోనే...
కేవలం చైల్డ్ పోర్నోగ్రఫీయే కాదు.. అన్ని రకాల అసభ్య, అశ్లీల వెబ్‌సైట్లపై ఫిర్యాదులు వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం వాటిని నిషేధించి బ్లాక్ చేయిస్తోంది. అయితే వాటి నిర్వాహకులు బ్లాక్‌లిస్ట్‌లోని వెబ్‌సైట్ల పేరును పోలిన లేదా దాని చివర 1, 2 లాంటి అంకెలు, కొన్ని అక్షరాలు కలిపి మరో సైట్ ప్రారంభిస్తున్నారు. ఫలితంగా వాటిపై మళ్లీ ఫిర్యాదులు అందే వరకు ఆ సైట్లు యథేచ్ఛగా పనిచేస్తున్నాయి. ఈ తరహా వెబ్‌సైట్లను హోస్ట్ చేస్తున్న సర్వర్లన్నీ విదేశాల్లో ఉండటం వల్ల వరుసగా ఫిర్యాదులు వచ్చినప్పటికీ వెబ్‌సైట్ల నిర్వాహకుల వివరాలు తెలుసుకోవడానికి, వారిపై చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉండట్లేదు.
Comments
Please login to add a commentAdd a comment