కొత్త రూట్‌లో...
సమస్యలు స్వయంగా
గుర్తించనున్న జీహెచ్‌ఎంసీ అధికారులు
నూతన సాంకేతిక విధానంతో చెక్
వాహనాలకు హైడెఫినిషన్
కెమెరాలు.. ప్రత్యేక సాఫ్ట్‌వేర్
రోజుకు 2000 కి.మీ.
పరిధిలో పరిశీలన
సాక్షి, సిటీబ్యూరో:
గుంతలతో నిండిన రోడ్లు.. ఎక్కడి కక్కడ రోడ్లపై గుట్టలుగా చెత్త.. రహదారులపై పొంగిపొర్లే డ్రైనేజీలు... వేలాడుతున్న కేబుల్‌వైర్లు.. మరమ్మతులకు నోచుకోని వీధి దీపాలు... మూతలు లేని మ్యాన్‌హోళ్లు.. ఇవన్నీ నగర ప్రజల నిత్య సమస్యలు. ఇవే కాదు వివిధ ప్రాంతాల్లో అనుమతిలేనిహోర్డింగులు.. అక్రమంగా వెలుస్తున్న భవనాలు... ఫుట్‌పాత్‌ల ఆక్రమణ.. ట్రాఫిక్ ఇబ్బందులపై జీహెచ్‌ఎంసీకి క్రమం తప్పకుండా ఫిర్యాదులు అందుతూనే ఉన్నాయి. పరిష్కారం అంతంతమాత్రమే. వారం వారం జరిగే ప్రజావాణిలో మొర పెట్టుకున్నా.. కాల్‌సెంటర్‌కు తెలిపినా చర్యలు శూన్యమని ప్రజల నుంచి పదేపదే ఫిర్యాదులు.. అధికారులపై విమర్శలు. ఇదీ ప్రస్తుత పరిస్థితి. త్వరలో దీనికి స్వస్తి చెప్పబోతున్నారు.
భవిష్యత్‌లో తమంతటతాముగా సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరిస్తామంటున్నారు జీహెచ్‌ఎంసీ అధికారులు. ఇందులో భాగంగా దేశంలో ఎక్కడా లేనివిధంగా అధునాతన కెమెరాలను అమర్చిన వాహనాలను నగరంలో తిప్పుతూ సమస్యలను గుర్తిస్తామని చెబుతున్నారు. సంబంధిత అధికారులు వెంటనే వాటిని పరిష్కరించే లా ఏర్పాట్లు చేస్తామంటున్నారు. దీని కోసం హైడెఫినిషన్ కెమెరాలను సంబంధిత వాహనం పైభాగంలో నాలుగు వైపులా అమరుస్తారు. వీటి ద్వారా సమస్యలను గుర్తించి... సంబంధిత అధికారులను అప్రమత్తం చేస్తారు. జీపీఎస్ విధానంతో సమస్య ఎక్కడుందో సంబంధిత అధికారికి తెలుస్తుంది.
దాంతో వెంటనే సిబ్బందిని రంగంలోకి దింపి.. పరిష్కరిస్తారని చెబుతున్నారు. ‘అడ్వాన్స్‌డ్ సిటిజెన్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్’గా వ్యవహరించే ఈ విధానంతో ప్రజలు ఫిర్యాదు చేసేంతదాకా ఆగకుండా తామే పరిష్కరిస్తామని అంటున్నారు. తొలిదశలో 12 వాహనాలను వినియోగించనున్నారు. వీటిలో రెండింటిని అత్యవసర సమయాల్లో వాడేందుకు విడిగా ఉంచుతారు. మిగతా పది వాహనాలు ఒక్కొక్కటి రోజుకు దాదాపు 200 కి.మీ. చొప్పున నగరంలో 2000 కి.మీ. పరిధిలో తిరుగుతాయి.
ప్రత్యేక సాఫ్ట్‌వేర్.. కోడ్ నెంబర్‌తో...
వీధుల్లో గుర్తించిన సమస్యలను వాహనంలోనే ఏర్పాటు చేసే ప్రత్యేక సాఫ్ట్‌వేర్ సిస్టమ్ ద్వారా ఫొటోలు/వీడియోల రూపంలో కోడ్ నెంబరు ద్వారా సంబంధిత అధికారులు, డిప్యూటీ కమిషనర్లకు అందే అవకాశం ఉంటుంది. కేంద్ర కార్యాలయంలోని సెంట్రల్ కమాండ్ సిస్టమ్ ద్వారా ఏ సమస్య ఎంత వ్యవధిలో పరిష్కారమైందీ తెలుసుకునే వీలుంటుంది. దీనిని ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, తమ పరిధిలో అవసరమైన చర్యలు చేపడతారు. జీహెచ్‌ఎంసీలో ప్రస్తుతం అనేక విభాగాల మధ్య సమన్వయం లేదు. కొత్త విధానంతో పూర్తి స్థాయి సమన్వయానికి వీలుంటుందని భావిస్తున్నారు. దీని అమలుకు సోమవారం జీహెచ్‌ఎంసీలో నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో స్పెషలాఫీసర్ సోమేశ్ కుమార్, నగర పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి, దీన్ని అమలు చేయనున్న కన్సల్టెన్సీ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.
కొత్త యాప్..
ప్రజలు తాము గుర్తించిన సమస్యలను ఫొటోల రూపంలో పంపిం చేందుకు స్మార్ట్‌ఫోన్లు ఉన్న వారు వినియోగించేలా ప్రత్యేక యాప్‌ను అందుబాటులోకి తెచ్చే యోచన ఉందని సోమేశ్‌కుమార్ తెలిపారు.