ఎల్‌బీటీ చెల్లించకపోతే కఠిన చర్యలు
ఎస్‌ఎంసీ కమిషనర్ చంద్రకాంత్ గూడేంవార్
సాక్షి, ముంబై: స్థానిక సంస్థల పన్ను (ఎల్‌బీటీ) చెల్లించని వారిపై చర్యలు తప్పవని షోలాపూర్ మున్సిపల్ కార్పొరేషన్ (ఎస్‌ఎంసీ) కమిషనర్ చంద్రకాంత్ గూడేంవార్ హెచ్చరించారు. పట్టణానికి చెందిన అనేక మంది వ్యాపారులు ఎల్‌బీటీ చెల్లించలేదు. ఈ విషయమైం చంద్రకాంత్ గూడేంవార్ శనివారం స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ హాలులో ఓ వర్క్‌షాపు నిర్వహించారు. ఈ సమావేశంలో మేయర్ సుశీల అయాటే, ఫ్లోర్ లీడర్ సంజయ్ హేమగడ్డి, కార్పొరేషన్ పదాధికారులతోపాటు అనేక మంది వ్యాపారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా చంద్రకాంత్ మాట్లాడుతూ అనేక మంది వ్యాపారులు ఎల్‌బీటీ చెల్లించడంలేదన్నారు. కార్పొరేషన్‌కు ప్రతి నెల సుమారు 20వ తేదీవరకు రూ. 50 లక్షల వరకు ఎల్‌బీటీ రూపంలో ఆదాయం కార్పొరేషన్‌కు వచ్చేదన్నారు. అయితే గతకొంత కాలంగా ఎవరూ చెల్లించకపోవడంతో రాబడి బాగా తగ్గిపోయిందన్నారు. ఈ విషయంపై అనేక పర్యాయాలు హెచ్చరించామని, అయినప్పటికీ స్పందన కరువైందన్నారు. అందువల్ల ఈ నెల 20వ తేదీలోగా వ్యాపారులంతా ఎల్‌బీటీ చెల్లించాలని సూచించారు. ఇకపై ఎల్‌బీటీ చెల్లించకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జరిమానా కూడా వసూలు చేయనున్నట్టు తెలిపారు.
ఎల్‌బీటీ చెల్లింపునకు ప్రత్యేక సాఫ్ట్‌వేర్: వ్యాపారులంతా ఇళ్లు, కార్యాలయాల నుంచే ఎల్‌బీటీ చెల్లించేవిధంగా ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను షోలాపూర్ మున్సిపల్ కార్పొరేషన్ (ఎస్‌ఎంసీ) రూపొందించినట్టు చంద్రకాంత్ పేర్కొన్నారు. ఈ సాఫ్ట్‌వేర్ గురించి తెలియజేసేందుకు ఈ వర్క్‌షాపు నిర్వహించామన్నారు. దీంతో సునాయాసంగా ఆన్‌లైన్‌ద్వారా ఎల్‌బీటీ చెల్లిచేందుకు వీలవుతుందన్నారు.