సాక్షి, అమరావతి: ఇది టెక్నాలజీ యుగం. అన్ని పనులు ఆన్‌లైన్‌లోనే, అరచేతిలోనే నిమిషాల్లో అయిపోతున్నాయి. ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేదు. వేచి ఉండాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఇకపై ఆస్తుల రిజిస్ట్రేషన్లు కూడా ఆన్‌లైన్‌లోనే చేసుకోవచ్చు. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖను రాష్ట్ర ప్రభుత్వం టెక్నాలజీ వైపు నడిపిస్తోంది. కంప్యూటర్ ఎయిడెడ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ డిపార్టుమెంట్ (కార్డ్)ను ఆధునీకరించి కార్డ్ 2.0కు రూపకల్పన చేస్తోంది.
‘కార్డ్ ప్రైమ్’ పేరుతో ప్రత్యేక సాఫ్ట్‌వేర్ రూపొందిస్తోంది. దీని ద్వారా స్టాంపు పేపర్లు, సంతకాలతో పనిలేకుండా రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు. డాక్యుమెంట్‌ను ఎవరికివారే ఆన్‌లైన్‌లో తయారు చేసుకుని, ఆన్‌లైన్‌లోనే చలానా (స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు) కట్టి, ఒక టైం స్లాట్‌ను (అపాయింట్‌మెంట్) బుక్ చేసుకుని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం, లేదా గ్రామ, వార్డు సచివాలయానికి వెళితే అక్కడ వెంటనే రిజిస్ట్రేషన్ పూర్తి చేసే విధానం త్వరలో అందుబాటులోకి రానుంది.
కొత్త విధానంలో సులభంగా రిజిస్ట్రేషన్లు
ప్రస్తుత విధానంలో డాక్యుమెంట్ తయారీ, చలానా కట్టడం వంటివన్నీ రిజిస్ట్రేషన్ల శాఖతో సంబంధం లేకుండా బయట జరుగుతున్నాయి. వీటిని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఇస్తే అక్కడ రిజిస్ట్రేషన్ చేస్తారు. ఇదో పెద్ద ప్రహసనం. కార్డ్ ప్రైమ్ విధానంలో చాలా తక్కువ సమయంలో సులభంగా రిజిస్ట్రేషన్లు ప్రక్రియ పూర్తవుతుంది. కేవలం బయోమెట్రిక్ ద్వారా వేలిముద్ర వేయడానికి 5 నుంచి 10 నిమిషాలు ఉంటే సరిపోతుందని అధికారులు చెబుతున్నారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం బయట జరిగే పనిని సులభంగా ఆన్‌లైన్‌లో చేసుకోవచ్చు. దీన్ని పబ్లిక్ డేటా ఎంట్రీ ఇంటిగ్రేషన్ అంటారు. అంటే వినియోగదారులే ఆన్‌లైన్‌లో డాక్యుమెంట్ తయారు చేసుకోవచ్చు.
ఆస్తి వివరాలు, పేరు, ఆధార్, సాక్షులు వంటి సమాచారాన్ని ఆన్‌లైన్‌లో ఎంటర్ చేస్తే వెంటనే ఆస్తి మార్కెట్ విలువ, స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు, యూజర్ ఛార్జీలు ఎంత కట్టాలో చూపిస్తుంది. ఆ సొమ్మును ఆన్‌లైన్‌లో చెల్లించొచ్చు. ఆఫ్‌లైన్, స్టాక్‌హోల్డింగ్ ద్వారా కూడా చలానా కట్టొచ్చు. అనంతరం రిజి్రస్టేషన్‌కి టైమ్ స్లాట్ బుక్ చేసుకోవాలి. ఆ సమయానికి సబ్ రిజి్రస్టార్ కార్యాలయం లేదా గ్రామ/వార్డు సచివాలయానికి వెళితే అక్కడ అప్లికేషన్‌లో నమోదు చేసిన ఆధార్ వివరాలను సరి చూస్తారు. బయోమెట్రిక్ ద్వారా వినియోగదారుని వేలిముద్ర తీసుకుంటారు.
రిజిస్ట్రేషన్‌తోపాటే సబ్ డివిజన్, మ్యుటేషన్
ఇదంతా అయిన తర్వాత ఆ ఆస్తిని సబ్ డివిజన్ చేయాల్సి వస్తే వెంటనే చేస్తారు. పాత విధానంలో రిజి్రస్టేషన్ పూర్తయ్యాక దాన్ని రెవెన్యూ శాఖలో సబ్ డివిజన్ చేయించడం ఓ పెద్ద ప్రహసనం. కార్డ్ ప్రైమ్‌లో రిజిస్ట్రేషన్ సమయంలోనే సబ్ డివిజన్ (అవసరమైతే) పూర్తవుతుంది. వ్యవసాయ భూములైతే మ్యుటేషన్ కూడా ఆటోమేటిక్‌గా జరిగిపోతుంది. దానికోసం తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం ఉండదు. రెవెన్యూ రికార్డుల్లో పేరు కూడా వెంటనే మారిపోతుంది. ఇందుకోసం కార్డ్ 2.0ని రెవెన్యూ శాఖ వెబ్‌ల్యాండ్ సాఫ్ట్‌వేర్‌కి అనుసంధానం చేస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత రిజిస్ట్రేషన్లు డాక్యుమెంట్‌ను ప్రింట్ తీసి ఇస్తారు. గతంలో మాదిరిగా స్టాంప్ పేపర్ల అవసరం ఉండదు. వినియోగదారుడు కోరుకొంటే స్టాంప్ పేపర్లపై ప్రింట్ ఇస్తారు. ఈ విధానంలో వినియోగదారుడు ఎక్కడా సంతకం పెట్టాల్సిన అవసరం ఉండదు. ఈ–సైన్‌తోనే పని పూర్తవుతుంది.
సులభం.. పారదర్శకం..
కార్డ్ ప్రైమ్ ద్వారా రిజిస్ట్రేషన్ల విధానం మరింత సులభమవుతుంది. మొత్తం ప్రక్రియ ఆన్‌లైన్‌లోనే పూర్తవుతుంది. రిజిస్ట్రేషన్లు చాలా తక్కువ సమయంలో సులభంగా, పారదర్శకంగా జరుగుతాయి. అవకతవకలకు ఆస్కారం ఉండదు. ప్రభుత్వ అనుమతితో త్వరలో దీన్ని అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నాం.
– వి. రామకృష్ణ, కమిషనర్ అండ్ ఐజీ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ.
ఇది కూడా చదవండి: ఏపీకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల వరద.. టీడీపీకి షాకిచ్చిన రిపోర్ట్!
Comments
Please login to add a commentAdd a comment