- ఐదుగురి ఆత్మహత్య: ఒకరికి గుండెపోటు
సాక్షి నెట్‌వర్క్: అప్పులు రైతులను బలితీసుకుంటున్నాయి. ఆరుగాలం కష్టపడినా అప్పు తీరే మార్గం కనిపించక కరీంనగర్ జిల్లాలో ఒకే రోజు ముగ్గురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. మెదక్ జిల్లాలో ఓ రైతు గుండెపోటుతో మరణించాడు. మరొకరు ఆత్మహత్య చేసుకున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. కరీంనగర్ జిల్లా సిరిసిల్ల అంబేద్కర్‌నగర్‌కు చెందిన గూడెం సడిమెల బాలయ్య(65) తన రెండెకరాల్లో సాగు చేస్తున్నాడు. ఇతని పొలం పక్కనే మురుగు కాల్వ ఉండగా, వ్యవసాయ భూమిలోని బోరు రసాయనాలతో కలిసి కలుషితమైంది.
దీంతో పంట దిగుబడి తగ్గింది. గతేడాది ఇదే పరిస్థితి. బాలయ్య సాగు కోసం బ్యాంకులో రూ. 70 వేలు, ఇతరుల వద్ద రూ. 2 లక్షలు అప్పు చేశాడు. అప్పు తీరే మార్గం కనిపించక శుక్రవారం అర్ధరాత్రి ఇంట్లో క్రిమిసంహారక మందు తాగాడు. ఇదే జిల్లా కోహెడ మండలం గుండారెడ్డిపల్లికి చెందిన కడ్తాల బాల్‌రెడ్డి(58) రెండెకరాల్లో సాగు చేశాడు. రెండేళ్లుగా పంటలు సరిగా పండడం లేదు. పెట్టుబడికి రూ.4 లక్షల వరకు అప్పు అయింది.
దిగుబడి రాకపోవడంతో అప్పులెలా తీర్చాలని మనస్తాపం చెందిన అతడు శుక్రవారం సాయంత్రం పొలం వద్ద క్రిమిసంహారక మందు తాగాడు. ఆస్పత్రిలో శనివారం మరణించాడు. సైదాపూర్ మండలం బొత్తలపల్లికి చెందిన అనగోని లస్మయ్య(65) ఆరెకరాలు కౌలు కు తీసుకుని పత్తి సాగు చేశాడు. పెట్టుబడి నిమిత్తం రూ. రెండు లక్షలు అప్పు చేశాడు. వర్షాభావ పరిస్థితులతో ఆశించిన మేర దిగుబడి రాలేదు. అప్పులెలా తీర్చాలని మనస్తాపం చెందిన అతడు శుక్రవారం రాత్రి క్రిమిసంహారక మందు తాగాడు. ఆస్పత్రిలో శనివారం చనిపోయాడు.
మెదక్ జిల్లా కంగ్టి మండలం నాగూర్(బీ)కి చెందిన గాళప్ప (62) ప్రభుత్వం ఇచ్చిన మూడెకరాల అసైన్డ్ భూమిలో వ్యవసాయం చేసుకుంటున్నాడు. రెండేళ్లలో మొత్తం రూ. 4 లక్షలు అప్పు చేశాడు. అప్పు తీరే మార్గం లేక శుక్రవారం గుండెపోటుకు గురయ్యాడు. ఇదే జిల్లా దుబ్బాక నగర పంచాయతీ ధర్మాజీపేటకు చెందిన బుంగ కనకయ్య(35) తనకున్న 4 ఎకరాల్లో సాగు చేస్తున్నాడు.
పొలంలో 4 బోర్లు వేయగా, నీరు పడలేదు. దీంతో సాగు చేసిన వరి, మొక్కజొన్న ఎండిపోయాయి. రూ. 3 లక్షల అప్పు ఎలా తీర్చాలో అర్థం కాక శనివారం పొలం వద్ద ఉరి వేసుకున్నాడు. అప్పుల బాధతో ఆదిలాబాద్ జిల్లా లోకేశ్వరం మండలంలోని పిప్రి గ్రామానికి చెందిన రైతు నాన్నం నర్సయ్య తన పొలంలోనే చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.