పంటల దశలో ముఖం చాటేసిన వానలు.. పంట దిగుబడులు చేతికొచ్చిన దశలో అన్నదాతలను దెబ్బతీస్తున్నాయి.
కరీంనగర్ అగ్రికల్చర్/జగిత్యాల అగ్రికల్చర్ : పంటల దశలో ముఖం చాటేసిన వానలు.. పంట దిగుబడులు చేతికొచ్చిన దశలో అన్నదాతలను దెబ్బతీస్తున్నాయి. బుధవారం మధ్యాహ్నం ఉన్నట్టుండి బోరున వర్షం కురవడంతో ఎక్కడి ధాన్యం అక్కడే తడిసిపోయింది. కరీంనగర్, హుస్నాబాద్, జమ్మికుంట, జగిత్యాల, సిరిసిల్ల, ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట, శంకరపట్నం, బెజ్జంకి, సుల్తానాబాద్, కథలాపూర్, వీణవంక, కాల్వశ్రీరాంపూర్, మంథని, మహదేవపూర్, కాటారం, ముత్తారం, మల్హర్ తదితర మండలాల్లో వర్షం ప్రభావం ఎక్కువగా ఉంది.
ఆయా మండలాల్లోని కొనుగోలు కేంద్రాలు, మార్కెట్ యార్డుల్లోకి నీరు చేరి వరిధాన్యం, మక్కలు, పత్తి తడిసిపోయాయి. తూకం వేసి రవాణా చేయని బస్తాలతోపాటు కొనుగోలుకు సిద్ధంగా ఉన్న ధాన్యం వరదనీటిలో కొట్టుకుపోయింది. ధాన్యం తడిసిపోవడంతో మార్క్‌ఫెడ్‌తోపాటు ఐకేపీ నిర్వాహకులు కొనుగోళ్లను నిలిపివేశారు. మరోవైపు మరో నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ అధికారులు పేర్కొంటుండడం అన్నదాతలను కలవరపెడుతోంది.
మరో నాలుగు రోజులు వర్షాలు
మరోనాలుగు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని పొలాస వ్యవసాయ పరిశోధన స్థానం డెరైక్టర్ డాక్టర్ లక్ష్మణ్ చెప్పారు. ఈనెల 16 వరకు ఆకాశం పూర్తిగా మేఘావృతమై ఉంటుందని, 13న మూడు మిల్లీమీటర్లు, 14న 10 మిల్లీమీటర్లు, 15న 15మిల్లీమీటర్లు, 16న 12 మిల్లీమీటర్ల వర్షం కురిసే అవకాశముందన్నారు. ఈదురుగాలులు గంటకు 5 నుంచి 8 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని, గాలిలో తేమ ఉదయం 90నుంచి 95 శాతం, మధ్యాహ్నం 46 నుంచి 64 శాతంగా నమోదు అయ్యే అవకాశం ఉందని వివరించారు.