అకాల వర్షం..రైతన్నకు శాపం
జిల్లావ్యాప్తంగా శనివారం కురిసిన అకాల వర్షం రైతుల ఆశల్ని చిదిమేసింది. పలుచోట్ల పంటలు నీటి మునిగాయి. ఈన గాచిన పాలు నక్కల పాలు చందంగా రైతుల శ్రమ వర్షార్పణమైంది. ఆరుగాలం శ్రమించి, కంటికి రెప్పలా సాగిన పంట కళ్లముందే తడిచిపోవడంతో కాపాడుకునే ప్రయత్నాలు చేశారు. ధాన్యం రాశులు, పనలపై ఉన్న వరిని, మొక్కజొన్నకు కాపాడుకునేందుకు పరుగులు పెట్టారు.
మచిలీపట్నం, న్యూస్‌లైన్ : అకాల వర్షం రైతులను నిట్టనిలువునా ముంచింది. ఈ రబీ సీజన్‌లో జిల్లాలో 2.30 లక్షల ఎకరాల్లో వరిసాగు చేపట్టారు. ప్రస్తుతం వరి కోత, కుప్పనూర్పిడిలు, పనల దశలో ఉంది. మరో పది రోజుల వ్యవధిలో కోతలు పూర్తయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో శనివారం ఆకాశం ఒక్కసారిగా మేఘావృతమై అవనిగడ్డ, నాగాయలంక, కోడూరు, మచిలీపట్నం, పెడన, బంటుమిల్లి, బంటుమిల్లి, కృత్తివెన్ను మండలాల్లో భారీ వర్షమే కురిసింది. ధాన్యం రాశులు, పనలపై ఉన్న వరిని కాపాడుకునేందుకు రైతులు ఉరుకులు, పరుగులు పెట్టారు. తీరప్రాంతంలోని మండలాల్లో ఒకమోస్తరు నుంచి భారీ వర్షం కురవటంతో చేతికొచ్చే దశలో ఉన్న పంట వర్షానికి తడిచిపోయిందని వాపోతున్నారు.
కల్లాల్లో తడిచిన పంట
వాతావరణ పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని రైతులు యంత్రాల ద్వారా కోత కోసినా ప్రయోజనం లేకపోయింది. ధాన్యాన్ని ఆరబెట్టుకునేందుకు అధికశాతం రైతులు పొలాల్లోనే రాశులుగా పోసి ఉంచారు. ఊహించని విధంగా వర్షం కురవటంతో తడిసి ముద్దయ్యాయి. జిల్లావ్యాప్తంగా 70వేల ఎకరాల్లో వరి కోత కోసి పనలపై ఉంది. మరో 50వేల ఎకరాల్లో ధాన్యం కోత పూర్తయిన అనంతరం రాశులపై ఉంది.
అకాల వర్షం ధాటికి పనలపై ఉన్న వరి, రాశులుగా ఉన్న ధాన్యం తడిచిపోవటంతో రబీ సీజన్‌లో రైతులు నష్టపోయే ప్రమాదం ఉంది. రబీ సీజన్‌లో ఎంటీయు-1010 రకం అధికంగా సాగుచేశారని ఒకమోస్తరు వర్షానికి ఈ రకం ధాన్యం మొలకెత్తే గుణం అంతగా ఉండదని, నష్టం తక్కువగానే ఉంటుందని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. వర్షం వల్ల జరిగిన నష్టాన్ని సేకరించి ప్రభుత్వానికి నివేదిక పంపుతామని వ్యవసాయాధికారులు చెబుతున్నారు.
నాట్లు ఆలస్యంతోనే నష్టం
నాట్లు ఆలస్యం కావడంతోనే నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది రబీ సీజన్‌కు జనవరిలో సాగునీటిని విడుదల చేశారని, దీంతో ఫిబ్రవరిలో నాట్లు పూర్తి చేయటంతో మే నెలలో కోతలు కోయాల్సి వస్తోందని చెబుతున్నారు. నెల రోజులు పంట ఆలస్యం కావటంతో వర్షాలకు పంట కోల్పోయే ప్రమాదంలో పడ్డామని అంటున్నారు.
మొలకెత్తనున్న మొక్కజొన్న
జిల్లా వ్యాప్తంగా రబీ సీజన్‌లో దాదాపు 65 వేల ఎకరాల్లో మొక్కజొన్న సాగైంది. పలుచోట్ల కోత, రాశులపైనా ఉంది. అకాల వర్షం కురవటంతో అవనిగడ్డ, మోపిదేవి, చల్లపల్లి తదితర మండలాల్లో రాశులపై ఉన్న మొక్కజొన్న తడిచి మొలకెత్తే ప్రమాదం ఉందని రైతులు చెబుతున్నారు.
మిల్లర్ల ఇష్టారాజ్యం
అకాల వర్షంతో ధాన్యం తడిచిపోయింది కాబట్టి ధర తగ్గిపోతుందని మిల్లర్లు కొత్త పల్లవి అందుకున్నారు. వర్షం కురిసి 10 గంటలైనా కాకముందే మిల్లర్లు ఈ తరహా ప్రచారం చేస్తుండటంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. అకాల వర్షాలకు తడిచి రంగుమారిన ధాన్యాన్ని మద్దతు ధరకే కొనుగోలు చేసేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.