హమ్మయ్య.. చల్లబడింది
- పలకరించిన తొలకరి
- జిల్లా వ్యాప్తంగా చిరు జల్లులు
- చల్లబడిన వాతావరణం
- తగ్గిన ఉష్ణోగ్రతలు
- తేరుకున్న జనం
హమ్మయ్య.. జిల్లా చల్లబడింది. భానుడి సెగభగలతో నిన్నటి వరకు అల్లాడిన జనం వాతావరణంలో వచ్చిన మార్పుతో ఊరట చెందారు. శుక్రవారం జిల్లా అంతటా ఆకాశం మేఘావృతమై పలుచోట్ల చిరు జల్లులు, వర్షాలు కురిశాయి. దీంతో రైతులు సాగుకు సమాయత్తమవుతున్నారు.
మచిలీపట్నం : జిల్లాను తొలకరి ఎట్టకేలకు పలకరించింది. జిల్లావ్యాప్తంగా శుక్రవారం చిరు జల్లులు కురిశాయి. ఉష్ణోగ్రతలు కూడా గణనీయంగా తగ్గాయి. నిన్నటివరకు మండే ఎండలు, వడగాలులతో అల్లాడిపోయిన జనం వాతావరణంలో ఒక్కసారిగా వచ్చిన మార్పుతో సేదతీరారు. నైరుతి రుతుపవనాలు, ఒరిస్సా నుంచి తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి ప్రభావంతో జిల్లా అంతటా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆకాశం మేఘావృతమైంది.
జిల్లా అంతటా చిరు జల్లులు కురవటంతో 4.3 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. మోపిదేవి మండలంలో అత్యధికంగా 37.2 మిల్లీమీటర్లు, గుడ్లవల్లేరు మండలంలో అత్యల్పంగా ఒక మిల్లీమీటరు వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. నైరుతీ రుతుపవనాలు మరింతగా విస్తరిస్తే తొలకరి ప్రవేశించినట్లేనని రైతులు భావిస్తున్నారు. ఈ నెల 29 నుంచి రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతుండటంతో ఖరీఫ్ సీజన్‌పై రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. మైలవరం తదితర ప్రాంతాల్లో పత్తి విత్తనాలు చల్లుతున్నారు. ఇదే వాతావరణం కొనసాగితే వ్యవసాయానికి భూములు అనుకూలంగా మారుతాయని రైతులు చెబుతున్నారు.
పలు ప్రాంతాల్లో చిరు జల్లులు...
మచిలీపట్నం పరిసర ప్రాంతాల్లో శుక్రవారం తెల్లవారుజాము నుంచి చిరు జల్లులు కురిశాయి. సాయంత్రం వరకు చినుకులు పడుతూనే ఉన్నాయి. కైకలూరు నియోజకవర్గంలోని ముదినేపల్లి, కలిదిండి, మండవల్లి, కైకలూరు తదితర ప్రాంతాల్లో చిరు జల్లులు కురిశాయి. గుడివాడ పరిసర ప్రాంతాల్లో ఒక మోస్తరు వర్షం నమోదైంది. అవనిగడ్డ నియోజకవర్గంలో మోపిదేవి, అవనిగడ్డ, నాగాయలంక, చల్లపల్లి తదితర ప్రాంతాల్లో ఒక మోస్తరు వర్షం కురిసింది. పామర్రు, గన్నవరం ప్రాంతాల్లో సన్నపాటి చినుకులతో కూడిన వర్షం పడింది. నూజివీడులో వర్షపాతం అంతగా నమోదు కాకున్నా వాతావరణం చల్లబడింది. పెనుగంచిప్రోలు, నందిగామ, మైలవరం తదితర ప్రాంతాల్లో వాతావరణం చల్లబడి ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గాయి.
వర్షపాతం వివరాలివీ...
జగ్గయ్యపేటలో 13.4 మిల్లీమీటర్లు, వత్సవాయి 4.2, పెనుగంచిప్రోలు 4.6, నందిగామ 13.6, చందర్లపాడు 5.2, కంచికచర్ల 14.2, వీరులపాడు 1.2, ఇబ్రహీంపట్నం 3.6, జి.కొండూరు 1.2, మైలవరం 4.6, గంపలగూడెం 4.6, రెడ్డిగూడెం 1.8, విజయవాడ రూరల్ 9, పెనమలూరు 9.2, తోట్లవల్లూరు 7.8, కంకిపాడు 11.2, గన్నవరం 3.4, ముసునూరు 2.2, ఉయ్యూరు, పమిడిముక్కల 1, చల్లపల్లి 2.2, అవనిగడ్డ 8.2, నాగాయలంక 31, కోడూరు 6.4, పెదపారుపూడి 5.2, నందివాడ 3.6, గుడివాడ 2.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.