పంటలు గతేడాదికంటే బాగుంటాయి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వర్షాభావ పరిస్థితులపై నెలకొన్న ఆందోళన క్రమేపి తగ్గుతోందని, గత సంవత్సరం కంటే ఈ ఏడాది పంటల దిగుబడి బాగుంటుందని మురుగప్ప గ్రూపు అంచనా వేస్తోంది. ప్రస్తుతం సాధారణం కంటే 15 శాతం తక్కువ వర్షాలు పడ్డాయని, ఈ శాతం 10 శాతానికి పరిమితమవుతుందని, దీనిపై అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మురుగప్ప గ్రూపు చైర్మన్ ఎ.వెలయన్ పేర్కొన్నారు.
వర్షాలు ఆలస్యమైనా ఇప్పుడిప్పుడే రిజర్వాయర్లలోకి నీరు చేరుతోందని, దీంతో రబీ పంటల దిగుబడి బాగుంటుందని అంచనా వేస్తున్నట్లు ఆయన తెలిపారు. కోరమాండల్ గ్రూపునకు ప్రధాన మార్కెట్లుగా ఉన్న కర్నాటక, ఆంధ్రా, ఒరిస్సాలపై వచ్చే మూడు వారాల్లో ఒక స్పష్టత వస్తుందన్నారు. మొత్తంమీద చూస్తే సెప్టెంబర్ నుంచి ఆర్థిక వ్యవస్థ వృద్ధిరేటు మెరుగవుతుందని అంచనా వేస్తున్నామని, దీంతో మా గ్రూపు పనితీరు కూడా బాగుంటుందన్నారు.
అత్యంత చౌకగా చక్కెర
దేశంలో చక్కెర ధరలు ప్రపంచంలోనే అత్యంత చౌకగా ఉన్నాయని, దీంతో చక్కెర దిగుమతులపై సుంకాలు పెంచడంతో దేశీయ పరిశ్రమకు కొంత మేర ప్రయోజనం చేకూరుతుందన్నారు. ఇప్పటికే 8 మిలియన్ టన్నుల చక్కెర నిల్వలు ఉండగా, ఈ ఏడాది 25 మిలియన్ టన్నుల చక్కెర ఉత్పత్తి అవుతుందని అంచనా వేస్తున్నట్లు వెలయన్ తెలిపారు. ఒక్క ఉత్తర ప్రదేశ్ తప్ప ఆంధ్రప్రదేశ్‌తో సహా కర్నాటక, మహారాష్ట్రలో గత ఏడాది కంటే ఈ సారి చెరకు సాగు పెరిగిందన్నారు.
సీఎస్‌ఆర్ కింద పాఠశాలకు రూ.4.55 కోట్ల విరాళం
మురుగప్పా గ్రూపునకు చెందిన కోరమాండల్ ఇంటర్నేషనల్ సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్‌లోని ఉద్భవ్ పాఠశాలను దత్తత తీసుకుంది. ఇందుకోసం ఐఐఎం అహ్మదాబాద్ అలుమినీ హైదరాబాద్ చాప్టర్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. దీని కింద పాఠశాల నిర్వహణకు ఏటా అయ్యే రూ. 70 లక్షల వ్యయాన్ని కోరమాండల్ భరించనుంది. ఇందుకోసం మొత్తం రూ.4.55 కోట్లు ఉద్భవ్ పాఠశాలకు విరాళంగా ఇచ్చింది. ఈ సందర్భంగా వెలయన్ మాట్లాడుతూ ఈ ఏడాది సీఎస్‌ఆర్ కింద సుమారు రూ. 15 కోట్లు వ్యయం చేయనున్నట్లు తెలిపారు.