Murugappa Group
-
ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్ లాభం డౌన్
న్యూఢిల్లీ: మురుగప్ప గ్రూప్ కంపెనీ ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆఫ్ ఇండియా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024–25) రెండో త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు సాధించింది. జులై–సెపె్టంబర్(క్యూ2)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 14 శాతం క్షీణించి రూ. 299 కోట్లకు పరిమితమైంది. అధిక వ్యయాలు ప్రభావం చూపాయి. గతేడాది(2023–24) ఇదే కాలంలో రూ. 346 కోట్లు ఆర్జించింది. అయితే మొత్తం ఆదాయం రూ. 4,169 కోట్ల నుంచి రూ. 4,783 కోట్లకు ఎగసింది. మొత్తం వ్యయాలు సైతం రూ. 3,868 కోట్ల నుంచి రూ. 4,569 కోట్లకు పెరిగాయి. కాగా.. ఆదాయంలో ఇంజినీరింగ్ విభాగం నుంచి రూ. 1,323 కోట్లు లభించగా.. మెటల్ ఆధారిత ప్రొడక్టుల నుంచి రూ. 404 కోట్లు, మొబిలిటీ బిజినెస్ నుంచి రూ. 168 కోట్లు చొప్పున అందుకుంది. ఫలితాల నేపథ్యంలో టీఐఇండియా షేరు ఎన్ఎస్ఈలో దాదాపు 4 శాతం పతనమై రూ. 4,312 వద్ద ముగిసింది. -
ఇండియన్ రైల్వేస్‌దే మురుగప్ప గోల్డ్‌కప్
చెన్నై: భారత్‌లో అతి పురాతన హాకీ టోర్నమెంట్లలో ఒకటైన ఎంసీసీ–మురుగప్ప గోల్డ్ కప్ టోర్నమెంట్లో డిఫెండింగ్ చాంపియన్ ఇండియన్ రైల్వేస్ జట్టు టైటిల్ నిలబెట్టుకుంది. 1901లో తొలిసారి మొదలైన ఈ టోర్నీ ఇప్పటి వరకు 95 సార్లు జరిగింది. ఫైనల్లో రైల్వేస్ జట్టు 5–3 గోల్స్ తేడాతో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) జట్టుపై ఘనవిజయం సాధించింది. రైల్వేస్ తరఫున యువరాజ్ వాలీ్మకి (18వ, 58వ ని.లో) రెండు గోల్స్ చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ముందుగా గుర్సాహిబ్జిత్ సింగ్ 7వ నిమిషంలో పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలచి జట్టుకు శుభారంభమిచ్చారు. రెండు నిమిషాల వ్యవధిలోనే సిమ్రన్‌జ్యోత్ సింగ్ (9వ ని.లో) ఫీల్డ్‌గోల్ చేసి రైల్వేస్ ఆధిక్యాన్ని డబుల్ చేశాడు. తర్వాత కాసేపటికి యువరాజ్ చేసిన గోల్‌తో 3–0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఎట్టకేలకు ఐఓసీ ఆటగాడు తలీ్వందర్ సింగ్ (23వ ని.లో) చేసిన గోల్‌తో జట్టు ఖాతా తెరిచింది. ఆరు నిమిషాల వ్యవధిలో లభించిన పెనాల్టీ కార్నర్‌ను గుజిందర్ సింగ్ (ఐఓసీ) గోల్‌గా మలచడంతో రెండు క్వార్టర్లు ముగిసేసరికి ఐఓసీ 2–3తో రైల్వేస్ ఆధిక్యానికి గండికొట్టింది. కానీ మూడో క్వార్టర్ మొదలైన కాసేపటికే ముకుల్ శర్మ (35వ ని.లో), చివరి క్వార్టర్లో యువరాజ్ చేసిన గోల్స్‌తో రైల్వేస్‌కు విజయం ఖాయమైంది. ఐఓసీ తరఫున రాజ్బిర్ సింగ్ (58వ ని.లో) గోల్ చేసినా లాభం లేకపోయింది. -
భారత కంపెనీలతో యాపిల్ ఒప్పందం.. ఎందుకంటే..
ప్రపంచ నం.1 కంపెనీ అయిన యాపిల్ భారత్‌లో కార్యకలాపాలపై ఆసక్తిగా ఉందని తెలుస్తుంది. తాజాగా ఐఫోన్ కెమెరా మాడ్యుల్స్ సరఫరా చేసేందుకు భారత కంపెనీలతో యాపిల్ ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు తెలిసింది. ఈమేరకు కొన్ని మీడియా సంస్థలు వార్తాకథనాలు ప్రచురించాయి. ఐఫోన్ కెమెరా మాడ్యుల్స్ తయారీకి టాటా గ్రూప్‌నకు చెందిన టైటాన్ కంపెనీతో, మురుగప్ప గ్రూప్‌తో యాపిల్ చర్చలు జరుపుతున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. ఒకవేళ ఈ ఒప్పందం కుదిరితే కుపెర్టినో కంపెనీ తన కార్యకలాపాలను చైనాతోపాటు భారత్‌లో విస్తరించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ కుపెర్టినో కంపెనీ చైనాలో ఐఫోన్ కెమెరాలను తయారుచేస్తోంది. ఈ ఒప్పందానికి సంబంధించి మరో 5-6 నెలల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు తెలిపాయి. టైటాన్ గడియారాలు, ఇతర ఆభరణాల తయారీలో ప్రత్యేకత చాటుకుంటోంది. చెన్నై ప్రధాన కార్యాలయంగా ఉన్న మురుగప్ప గ్రూప్‌నకు ఇంజినీరింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, కెమికల్స్ రంగంలో 100 ఏళ్ల అనుభవం ఉంది. ఈనేపథ్యంలో ఈ కంపెనీతో ఒప్పందం ఖరారు చేసుకోవచ్చని పరిశ్రమ వర్గాల ద్వారా తెలిసింది. ఎలక్ట్రానిక్స్, కాంపోనెంట్స్ రంగంలో తన వ్యాపారాన్ని విస్తరించాలని నోయిడాకు చెందిన కెమెరా మాడ్యూల్ తయారీ సంస్థ మోషిన్ ఎలక్ట్రానిక్స్‌లో మురుగప్ప గ్రూప్ 76% వాటాను కొనుగోలు చేసింది. బెంగళూరు ప్రధాన కార్యాలయంగా ఉన్న టైటాన్ కంపెనీ ఇంజినీరింగ్, ఆటోమేషన్‌లో సేవలందిస్తోంది. హై ప్రెసిషన్ కాంపోనెంట్ తయారీ, ఇంజినీరింగ్ డిజైన్ సర్వీస్‌లను అందుబాటులోకి తీసుకొచ్చింది. రక్షణ, ఏరోస్పేస్ వంటి పరిశ్రమల్లోను సేవలందిస్తోంది. యాపిల్ జనవరి నివేదిక ప్రకారం.. 2024-25 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి భారత్‌లో దాదాపు రూ.1 లక్ష కోట్ల విలువైన ఐఫోన్లను తయారుచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దాంతో స్థానికంగా ఆ కంపెనీతో భాగస్వామ్యం కుదుర్చుకున్న కంపెనీల ఉత్పత్తి సామర్థ్యం పెరిగింది. ఇండియాలో తయారవుతున్న దాదాపు 70 శాతం ఐఫోన్లు ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. ఇది మరింత పెరిగి అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఇదీ చదవండి: ప్రపంచంలోని రద్దీ ఎయిర్‌పోర్ట్‌ల్లో భారత విమానాశ్రయం కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్ఐ) పథకంలో భాగంగా యాపిల్ భారత్‌లో తయారీకి ముందుకు వచ్చింది. అందులో భాగంగా ఇప్పటికే ఫాక్స్‌కాన్, పెగాట్రాన్, విస్ట్రాన్ వంటి ఎలక్ట్రానిక్స్ కంపెనీలతో కలిసి పనిచేస్తోంది. -
వైజాగ్‌లో కోరమాండల్ కొత్త ప్లాంటు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మురుగప్ప గ్రూప్ సంస్థ, ఎరువుల తయారీ దిగ్గజం కోరమాండల్ ఇంటర్నేషనల్ తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో భారీగా పెట్టుబడులు ప్రకటించింది. విశాఖపట్నంలోని తమ ఎరువుల కర్మాగారంలో కొత్తగా సల్ఫ్యూరిక్ యాసిడ్ ప్లాంటు ఏర్పాటు చేయనున్నట్లు మంగళవారం వెల్లడించింది. ఇందుకోసం సుమారు రూ. 400 కోట్లు వెచ్చిస్తోన్నట్లు సంస్థ తెలిపింది. దీనికి సంబంధించి ఎంఈసీఎస్ (మోన్శాంటో ఎన్విరో–కెమ్ సిస్టమ్స్), టీకేఐఎస్ (థిసెన్‌క్రప్ ఇండస్ట్రియల్ సొల్యూషన్స్)తో సాంకేతిక భాగస్వామ్య ఒప్పందాలు కూడా కుదుర్చుకుంది. రోజుకు 1,650 టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ఈ ప్లాంటును ఏర్పాటు చేస్తున్నట్లు కోరమాండల్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ అరుణ్ అలగప్పన్ తెలిపారు. భారత్ ప్రస్తుతం సల్ఫ్యూరిక్ యాసిడ్ అత్యధికంగా దిగుమతి చేసుకునే దేశాల్లో మూడో స్థానంలో ఉందని ఆయన పేర్కొన్నారు. దేశీయంగా ఉత్పత్తిని పెంచుకుని, దిగుమతులు తగ్గించుకోవాలన్న స్వావలంబన భారత్ లక్ష్య సాకారం దిశగా కొత్త ప్లాంటు ఏర్పాటు నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. ప్రస్తుతం వార్షికంగా 6 లక్షల టన్నులుగా ఉన్న సల్ఫ్యూరిక్ యాసిడ్ ఉత్పత్తి సామర్థ్యం .. మరో 5 లక్షల టన్నుల మేర పెరిగి 11 లక్షల టన్నులకు చేరుతుంది. ఎరువుల ఉత్పత్తికి అవసరమైన ముడి వస్తువులను అందుబాటులో ఉంచుకోవాలన్న దీర్ఘకాలిక లక్ష్యానికి అనుగుణంగా ఈ పెట్టుబడులు చేస్తున్నట్లు అరుణ్ తెలిపారు. ప్రస్తుతం వైజాగ్‌లోని కోరమాండల్ ఫ్యాక్టరీ ఏటా 13 లక్షల టన్నుల కాంప్లెక్స్ ఎరువులు, దాదాపు 4 లక్షల టన్నుల క్యాప్టివ్ ఫాస్ఫోరిక్ యాసిడ్ ఉత్పత్తి సామర్థ్యంతో పనిచేస్తోంది. -
పేమెంట్ బ్యాంక్ రేసు నుంచి వైదొలుగుతున్నాం
చోళమండలం ఫైనాన్స్ వెల్లడి ముంబై: పేమెంట్ బ్యాంకుల రేసు నుంచి వైదొలుగుతున్నామని మురుగప్ప గ్రూప్‌కు చెందిన చోళమండలం ఇన్వెస్ట్మెంట్ అండ్ ఫైనాన్స్ కంపెనీ బీఎస్ఈకి తెలిపింది. పేమెంట్ బ్యాంక్ ఏర్పాటు కోసం తమ అనుబంధ సంస్థ చోళమండలం డిస్ట్రిబ్యూషన్ సర్వీసెస్(సీడీఎస్ఎల్) ఆర్బీఐ నుంచి సూత్రప్రాయ ఆమోదాన్ని పొందిందని, ఈ ఆమోదాన్ని తిరిగి ఆర్బీఐకే సమర్పిస్తున్నామని పేర్కొంది. పేమెంట్ బ్యాంకులకు సంబంధించిన వ్యాపారంలో తీవ్రమైన పోటీ ఉంటుందని, వ్యాపారం ప్రారంభించడానికే చాలా కాలం పడుతుందని, అందుకే ఈ రంగం నుంచి తప్పుకుంటున్నామని వివరించింది. చెల్లింపు బ్యాంక్ వ్యాపార కార్యకలాపాల కోసం సీడీఎస్‌ఎల్‌లో రూ.75 కోట్లు పెట్టుబడులు పెట్టాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నామని పేర్కొంది. ఆర్బీఐ గత ఏడాది ఆగస్టులో 11 సంస్థలకు పేమెంట్ బ్యాంకులకు సంబంధించి సూత్రప్రాయ ఆమోదాన్ని తెలిపింది. ఈ పేమెంట్ బ్యాంకులు గ్రామీణ ప్రాంతాల్లో రెమిటెన్స్‌ల సేవలు నిర్వహించాల్సి ఉంటుంది. గరిష్టంగా రూ. 1 లక్ష వరకూ డిపాజిట్లు అంగీకరించవచ్చు. ఖాతాదారులకు ఎలాంటి రుణాలు ఇవ్వడానికి లేదు. మురుగప్ప గ్రూప్‌కు చెందిన ఆర్థిక విభాగం, సీడీఎస్ఎల్.. ఇప్పటికే వాహన, ఎస్ఎంఈ, గృహ రుణాలందిస్తోంది. ఇన్వెస్టర్ అడ్వైజరీ సేవలను కూడా అందజేస్తోంది. -
మురుగప్ప స్థూల లాభం 26 శాతం అప్
హైదరాబాద్: మురుగప్ప గ్రూప్ గత ఆర్థిక సంవత్సరంలో రూ.1,780 కోట్ల స్థూల లాభాన్ని ఆర్జించింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరపు స్థూల లాభంతో పోల్చితే ఇది 26 శాతం అధికమని మురుగప్ప గ్రూప్ ఒక ప్రకటనలో తెలిపింది. 2013-14 ఆర్థిక సంవత్సరంలో రూ.24,350 కోట్లుగా ఉన్న టర్నోవర్ 2014-15 ఆర్థిక సంవత్సరంలో 11 శాతం వృద్ధితో రూ.26,926 కోట్లకు చేరిందని పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరంలో తమ పనితీరు మెరుగుపడిందని, మరిన్ని ప్రాంతాలకు విస్తరించామని తెలిపింది. కోరమాండల్ ఇంటర్నేషనల్, ఈఐడీ ప్యారీ, ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ఇండియా, కార్బొరండమ్ యూనివర్శల్, చోళమండలం ఎంఎస్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ, చోళమండలం ఇన్వెస్ట్మెంట్ అండ్ ఫైనాన్స్ కంపెనీ... ఇవన్నీ మురుగప్ప గ్రూప్ కంపెనీలే. -
పంటలు గతేడాదికంటే బాగుంటాయి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వర్షాభావ పరిస్థితులపై నెలకొన్న ఆందోళన క్రమేపి తగ్గుతోందని, గత సంవత్సరం కంటే ఈ ఏడాది పంటల దిగుబడి బాగుంటుందని మురుగప్ప గ్రూపు అంచనా వేస్తోంది. ప్రస్తుతం సాధారణం కంటే 15 శాతం తక్కువ వర్షాలు పడ్డాయని, ఈ శాతం 10 శాతానికి పరిమితమవుతుందని, దీనిపై అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మురుగప్ప గ్రూపు చైర్మన్ ఎ.వెలయన్ పేర్కొన్నారు. వర్షాలు ఆలస్యమైనా ఇప్పుడిప్పుడే రిజర్వాయర్లలోకి నీరు చేరుతోందని, దీంతో రబీ పంటల దిగుబడి బాగుంటుందని అంచనా వేస్తున్నట్లు ఆయన తెలిపారు. కోరమాండల్ గ్రూపునకు ప్రధాన మార్కెట్లుగా ఉన్న కర్నాటక, ఆంధ్రా, ఒరిస్సాలపై వచ్చే మూడు వారాల్లో ఒక స్పష్టత వస్తుందన్నారు. మొత్తంమీద చూస్తే సెప్టెంబర్ నుంచి ఆర్థిక వ్యవస్థ వృద్ధిరేటు మెరుగవుతుందని అంచనా వేస్తున్నామని, దీంతో మా గ్రూపు పనితీరు కూడా బాగుంటుందన్నారు. అత్యంత చౌకగా చక్కెర దేశంలో చక్కెర ధరలు ప్రపంచంలోనే అత్యంత చౌకగా ఉన్నాయని, దీంతో చక్కెర దిగుమతులపై సుంకాలు పెంచడంతో దేశీయ పరిశ్రమకు కొంత మేర ప్రయోజనం చేకూరుతుందన్నారు. ఇప్పటికే 8 మిలియన్ టన్నుల చక్కెర నిల్వలు ఉండగా, ఈ ఏడాది 25 మిలియన్ టన్నుల చక్కెర ఉత్పత్తి అవుతుందని అంచనా వేస్తున్నట్లు వెలయన్ తెలిపారు. ఒక్క ఉత్తర ప్రదేశ్ తప్ప ఆంధ్రప్రదేశ్‌తో సహా కర్నాటక, మహారాష్ట్రలో గత ఏడాది కంటే ఈ సారి చెరకు సాగు పెరిగిందన్నారు. సీఎస్ఆర్ కింద పాఠశాలకు రూ.4.55 కోట్ల విరాళం మురుగప్పా గ్రూపునకు చెందిన కోరమాండల్ ఇంటర్నేషనల్ సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్‌లోని ఉద్భవ్ పాఠశాలను దత్తత తీసుకుంది. ఇందుకోసం ఐఐఎం అహ్మదాబాద్ అలుమినీ హైదరాబాద్ చాప్టర్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. దీని కింద పాఠశాల నిర్వహణకు ఏటా అయ్యే రూ. 70 లక్షల వ్యయాన్ని కోరమాండల్ భరించనుంది. ఇందుకోసం మొత్తం రూ.4.55 కోట్లు ఉద్భవ్ పాఠశాలకు విరాళంగా ఇచ్చింది. ఈ సందర్భంగా వెలయన్ మాట్లాడుతూ ఈ ఏడాది సీఎస్ఆర్ కింద సుమారు రూ. 15 కోట్లు వ్యయం చేయనున్నట్లు తెలిపారు. -
కోరమాండల్ ఆదాయం @ 10 వేల కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎరువులు, సస్యరక్షణ ఉత్పత్తుల తయారీలో ఉన్న కోరమాండల్ ఇంటర్నేషనల్ రూ.10 వేల కోట్ల మార్కును దాటింది. 2013-14 ఆర్థిక సంవత్సరం కన్సాలిడేటెడ్ ఫలితాల్లో రూ.10,053 కోట్ల టర్నోవర్ నమోదు చేసింది. అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే టర్నోవరు రూ.9,034 కోట్లుంది. నికర లాభం 17 శాతం తగ్గి రూ.432 కోట్ల నుంచి రూ.356 కోట్లకు పడిపోయింది. మార్చి త్రైమాసికంలో నికర లాభం ఏకంగా రూ.12 కోట్ల నుంచి రూ.81 కోట్లకు ఎగబాకింది. టర్నోవరు రూ.2,079 కోట్ల నుంచి రూ.2,182 కోట్లను తాకింది. 2013-14కుగాను రూ.1 ముఖ విలువగల ఒక్కో షేరుపై రూ.4.50 డివిడెండు చెల్లించాలని బోర్డు ప్రతిపాదించింది. ఫాస్పేటేతర ఎరువులు, కొత్త విభాగాలతో నాల్గవ తైమాసికంలో లాభం ఏడింతలైందని కోరమాండల్ ఎండీ కపిల్ మెహన్ మంగళవారమిక్కడ మీడియాకు తెలిపారు. మొత్తంగా చూస్తే అధిక పన్నులు, వడ్డీల మూలంగా 2013-14లో లాభం తగ్గిందన్నారు. రెండేళ్లలో ప్లాంటు.. వ్యవసాయ పనిముట్ల తయారీలో ఉన్న యాన్మర్ అండ్ కో అనే జపాన్ కంపెనీతో ఇటీవలే కోరమాండల్ సంయుక్త భాగస్వామ్యం కుదుర్చుకుంది. భాగస్వామ్య కంపెనీ దక్షిణాదిన ప్లాంటును ఏర్పాటు చేస్తోంది. ఇందుకోసం రూ.40 కోట్లు వెచ్చిస్తున్నారు. కోరమాండల్ వాటా రూ.16 కోట్లు. ప్లాంటులో వరి నాటే యంత్రాలు, కోత యంత్రాలను తొలుత అసెంబ్లింగ్ చేస్తారు. రానున్న రోజుల్లో దేశీయంగా తయారీ చేపడతారు. రెండేళ్లలో ప్లాంటులో అసెంబ్లింగ్ కార్యకలాపాలు ప్రారంభమవుతాయి. నౌకాశ్రయం సమీపంలో ప్లాంటు స్థాపిస్తామని, ఇంకా ఎక్కడ ఏర్పాటు చేసేది నిర్ణయించలేదని కంపెనీ తెలిపింది. కంపెనీ రిటైల్ విభాగమైన మన గ్రోమోర్ ఔట్లెట్లను ఫ్రాంచైజీ విధానంలోనూ పరిచయం చేయనున్నట్టు కంపెనీ సీఎఫ్‌వో శంకర సుబ్రమణియన్ పేర్కొన్నారు. వ్యవసాయం సవాలే.. వచ్చే 10 ఏళ్లలో భారత్‌లో వ్యవసాయం పెద్ద సవాల్‌గా మారనుందని కపిల్ మెహన్ అన్నారు. ‘కార్మికులు వ్యవసాయం వదిలి కొత్త అవకాశాలు వెతుక్కుంటున్నారు. వ్యవసాయేతర రంగాల్లో ఉపాధి క్రమంగా అవకాశాలు పెరుగుతున్నాయి. పారిశ్రామిక కారిడార్లు వస్తున్నాయి. సమస్య నుంచి బయటపడాలంటే వ్యవసాయంలో యాంత్రికీకరణ తప్పదు. యాంత్రికీకరణతో 10-15 శాతం అధిక ఉత్పాదకత నమోదవుతోంది’ అని కపిల్ మెహన్ స్పష్టం చేశారు. ఎల్‌నినో ప్రభావం 5 శాతం లోపే ఉండొచ్చని ఆయన పేర్కొన్నారు.