కోరమాండల్ ఆదాయం @ 10 వేల కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎరువులు, సస్యరక్షణ ఉత్పత్తుల తయారీలో ఉన్న కోరమాండల్ ఇంటర్నేషనల్ రూ.10 వేల కోట్ల మార్కును దాటింది. 2013-14 ఆర్థిక సంవత్సరం కన్సాలిడేటెడ్ ఫలితాల్లో రూ.10,053 కోట్ల టర్నోవర్ నమోదు చేసింది. అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే టర్నోవరు రూ.9,034 కోట్లుంది. నికర లాభం 17 శాతం తగ్గి రూ.432 కోట్ల నుంచి రూ.356 కోట్లకు పడిపోయింది.
మార్చి త్రైమాసికంలో నికర లాభం ఏకంగా రూ.12 కోట్ల నుంచి రూ.81 కోట్లకు ఎగబాకింది. టర్నోవరు రూ.2,079 కోట్ల నుంచి రూ.2,182 కోట్లను తాకింది. 2013-14కుగాను రూ.1 ముఖ విలువగల ఒక్కో షేరుపై రూ.4.50 డివిడెండు చెల్లించాలని బోర్డు ప్రతిపాదించింది. ఫాస్పేటేతర ఎరువులు, కొత్త విభాగాలతో నాల్గవ తైమాసికంలో లాభం ఏడింతలైందని కోరమాండల్ ఎండీ కపిల్ మెహన్ మంగళవారమిక్కడ మీడియాకు తెలిపారు. మొత్తంగా చూస్తే అధిక పన్నులు, వడ్డీల మూలంగా 2013-14లో లాభం తగ్గిందన్నారు.
రెండేళ్లలో ప్లాంటు..
వ్యవసాయ పనిముట్ల తయారీలో ఉన్న యాన్మర్ అండ్ కో అనే జపాన్ కంపెనీతో ఇటీవలే కోరమాండల్ సంయుక్త భాగస్వామ్యం కుదుర్చుకుంది. భాగస్వామ్య కంపెనీ దక్షిణాదిన ప్లాంటును ఏర్పాటు చేస్తోంది. ఇందుకోసం రూ.40 కోట్లు వెచ్చిస్తున్నారు. కోరమాండల్ వాటా రూ.16 కోట్లు. ప్లాంటులో వరి నాటే యంత్రాలు, కోత యంత్రాలను తొలుత అసెంబ్లింగ్ చేస్తారు. రానున్న రోజుల్లో దేశీయంగా తయారీ చేపడతారు. రెండేళ్లలో ప్లాంటులో అసెంబ్లింగ్ కార్యకలాపాలు ప్రారంభమవుతాయి. నౌకాశ్రయం సమీపంలో ప్లాంటు స్థాపిస్తామని, ఇంకా ఎక్కడ ఏర్పాటు చేసేది నిర్ణయించలేదని కంపెనీ తెలిపింది. కంపెనీ రిటైల్ విభాగమైన మన గ్రోమోర్ ఔట్‌లెట్లను ఫ్రాంచైజీ విధానంలోనూ పరిచయం చేయనున్నట్టు కంపెనీ సీఎఫ్‌వో శంకర సుబ్రమణియన్ పేర్కొన్నారు.
వ్యవసాయం సవాలే..
వచ్చే 10 ఏళ్లలో భారత్‌లో వ్యవసాయం పెద్ద సవాల్‌గా మారనుందని కపిల్ మెహన్ అన్నారు. ‘కార్మికులు వ్యవసాయం వదిలి కొత్త అవకాశాలు వెతుక్కుంటున్నారు. వ్యవసాయేతర రంగాల్లో ఉపాధి క్రమంగా అవకాశాలు పెరుగుతున్నాయి. పారిశ్రామిక కారిడార్లు వస్తున్నాయి. సమస్య నుంచి బయటపడాలంటే వ్యవసాయంలో యాంత్రికీకరణ తప్పదు. యాంత్రికీకరణతో 10-15 శాతం అధిక ఉత్పాదకత నమోదవుతోంది’ అని కపిల్ మెహన్ స్పష్టం చేశారు. ఎల్‌నినో ప్రభావం 5 శాతం లోపే ఉండొచ్చని ఆయన పేర్కొన్నారు.