ప్రకృతి సేద్య క్రాంతి! | Cultivation Natural light! | Sakshi
Sakshi News home page

ప్రకృతి సేద్య క్రాంతి!

Published Wed, Feb 24 2016 12:23 AM | Last Updated on Sun, Sep 3 2017 6:15 PM

ప్రకృతి సేద్య క్రాంతి!

ప్రకృతి సేద్య క్రాంతి!

♦ తీవ్ర కరువులోనూ మెట్టపొలంలో చక్కని పంట దిగుబడులు
♦ ఎకరానికి పది వేల కొబ్బరి కాయల దిగుబడి
♦ బ్రకోలి తదితర సంప్రదాయేతర పంటల సాగులోనూ అద్భుత ఫలితాలు
♦ కూరగాయల ద్వారా ఎకరానికి రూ. 80 వేలకు పైగా నికరాదాయం
 
 ఇరైవె  ఏళ్లుగా గుప్పెడు రసాయనిక ఎరువు గానీ, చెంచాడు పురుగుమందు గానీ వేయని కొబ్బరి తోట ఎంత అద్భుతంగా ఉంటుంది? ఆఖరికి చుక్క కలుపు మందు కూడా చల్లకుండా, ట్రాక్టర్‌తో ఒక్కసారీ దున్నకుండా ఉంటే ఆ నేల ఎంత సజీవంగా, ఎంత సారవంతంగా ఉంటుంది? అటువంటి తోటలో కొబ్బరి గెలల సోయగం ఎంత కన్నుల పండువగా ఉంటుంది? చెట్ల మధ్య ఖాళీ స్థలాలను కాడెద్దుల అరకతో దున్ని అంతరపంటలుగా కూరగాయలు పండిస్తే ఆ పచ్చని పంటల దిగుబడి ఎంత అద్భుతంగా ఉంటుంది? అంతేకాదు.. వాన నీటిని భూమికి కడుపునిండా తాపితే.. ఎన్నడూ లేనంత కరువు ముంచుకొచ్చి గ్రామంలో బోర్లు, పంటలు నిలువునా ఎండిపోయినా.. వందడుగుల్లోతు బోర్లే మూడించుల నీళ్లు పోయకుండా ఉంటాయా? కొబ్బరితోపాటు చలి ప్రాంతపు పంటలైన కాలీఫ్లవర్, బ్రకోలి పూలు కరువు కాలపు మండుటెండల్లోనూ విరగపండకుండా ఉంటాయా?.. ఇదంతా అందమైన ఊహ కాదు. కళ్లెదుటున్న వాస్తవం. పశ్చిమ గోదావరి జిల్లా మెట్ట ప్రాంతంలో క్రాంతికుమార్‌రెడ్డి అనే ప్రకృతి వ్యవసాయదారుడు నిర్మించుకున్న పచ్చని సేద్య సౌధం ఇది..
 
 పంట మొక్కలకు రసాయనిక ఎరువులు గుప్పించడం కాదు.. భూమికి బలిమినివ్వటమే ప్రకృతి సేద్యపు మూల సూత్రం. ఈ సూత్రాన్ని తు.చ. తప్పకుండా పాటిస్తూ కొబ్బరి తోటలో బ్రకోలి, కాలీఫ్లవర్, బంగాళదుంప, బీట్ రూట్ వంటి సంప్రదాయేతర కూరగాయ పంటలను ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో సాగు చేస్తూ.. అబ్బురపరిచే దిగుబడులు పొందుతున్నారు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన రైతు డా. కనమతరెడ్డి క్రాంతికుమార్ రెడ్డి. రైతు కుటుంబంలో జన్మించి సుస్థిర వ్యవసాయంపై పి.హెచ్.డి. పట్టా పొందిన ఆయన ప్రకృతి సేద్యాన్నే వృత్తిగా స్వీకరించారు. చింతలపూడి మండలం ప్రగడవరంలోని తమ 35 ఎకరాల్లో పామాయిల్, కొబ్బరి తోటలు సాగు చేస్తున్నారు. 30 ఎకరాల్లో పామాయిల్ తోట ఉంది. ఐదెకరాల కొబ్బరి తోటలో కోకోను అంతర పంటగా సాగు చేస్తున్నారు. కొబ్బరి తోటకు 15 ఏళ్లుగా రసాయనిక ఎరువులు, పురుగుమందులు వాడలేదు. భాస్కర్ సావే వంటి ప్రకృతి సేద్య నిపుణుల బోధనలకు ఆనాడే ప్రభావితుడైన ఆయన తన తోటలో ట్రాక్టర్‌తో ఎన్నడూ దుక్కి చేయలేదు. కలుపును సమస్యగా భావించలేదు. కలుపు మందులు చల్లలేదు. 8 ఏళ్ల క్రితమే జీవామృతంతో పసుపు పండించి ఎకరానికి 30 క్వింటాళ్ల వరకు దిగుబడి సాధించారు.

 కొబ్బరి చెట్ల మధ్య ఖాళీల్లో (సుమారు ఎకరం విస్తీర్ణం) ఈ ఏడాది 15 రకాల కూరగాయ పంటలను ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో పండిస్తున్నారు. అంతరపంటలకు అందించిన నీరు, జీవామృతం తప్ప.. కొబ్బరి తోట కోసం అదనంగా ఖర్చేమీ లేదు. అయినా, కొబ్బరి దిగుబడి రికార్డు స్థాయిలో ఉంది. 130 కొబ్బరి చెట్ల ద్వారా 25 వేల కొబ్బరి కాయల దిగుబడి వచ్చింది. బ్రకోలి, కాలీఫ్లవర్, బంగాళదుంప, బీట్ రూట్ వంటి పంటలను ఈ ప్రాంతంలో మొదటిసారిగా పండిస్తున్నారు. టమాటొ, క్యాబేజి, బెండ, చేమదుంప, పచ్చి మిర్చి, వంగ, దోస, క్యాప్సికం, సొర కాయ, నేతి బీర, అల్లం, పుదీన, ఉల్లితో పాటు ఆకుకూరలు సైతం పండిస్తున్నారు. రసాయన ఎరువులు, పురుగుమందులతోపాటు రసాయనిక కలుపు మందులూ చెంచాడు కూడా వాడకుండా పూర్తిస్థాయిలో ప్రకృతి సేద్యం చేస్తున్నారు. తక్కువ పెట్టుబడితో చక్కని దిగుబడులు పొందుతూ తోటి రైతుల్లో ఆసక్తిని రేకెత్తిస్తుండడం విశేషం. విజయవాడలోని ప్రత్యేక ప్రకృతి వ్యవసాయోత్పత్తుల దుకాణాలకు విక్రయిస్తున్నారు.

 అనూహ్యంగా బ్రకోలి దిగుబడి..
 పది సెంట్ల విస్తీర్ణంలో ప్రయోగాత్మకంగా సాగు చేసిన 800 బ్రకోలి మొక్కలు చక్కని దిగుబడినిచ్చాయి. బ్రకోలిని సాధారణంగా పాలిహౌస్‌లలో, షేడ్‌నెట్ల కింద రెయిజ్‌డ్‌బెడ్లపై ఇన్‌లైన్ డ్రిప్‌తో అతి జాగ్రత్తగా సాగు చేస్తుంటారు. అయితే, ఆరు బయట పొలంలో సాగు చేస్తే అనూహ్యంగా చక్కని దిగుబడినివ్వడం తనకు అమిత ఆశ్చర్యాన్ని కలిగించిందని, కొన్ని బ్రకోలి పూలు 400 గ్రా. బరువు తూగాయని డా. క్రాంతికుమార్‌రెడ్డి తెలిపారు. బ్రకోలి మొక్క నుంచి పూవును కోసిన తర్వాత.. పక్క కొమ్మలకు మళ్లీ పూలు వస్తుండడం తనను మరింత ఆశ్చర్యపరుస్తోందన్నారు. వీటికి విజయవాడ సూపర్‌మార్కెట్లలో కిలో రూ. 200 వరకు ధర పలుకుతుందన్నారు. ఎకరం విస్తీర్ణంలో వేసిన కూరగాయల ద్వారా రూ. 80 వేల నుంచి లక్ష వరకు నికరాదాయం రావచ్చని ఆయన అంచనా వేస్తున్నారు. రసాయనిక వ్యవసాయంతో పోల్చితే తమకు అయిన ఖర్చు సగమేనని, ఇందులో కూలీల ఖర్చే అధికమన్నారు.

 పూర్తి సేంద్రియం కాబట్టే మంచి దిగుబడి..!
 కాగా, క్రాంతికుమార్ రెడ్డి తోటలో బ్రకోలి పంట దిగుబడి అద్భుతంగా వచ్చిందని ఉద్యాన అధికారి సంతోష్ (94410 59624) తెలిపారు. పూర్తిగా సేంద్రియ పద్ధతుల్లో సాగు చేసినందునే పగటి ఉష్ణోగ్రత 35 డిగ్రీలు దాటిన వాతావరణంలోనూ నాణ్యమైన పంట వచ్చిందన్నారు. రసాయనిక ఎరువులు, పురుగుమందులు వాడితే ఇది అసాధ్యమన్నారు. వచ్చే సీజన్‌లో మరింత విస్తారంగా బ్రకోలి సేంద్రియ సాగు చేయిస్తామన్నారు.

 వెల్లుల్లి రసం+ వేపనూనె +గోమూత్రం పిచికారీ
 ప్రతి 10 రోజులకోసారి బోరు నీటి ద్వారా, పిచికారీ ద్వారా పంటలకు జీవామృతాన్ని అందిస్తున్నారు. దేశీ ఆవుల ఎరువు, గొర్రెలు, మేకల ఎరువుతోపాటు పంటలకు జీవామృతాన్ని అందిస్తున్నారు. 100 గ్రా. వెల్లుల్లి పాయలను మెత్తగా నూరి వడకట్టిన రసాన్ని.. 10 లీ. నీటిలో కలిపి పిచికారీ చేసి కాలీఫ్లవర్‌ను ఆశించే బూజు, లద్దె పురుగులను నివారిస్తున్నారు. పిచికారీ చేసేటప్పుడు దీనికి 100 గ్రా. వేపనూనెతోపాటు అర లీ. గోమూత్రాన్ని కలుపుతున్నారు. వేపనూనె వికర్షకంగా పనిచేయటం వల్ల కీటకాలు మొక్కలను ఆశించవు. గో మూత్రం వల్ల మొక్కలకు పోషకాలు అందుతాయి అంటారు క్రాంతికుమార్‌రెడ్డి.

 వాననీటి సంరక్షణతో సాగునీటి భద్రత
 పొలం మధ్యలో నుంచి ప్రవహిస్తున్న వాగులో మూడు చోట్ల కొండరాళ్లతో రెండేళ్ల క్రితం చెక్‌డ్యామ్‌లు నిర్మించారు. గత ఏడాది చెక్ డ్యామ్‌ల మీదుగా వాన నీరు ప్రవహించింది. ఈ ఏడాది వర్షాలు బాగా తగ్గిపోవడంతో వాన నీరంతా చెక్‌డ్యామ్‌ల వద్దే భూమిలోకి ఇంకింది. తీవ్ర కరువు పరిస్థితుల వల్ల గ్రామ పరిసర ప్రాంత పొలాల్లో బోర్లు, మొక్కజొన్న తదితర పంటలు ఇప్పటికే నిలువునా ఎండిపోయాయి. అయినా.. క్రాంతికుమార్‌రెడ్డి తోటలోని బోర్లు (వీటి లోతు వందడుగులే) ఇప్పటికీ మూడించుల నీటిని పోస్తున్నాయి. ప్రకృతి సేద్య పద్ధతితోపాటు వాననీటి సంరక్షణలోనూ ఆయన ఆదర్శంగా నిలవడం ప్రశంసనీయం. తన వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించే రైతులు, ఉద్యోగస్తుల్లో కొందరు ప్రకృతి పద్ధతుల్లో కూరగాయ పంటల సాగుకు సిద్ధమవుతుండటం చాలా సంతోషం కలిగిస్తోందని క్రాంతికుమార్‌రెడ్డి సంబరపడుతున్నారు.
 - ఎస్.కె. అమీర్ పాషా, చింతలపూడి, ప.గో.జిల్లా
 
 భూమిని బాగు చేసుకుంటే ఏ పంటైనా పండుతుంది!
 ఉద్యాన తోటలతో పాటు చలిప్రాంతాల్లో పాలీహౌసుల్లో పండించే బ్రకోలి, కాలీఫ్లవర్ వంటి అరుదైన కూరగాయ పంటలను సైతం.. ప.గో. జిల్లా మెట్ట ప్రాంతంలో ఆరుబయట పొలాల్లోనూ పండించడం సాధ్యమేనని చాటి చెప్పడమే నా అభిమతం. చాలా ఏళ్లుగా ప్రకృతి సేద్య పద్ధతిని అమలు చేస్తుండడంతో సారవంతంగా మారిన మా పొలంలో మట్టి.. సేంద్రియ ఎరువును తలపిస్తున్నది. అందువల్లే కొబ్బరితోపాటు బ్రకోలి, కాలీఫ్లవర్ వంటి పంటలు ఆశ్చర్యకరమైన దిగుబడులిస్తున్నాయి. చింతలపూడి ఉద్యాన అధికారి సంతోష్ ప్రోత్సాహంతోనే బ్రకోలి ప్రయోగాత్మకంగా సాగు చేశా. వాననీటి సంరక్షణకు వాగులో చెక్‌డ్యామ్‌లు నిర్మించడంతో కరువును జయించడం సాధ్యమైంది.
 - డా. కనమతరెడ్డి క్రాంతికుమార్‌రెడ్డి (77020 84702), ప్రకృతి వ్యవసాయదారుడు, ప్రగడవరం, చింతలపూడి మం., ప.గో. జిల్లా
 
 3 రోజులకో పిచికారీ..
 నాగలి సాళ్లు తోలి (సాళ్ల మధ్య 2.5 అడుగులు, మొక్కల మధ్య 1.5 అడుగులు) నెల రోజుల బ్రకోలి మొక్కలు నాటారు. రెండు నెలల్లో 4 సార్లు జీవామృతం బోరు నీటి ద్వారా ఇచ్చారు. నీమాస్త్రం, బ్రహ్మాస్త్రంతోపాటు వెల్లుల్లి+ వేపనూనె + ఆవు మూత్రం మిశ్రమం మాత్రమే వాడి పురుగులను అదుపుచేశారు. 3 రోజులకోసారి ఏదో ఒక ఇప్పటికి 15 సార్లు పిచికారీ చేశారు.
 
 బ్రహ్మజెముడుతో విద్యుత్ వెలుగులు!

 ఎడారి మొక్క బ్రహ్మజెముడు నుంచి ప్రపంచంలోనే తొలిసారిగా విద్యుత్‌ను ఉత్పత్తి చేసిన ఘనతను మెక్సికో దక్కించుకుంది. నోపాలిమెక్స్ అనే కంపెనీ ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని రూపొందించింది. బ్రహ్మజెముడు గుజ్జును ఉత్ప్రేరకాలు ఉన్న తొట్టెలో కలుపుతారు.  దీని నుంచి ఉత్పత్తయిన మీథేన్‌ను మండించటం ద్వారా విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. గ్రిడ్ ద్వారా అందించే విద్యుత్‌లో సగం ధరకే ఇది లభ్యం కావడం విశేషం. ప్రస్తుతం 300 గృహాలకు ఈ విద్యుత్‌ను సరఫరా చేస్తున్నారు. మరో 8 టన్నుల జీవ ఇంధనాన్ని ఉత్పత్తి చేసి జిటాక్యూరో పట్టణంలోని వాహనాలకు రోజూ సరఫరా చేస్తున్నారు. నగరంలోని వాహనాలకు దీని వాడకం వల్ల గాసోలిన్ వినియోగాన్ని 40 శాతం వరకు తగ్గించవచ్చని భావిస్తున్నారు.

 దశాబ్దం క్రితం నొపాలిమెక్స్ కంపెనీ మొక్కజొన్న, బ్రహ్మజెముడు చిప్స్ తయారు చేసేది. ఆ కంపెనీ విద్యుత్ బిల్లులు తగ్గించేందుకు గల అవకాశాలను పరిశీలించే క్రమంలో బ్రహ్మజెముడు నుంచి జీవ ఇంధనాలను ఉత్పత్తి చేయాలనే ఆలోచన  వారికి తట్టింది. 2024 నాటికల్లా మొత్తం విద్యుత్‌లో 35 శాతాన్ని ఈ పద్ధతిలోనే ఉత్పత్తి చేయాలని మెక్సికో ప్రభుత్వం భావిస్తోంది. కరువు ప్రభావిత ప్రాంతాలకు ఈ పంట సాగు ఉపయోగకరంగా ఉంటుంది. జీవ ఇంధనాన్ని ఉత్పత్తి చేసే ఇతర పంటలకు అనువుకాని ప్రాంతాల్లో బ్రహ్మజెముడును సాగు చేయవచ్చు. మెక్సికోలోని ఎడారి ప్రాంతాల్లోనూ బ్రహ్మజెముడు వనాలు విసృ్తతంగా ఉన్నాయి. అక్కడ మామూలు పంటల సాగు సాధ్యం కాదు. ఇటువంటి  ఎడారి ప్రాంతాల్లో బ్రహ్మజెముడును సాగు చేస్తే.. ఇప్పుడు జీవ ఇంధన పంటలను సాగు చేసుకునే భూముల్లో ఆహార పంటలు పండించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
 
 పుల్లడిగుంటలో 28న రైతు సదస్సు
 గుంటూరుకు 12 కిలోమీటర్ల దూరంలోని పుల్లడిగుంట గ్రామంలో ఈ నెల 28న (ఆదివారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు) ప్రకృతి వ్యవసాయం, ప్రకృతి వైద్యం, జీవవైవిధ్యం తదితర అంశాలపై రైతునేస్తం ఫౌండేషన్ తదితర సంస్థలతో కలసి రైతులు, ప్రకృతి జీవన శైలి ప్రేమికుల కోసం సదస్సు నిర్వహిస్తున్నట్లు ప్రకృతి ఫౌండేషన్ (మదనపల్లి) అధ్యక్షుడు ఎం. సి. వి. ప్రసాద్ తెలిపారు. అనుభవజ్ఞులైన ప్రకృతి వ్యవసాయదారులు, శాస్త్రవేత్తలతోపాటు ప్రకృతి వైద్యుడు డా. కుదరవల్లి విశ్వేశ్వరరావు తదితరులు ప్రసంగిస్తారని తెలిపారు. వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు : 094401 68816, 94905 59999

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement