నీటి నిరక్షరాస్యతే కరువుకు మూలం! | The source of water to drought uneducated! | Sakshi
Sakshi News home page

నీటి నిరక్షరాస్యతే కరువుకు మూలం!

Published Tue, Jun 28 2016 12:40 AM | Last Updated on Mon, Sep 4 2017 3:33 AM

నీటి నిరక్షరాస్యతే కరువుకు మూలం!

నీటి నిరక్షరాస్యతే కరువుకు మూలం!

‘జల గాంధీ’ అయ్యప్ప మెసగితో ప్రత్యేక ఇంటర్వ్యూ
 
- కరువుకు మూల కారణం వర్షాలు కురవక పోవడం కాదు.. ‘నీటి నిరక్షరాస్యతే’ అసలు సమస్య
- పొలాల్లో లోతు కందకాలు, పట్టా బండింగ్‌తో స్వల్ప ఖర్చుతోనే వాన నీటి సంరక్షణ.. సీజనల్ పంటలకు నీటి భరోసా
- చెక్ డ్యామ్‌లు వృథా.. నదులు/ వాగులలో భూగర్భ చెక్ డ్యామ్‌లతో సాగు, తాగునీటి భద్రత
- స్నానం చేసిన నీటిని, రోడ్డుపైన కురిసే వాన నీటిని కూడా నేలకు తాపితే.. పట్టణాలు, నగరాల్లో పుష్కలంగా భూగర్భ జలాలు
- వాన నీటిలో 30 శాతాన్ని భూమిలోకి ఇంకింపజేస్తే నీటి దారిద్య్రం పరార్!
 
 అయ్యప్ప మెసగి! వన్ మాన్ వాటర్ ఆర్మీ!!
 ఆయన వయసు 59 ఏళ్లు.  30 ఏళ్లుగా వాన నీటి సంరక్షణ తపస్సు చేస్తున్నారు. కరువు ప్రాంతమైన ఉత్తర కర్ణాటకలో సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన అయ్యప్ప మెసగి.. దక్షిణాదిలో జల సంరక్షణ ఉద్యమానికి ప్రతీకగా నిలిచారు. ఎల్ అండ్ టిలో మెకానికల్ ఇంజినీరుగా 23 ఏళ్లు పనిచేసిన అయ్యప్ప.. 2002లో నెలకు రూ. 32 వేల జీతంతో కూడిన ఉద్యోగాన్ని తృణప్రాయంగా వదిలేసి.. వాన నీటి సంరక్షణోద్యమంలోకి దూకారు. నలుగురు పిల్లలు, భార్య మాట కాదని కుటుంబ ప్రయోజనం కన్నా సామాజిక ప్రయోజనమే మిన్నగా భావించిన సాహసి ఆయన. వాన నీటి సంరక్షణ ప్రాధాన్యత గురించి, సంరక్షణ పద్ధతుల గురించి రైతులకు, ప్రజలకు కాలికి బలపం కట్టుకొని ప్రచారం చేస్తున్నారు. ఆర్థిక బాధలు, అవమానాలు, కష్టనష్టాలు ఎదురైనా వెనుదిరగలేదు.

బాల్యంలో తమ కుటుంబం సాగు నీటికి, తాగునీటికి పడిన కష్టాలు అయ్యప్పలో రగిలించిన కసి ఆయనను అసాధారణ శక్తిగా రూపుదిద్దింది. స్వచ్ఛంద సంస్థలు ఇచ్చిన ఊతంతో ఆర్థికంగా నిలదొక్కుకొని.. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వాన నీటి సంరక్షణపై అనితరసాధ్యమైన వినూత్న పద్ధతులను ఆవిష్కరించారు. ఈ విజయాలే ఆయనను ‘జల గాంధీ’గా మలిచాయి.  రైతులను, ప్రజలను అష్టకష్టాల పాలుచేస్తూ జాతి మూలుగను నిలువునా పీల్చేస్తున్నది కరువు రక్కసేనని సాధారణంగా అనుకుంటూ ఉంటాం. కానీ, ఆయన మాత్రం.. వర్షపు నీటి సంరక్షణపై నిర్లక్ష్యం, భావదారిద్య్రమే సాగునీటి, తాగునీటి కష్టాలకు మూల కారణమని తేల్చేస్తున్నారు. వాన కురవకా కాదు.. నీరు లేకా కాదు.. నీటి సంరక్షణకు సంబంధించిన భావ దారిద్య్రమే అసలు సమస్య అని అయ్యప్ప స్పష్టం చేస్తున్నారు. అకుంఠిత దీక్షతో ఆయన చేస్తున్న విశిష్ట కృషికి గుర్తింపుగా తొలుత వినూత్న ఆవిష్కరణలను ప్రోత్సహించే అశోక ఫెలోషిప్ లభించింది. జమ్నాలాల్ బజాజ్ జాతీయ పురస్కారం వంటి అవార్డులతోపాటు ఐఐటి అహ్మదాబాద్ ‘డాక్టర్ ఆఫ్ డ్రై బోర్‌వెల్స్’, ‘జల గాంధీ’ వంటి బిరుదులు పొందిన కారణ జన్ముడు అయ్యప్ప మసగితో ‘సాగుబడి’ డెస్క్ ఇన్‌చార్జ్ పంతంగి రాంబాబు సంభాషించారు. కొన్ని ముఖ్యాంశాలను ఇక్కడ పొందుపరుస్తున్నాం..
 
తీవ్ర కరువు పరిస్థితుల వల్ల సాగు నీటికి, తాగు నీటికి కూడా సమాజం అల్లాడుతోంది. దీనికి మూల కారణం నీటి నిరక్షరాస్యతే అని మీరంటున్నారు.. అంటే ఏమిటి?
 అయ్యప్ప మసగి :  వర్షాల తీరులో అనిశ్చితి పెరిగింది.  వాతావరణ మార్పుల వల్ల వర్షానికి వర్షానికి మధ్య గ్యాప్ రావడం లేదా కుండపోతగా కురవడం సాధారణమై పోయింది.  అయితే, గతంలో కన్నా ఎక్కువ వర్షం కురుస్తున్నప్పటికీ ఆ నీటిని మనం జాగ్రత్త చేసుకోవడం లేదు. అయితే,  పూర్వం మన పొలాల్లో నీటి కుంటలుండేవి. పూడ్చేశాం. గ్రామ చెరువుల్లోకి నీరు చేరనంతగా నిర్లక్ష్యం చేశాం, ఆక్రమించేశాం. నీటిని పొలంలో గానీ, ఇళ్ల దగ్గర గానీ భూమిలోకి ఇంకే మార్గాలన్నీ మూసేశాం. కురిసిన వానలో 3 శాతం నీరు మాత్రమే భూమిలోకి ఇంకుతోంది. మిగతా నీరు వాగులు, నదుల్లోకి వదిలేస్తున్నాం. నదులపై ఆనకట్టలు, లిఫ్ట్‌లు పెట్టి పొలాలకు, తాగడానికి వెనక్కి తెచ్చుకుంటున్నాం. సరస్సులన్నిటినీ మురుగునీటి కుంటలుగా మార్చేశాం. ఎంత వర్షం కురిసినా రెండు నెలల్లో తాగడానికి నీరు లేని పరిస్థితి వచ్చింది. ఒక్క మాటలో చెప్పాలంటే.. అభివృద్ధి పేరుతో నీటి ఎద్దడిని మనమే సృష్టించుకుంటున్నాం. వాన, నీరు సమస్య కాదు.. మన ఆలోచనా ధోరణిలోనే సమస్య ఉంది. ఒక ఏడాది కురిసే వానలో కనీసం 30 శాతాన్ని సంరక్షించుకుంటే.. ఆ తర్వాత మూడేళ్లు నీటికి కరువుండదు. వాన నీటి సంరక్షణేకరువుకు అసలైన, శాశ్వతమైన పరిష్కారం. ఇందుకోసం నీటి నిరక్షరాస్యతపై 30 ఏళ్లుగా ఒంటరి యుద్ధం చేస్తున్నా. 2020 నాటికి దేశం మొత్తాన్నీ నీటి సమృద్ధ దేశంగా మార్చాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నా. సమాజం కళ్లు తెరచి అందుకోవాలి.
 
వాన నీటి సంరక్షణ ఎన్ని పద్ధతుల్లో చేయాలి? ఎక్కడెక్కడ చేయాలి?
 అయ్యప్ప మసగి : నేలతల్లి అతిపెద్ద వాటర్ ట్యాంక్. కానీ, అదేపనిగా తోడేయడం, ఇంకకుండా చేయడం వల్ల భూగర్భం ఖాళీ అయ్యింది. ఇప్పుడు మన కర్తవ్యం ఏమిటంటే.. ఎక్కడ కురిసినా, ఎంత కురిసినా, ఎలా కురిసినా ఒడిసిపట్టుకొని, శుద్ధిచేసి, భూమిలోకి పంపాలి. పొలాల్లో, రోడ్ల మీద, గృహ సముదాయాల్లో, పారిశ్రామిక సంస్థల స్థలాల్లో.. నీరు నేల మీద పడే ప్రతి చోటా ఉద్యమ స్ఫూర్తితో నీటిని భూమికి తాపాలి. కందకాలు, కుంటలు, సోక్ పిట్‌లు, బోర్‌వెల్ రిచార్జ్ పిట్‌లు నిర్మించి సాధ్యమైనంత ఎక్కువ నీటిని భూమికి తాపించాలి. డాబా ఇళ్ల పైన కురిసే నీటిని పట్టుకొని, ఫిల్టర్ చేసి తాగునీటిగా వాడాలి. ముప్పయ్యేళ్లుగా మేం తాగుతున్నాం. స్నానం చేసిన నీటిని కూడా కాలువలోకి వదలకుండా.. ఇంటి దగ్గరే భూమిలోకి ఇంకింపజేయాలి. గజం భూమి వృథా కాకుండా ఈ పనిచేయొచ్చు. భూమిపైన నిర్మించే వాటర్‌షెడ్ల కన్నా.. నదులు, వాగుల్లో ఇసుక కింద వాటర్ షెడ్‌లు నిర్మించడం నేను కనుగొన్న గొప్ప ప్రభావశీలమైన నీటి సంరక్షణ పద్ధతి (వివరాల కోసం ప్రత్యేక బాక్స్‌లు చూడండి). ఇటువంటి 150 వరకు ప్రత్యేక పద్ధతులను రూపొందించి, పరీక్షించి సత్ఫలితాలు పొందాను.
 
ఉద్యోగం మానేసి ఉద్యమం ప్రారంభించడానికి స్ఫూర్తి కలిగించిందేమిటి?
 అయ్యప్ప మసగి : పెద్దయి, ఆర్థికంగా స్థిరపడిన తర్వాత ఉద్యోగం మానేసి నీటి సమస్యకు పరిష్కారం కనుగొనాలని చిన్నప్పుడే అనుకున్నా. కేంద్ర ప్రభుత్వ సంస్థ బీఈఎంఎల్‌లో కొంతకాలం, తర్వాత 23 ఏళ్లు ఎల్ అండ్ టిలో మెకానికల్ ఇంజినీర్‌గా పనిచేశా. కర్ణాటకలో ఒక ఔషధ కంపెనీ వ్యర్థ జలాలను పొలాల్లో ఎండిపోయిన బోర్లలో పోయడం వల్ల రెండు కిలోమీటర్ల దూరంలో భూగర్భ జలాలు పనికిరాకుండా పోయాయి. ఆ రైతుల నీటి బాధలు చూడలేక 2002లో భార్యకు కూడా చెప్పకుండా రూ. 32 వేల నెల జీతం వచ్చే ఉద్యోగం మానేశా. రూ. 5 వేలకు నీటి సంరక్షణ కోసం ఒక స్వచ్ఛంద సంస్థలో చేరా. నా భార్య మిషన్‌పై దుస్తులు కుట్టి సంపాదించిన డబ్బుతో నలుగురు పిల్లలనూ పోషించింది. ఆమె సహాయ నిరాకరణతో ఎన్నో అవమానాలను, కష్టనష్టాలు ఎదురైనా నేను పట్టు విడవ లేదు. వట్టిపోయిన బోరుకు తిరిగి జలకళ తెప్పించినప్పుడు పత్రికలు తొలిసారి నా గురించి పొగుడుతూ రాశాయి. కానీ, నా భార్య మాత్రం ‘ఆయన వట్టి పనికిమాలిన వాడ’ని విలేకరులతో చెప్పింది. ఆ వార్త అచ్చయిన రోజునే అశోక ఫౌండేషన్ నాకు నెలకు రూ. 32 వేలతో మూడేళ్ల ఫెలోషిప్ ప్రకటించింది. అశోక తర్వాత దేశ్‌పాండే ఫౌండేషన్, ఆక్స్‌ఫామ్ ఇండియా తదితర సంస్థలు వెన్నుదన్నుగా నిలిచాయి. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూడలేదు. మొదట్లో పిచ్చివాడినన్న వారే ఫలితాలు చూసిన తర్వాత ‘జల గాంధీ’గా కీర్తిస్తున్నారు.
 
మీ సంస్థల ద్వారా ఎన్ని రాష్ట్రాల్లో సేవలందిస్తున్నారు..?
 అయ్యప్ప మసగి : 2005 సెప్టెంబర్ 5న వాటర్ లిటరసీ ఫౌండేషన్‌ను నెలకొల్పా. 2008లో రెయిన్ వాటర్ కాన్సెప్ట్స్ ఇండి ప్రై. లి.ను ప్రారంభించా. నీటి సంరక్షణపై ఇప్పటి వరకు 5,368 సదస్సులు నిర్వహించా. చిన్న, సన్నకారు రైతులకు ఉచిత సలహాలు ఇస్తున్నాం. 10 వేల హెక్టార్ల పొలాల్లో వాన నీటి సంరక్షణ పనులు చేయించా. 300 అపార్ట్‌మెంట్లు, 31 గేటెడ్ కమ్యూనిటీలు, 171 పరిశ్రమలు, 168 పాఠశాలలకు సేవలందించాం. మా సంస్థల తరఫున 21 ప్రాజెక్టుల్లో 20 మంది సిబ్బంది, 100 మంది కార్మికులు పనిచేస్తున్నారు.  ఇప్పుడు తెలంగాణ సహా 12 రాష్ట్రాల్లో సేవలందిస్తున్నాం. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర నిర్వహించిన వి. ప్రకాశ్‌తో కలసి పనిచేస్తున్నాను.
 
పొలాల్లో వాన నీటి సంరక్షణపై నమూనా క్షేత్రాలు ఎక్కడున్నాయి?
 అయ్యప్ప మసగి : అనంతపురం జిల్లా చిలమత్తూరు మండలం సుబ్బరావుపేట సమీపంలో మిత్రులతో కలసి 84 ఎకరాల్లో నమూనా సేంద్రియ క్షేత్రాన్ని నిర్మించాం. 37 వరుసల కందకాలు తవ్వి కట్టలు (కంపార్ట్‌మెంట్ బండింగ్) పోశాం. 3 చెరువులు తవ్వాం. 25 వేల (మీ. వెడల్పు, మీ. లోతున) చిన్న గోతులు తవ్వాం.. ఇవన్నీ చేయడానికి ఎకరానికి రూ.లక్షా 10 వేలు ఖర్చయింది. 300 మిల్లీ మీటర్ల వర్షపాతం ఉండే అనంతపురం జిల్లాలోనే రెండో ఏడాదికే మా పొలంలో నీటికి దిగుల్లేని పరిస్థితి వచ్చింది. చెరువుల్లో నీరుంది. బోర్లలో ఐదడుగుల్లో నీరుంది. 84 ఎకరాలకు ఒకే బోరు నీరందిస్తోంది. చిత్రావతి నదిలోనూ నీరు పారుతోంది. వరుసగా కొన్ని ఏళ్లు వాన పడకపోయినా మా పంటలకు నీటి దిగులుండదు. 60 శాతం స్థలంలో చెట్లు (ఎర్రచందనం, శ్రీగంధం, సిల్వర్ ఓక్స్, మలబారు వేప, నేరేడు, జామ వంటి చెట్లు), వరుసల మధ్య భూమిలో సీజనల్ ఆహార పంటలు సేంద్రియ పద్ధతుల్లో పండిస్తున్నాం. ఈ పద్ధతి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రైతులకు చాలా అనువైనది. మా స్వగ్రామం కర్ణాటకలోని టుమ్‌కూర్ జిల్లా హొలవనల్లి. అక్కడ మరో మూడున్నర ఎకరాల్లో నమూనా వ్యవసాయ క్షేత్రాన్ని నిర్మించాం. పొలంలో చేసిన పనులతోపాటు.. పొలం పక్కనే ఉన్న వాగులో ప్రత్యేక పద్ధతిలో ఇసుక అడుగున చెక్‌డామ్‌లు నిర్మించాం. ఆ ప్రాంతంలో బోర్లు, బావుల్లో జలకళ నిండింది. భూమిపైన చెక్‌డ్యామ్‌ల వల్ల కలిగే ప్రయోజనం కన్నా నదీ గర్భంలో ఇసుక అడుగున చెక్ డ్యామ్‌లు నిర్మించడం వల్ల వెయ్యి రెట్లు ఎక్కువ ప్రయోజనం ఉంటుందని మా అనుభవంలో తేలింది. ఇప్పటికి 200 మంది వాటర్ వారియర్స్(నీటి సేనానుల)కు శిక్షణ ఇచ్చాను. పట్టా బండింగ్, కందకాల ద్వారా తక్కువ ఖర్చుతోనే రైతులు నీటిని సంరక్షించుకోవచ్చు. ఈ పద్ధతులు వేగంగా వ్యాప్తి చెందాలంటే దాతలు, ప్రభుత్వం స్పందించాలి.
                      - ఫొటోలు: ఎ. సతీష్, శ్రీధర్ (అయ్యప్ప మసగి కృషిపై ఇతర వివరాలకు www.waterliteracy.tk చూడవచ్చు)
 
 నీటి సంరక్షణపై ఉచిత సలహాలు.. యువతకు శిక్షణ..
 జల గాంధీగా పేరుగాంచిన అయ్యప్ప మసగి రూపొందించిన పద్ధతుల్లో రైతులకు, గృహయజమానులకు ఉచితంగా ఫోన్ ద్వారా సమాచారం ఇస్తున్నాం. 91773 82777 నంబరులో సంప్రదించవచ్చు. కనీసం 8వ తరగతి పాసైన యువతకు జల సేనానులుగా 3 నెలల పాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నాం. భోజన, వసతి సదుపాయాలు ఎవరికి వారే చూసుకోవాలి. ఆసక్తిగల వారు ‘తెలంగాణ జల సంరక్షణ వేదిక (తేజస్వి), ఫ్లాట్ నం: 403, ఇంటి నం. 8-3-960, సిరి ఎన్‌క్లేవ్, శ్రీనగర్ కాలనీ, హైదరాబాద్ - 500073, తెలంగాణ’ అడ్రస్‌లో సంప్రదించవచ్చు.
 - వి. ప్రకాశ్ (90009 50400), చైర్మన్, తెలంగాణ జల సంరక్షణ వేదిక.
 savewater2021@gmail.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement