వాతావరణ మార్పుల్ని ధీటుగా తట్టుకునే అధిక పోషకాలతో కూడిన 109 కొత్త వంగడాలను ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల విడుదల చేశారు. వీటిల్లోని 5 వంగడాలతో అంతర్జాతీయ మెట్ట పంటల పరిశోధనా సంస్థ (ఇక్రిశాట్)కు సంబంధం ఉంది. ఇక్రిశాట్‌లో పెరిగిన తల్లి మొక్కల (పేరెంట్ లైన్స్)ను తీసుకొని వివిధ యూనివర్సిటీలు, పరిశోధనా సంస్థలు కొత్త వంగడాలను రూపొందించాయి. ఈ ఐదింటిలో మూడు కంది, జొన్న, సజ్జ వంగడాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు అనువైనవి. ఈ వంగడాల రూపకల్పనలో ఇక్రిశాట్ శాస్త్రవేత్తలు డా. ప్రకాశ్, డా.గుప్తా, డా. ఇఫ్రీన్ ప్రధానపాత్ర పోషించారని ఇక్రిశాట్ ప్రధాన శాస్త్రవేత్త డా.పసుపులేటి జనీల ‘సాక్షి సాగుబడి’తో చెప్పారు.
ఇంతకీ.. ఇప్పుడు విడుదలైన కొత్త విత్తనాలు రైతులకు ఎప్పటికి అందుతాయి? అని ప్రశ్నిస్తే.. ఆశ్చర్యకరమైన సమాధానం వచ్చింది. కొన్ని పంటల్లో 5 నుంచి 15 ఏళ్లు పడుతోందన్నారు. విత్తన వ్యవస్థలపై శ్రద్ధ కొరవడినందున కొత్త వంగడాలు గ్రామీణ రైతులకు సత్వరమే చేరటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
5 తెగుళ్లను తట్టుకునే సజ్జ హైబ్రిడ్
సజ్జ పూసా 1801: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు అనువైన హైబ్రిడ్ ఇది. ఇక్రిశాట్‌తో కలసి న్యూఢిల్లీలోని ఐఎఆర్‌ఐ రూపొందించింది. సజ్జల కోసమే కాకుండా, పశుగ్రాసం కోసం కూడా సాగు చేయతగినది. 5 తెగుళ్లను తట్టుకోగలుగుతుంది. అగ్గి తెగులును, వెర్రి తెగులును పూర్తిగా.. తుప్పు తెగులు, స్మట్, ఆర్గాట్ తెగుళ్లను కొంతమేరకు తట్టుకుంటుంది. ఈ రకం సజ్జల్లో ఇనుము (70 పిపిఎం), జింక్ (57 పిపిఎం) ఎక్కువ. హెక్టారుకు 33 క్వింటాళ్ల సజ్జలు, ఎండు చొప్ప హెక్టారుకు 175 క్వింటాళ్ల దిగుబడినిస్తుంది. ఇది ప్రకృతి సేద్యానికీ అనువుగా ఉంటుందని డా. జనీల తెలిపారు.
కోతకొచ్చినా పచ్చగా ఉండే జొన్న
జొన్న ఎస్‌పిహెచ్ 1943: తెలంగాణకు అనువైన(ఏపీకి కాదు) హైబ్రిడ్ ఇది. యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్ ధర్వాడ్(కర్ణాటక) ఇక్రిశాట్‌తో కలసి అభివృద్ధి చేసింది. హెక్టారుకు 39 క్వింటాళ్ల జొన్నల దిగుబడినిచ్చే ఈ రకం ఖరీఫ్‌లో వర్షాధార సాగుకు అనుకూలం. గడ్డి దిగుబడి హెక్టారుకు 116 క్వింటాళ్లు. కోత దశలోనూ గడ్డి ఆకుపచ్చగానే ఉండటం (స్టే గ్రీన్) దీని ప్రత్యేకత. గింజ బూజును కొంత వరకు తట్టుకుంటుంది. తక్కువ నత్రజని ఎరువుతోనే 9% అధిక దిగుబడినిస్తుంది. ప్రకృతి సేద్యానికీ అనువైనదని డా. జనీల తెలిపారు.
5 నెలల కంది సూటి రకం
కంది ఎన్‌ఎఎఎం–88: ఇది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో వర్షాధారం/నీటిపారుదల కింద ఖరీఫ్‌కు అనువైన సూటి రకం. ఇక్రిశాట్‌తో కలసి కర్ణాటక రాయచూర్‌లోని యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్ ఈ రకాన్ని అభివృద్ధి చేసింది. 142 రోజుల (స్వల్పకాలిక) పంట. హెక్టారుకు 15 క్వింటాళ్ల దిగుబడినిస్తుంది. ఎండు తెగులును కొంతమేరకు తట్టుకుంటుంది.
పాలకులు శ్రద్ధ చూపాలి
శాస్త్రవేత్తలు దీర్ఘకాలం పరిశోధనలు చేసి ఓ కొత్త వంగడాన్ని రూపొందిస్తారు. కానీ, విడుదలైన తర్వాత కూడా కొత్త విత్తనం రైతులకు సత్వరం అందటం లేదు. వేరుశనగ, శనగ వంటి పంటల్లో 15–18 ఏళ్లు పడుతోంది. వెరైటీల రిలీజ్‌తో పని అయి పోయినట్లు కాదు. ఫార్మల్, ఇన్‌ఫార్మల్ సీడ్ సిస్టమ్స్‌ను ప్రోత్సహించటంపైపాలకులు దృష్టిని కేంద్రీకరించటం అవసరం. అప్పుడే రైతులు, వినియోగదారులకు కొత్త వంగడాల ప్రయోజనాలందుతాయి.
– డా. పసుపులేటి జనీల, క్లస్టర్ లీడర్ – క్రాప్ బ్రీడింగ్, ప్రధాన శాస్త్రవేత్త (వేరుశనగ), ఇక్రిశాట్
Comments
Please login to add a commentAdd a comment