సాక్షి, నల్లగొండ అగ్రికల్చర్ : ఇప్పటికే కుటుంబ సమగ్ర సర్వే చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం మరో సర్వేకు పూనుకుంది. రాష్ట్రంలో రైతులను ఆర్థికంగా పరిపుష్టి చేసేందుకు పంటల దిగుబడులను పెంచడమే లక్ష్యంగా చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా పంటకాలనీల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది. ఇందుకుగాను ఈ నెల 25వ తేదీనుంచి నెలరోజుల పాటు రైతుల నుంచి సమగ్ర సమాచారాన్ని సేకరించడానికి సమగ్ర సర్వే చేసేందుకు జిల్లా వ్యవసాయ శాఖ సిద్ధమవుతోంది.
వ్యవసాయ విస్తరణాధికారులు గ్రామాల వారీగా ప్రతి రైతు నుంచి సమగ్ర సమాచారాన్ని సేకరి స్తారు. జిల్లాలోని సుమారు 4లక్షల 60వేల 953మంది రైతుల నుంచి వారి సమగ్ర సమాచారం సేకరించేందుకు గాను వ్యవసాయ విస్తరణ అధికారులు సర్వే చేస్తారు.
సమాచార సేకరణ ఇలా..
రైతుల సమగ్ర సర్వేలో భాగంగా అధికారులు మొత్తం 30కిపైగా రూపొందించిన అంశాల ఫార్మెట్ ప్రకారం పూర్తి వివరాలు సేకరిస్తారు. దీంట్లో భాగంగా రైతు వివరాలు, ఎంత భూమి ఉంది. ఏఏ పంటలను ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. వర్షాధారమా, ఆయకట్టా, లేక బోరుబావుల కింత సాగు చేస్తున్నారా.. ఆ రైతు పండించిన పంటల దిగుబడి ఎలా ఉంది.. ఆశించిన స్థాయిలో దిగుబడి వస్తుందా లేదా అనే సమాచారం సేకరించి నమోదు చేసుకుంటారు.
అదేవిధంగా రైతు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లభిస్తుందా, మార్కెటింగ్, ప్రాసెసింగ్ సౌకర్యం ఉందా, ఆయా పంటలను పండిస్తే ఎంత గిట్టుబాటు అవుతుంది అనే వివరాలను తీసుకుంటారు. ఇంకా భూసారం, ఏఏ ఎరువులను, ఏఏ పంటలకు వాడుతున్నారు అనే సమాచారాన్ని సేకరిస్తారు.
పంటకాలనీల ఏర్పాటు ఉద్దేశం..
రైతులు పండించిన పంటలను స్థానిక వనరుల ద్వారానే స్థానికంగా విక్రయించుకుని మంచి లాభాలను పొందడమే పంటకాలనీల ఏర్పాటు ప్రధాన లక్ష్యం. సర్వే తరువాత ఏఏ పంటలు , ఏఏ ప్రాంతాల్లో అనుకూలంగా ఉంటుంది. ఏ సీజన్‌లో ఏ పంటలకు మంచి డిమాండ్ ఉంటుంది అనే విషయాలను భేరీజు వేసుకుని నీటి లభ్యతను పరిగణలోకి తీసుకుని, వర్షాధారం అయితే మెట్టపంటలను, బోరుబావులు, కాలువల ద్వారా అయితే వరి, ఇతర పంటలను, కూరయాలను సాగు చేయిస్తారు.
మండలమా, లేక గ్రామమా లేక నియోజకవర్గమా అనేది యూనిట్‌గా తీసుకుని ఆయా ప్రాంతాల వారీగా సీజన్‌ను బట్టి పంటలను సాగు చేయిస్తారు. ఆయా ప్రాంత రైతులందరూ అదే పంటలను సాగు చేసే విధంగా ఏర్పాటు చేస్తారు.
గిట్టుబాటు ధర కల్పించేందుకు..
పండించిన పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేసి ప్రాసెసింగ్ చేసి సమభావన సంఘాల ద్వారా ప్రజలకు విక్రయించడం ద్వారా రైతులకు గిట్టుబాటు ధరను కల్పించడం పంటకాలనీ ప్రధాన ఉద్దేశం. జిల్లా వ్యవసాయ, ఉద్యానవన, మార్కెటింగ్, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ, పరిశ్రమల «శాఖల సమన్వయంతో పంటకాలనీల ద్వారా రైతులు పండించిన పంటలను ప్రొసెసింగ్ చేసి మార్కెట్ సౌకర్యం కల్పించనున్నారు.
నెలరోజుల పాటు సర్వే
పంటలకాలనీల ఏర్పాటు కోసం జిల్లా వ్యాప్తంగా నెలరోజుల పాటు సర్వేను నిర్వహించనున్నాం. రైతుల నుంచి సమగ్ర సమాచారాన్ని సేకరిస్తాం. రైతులు విధిగా తమ ఆధార్, పాస్‌పుస్తకం, బ్యాంకు ఖాతా, పంటల సాగు విస్తీర్ణంతో పాటు ఏఏ పంటలను సాగు చేస్తున్నారనే సమాచారాన్ని వ్యవసాయ విస్తరణాధికారులకు తప్పకుండా తెలియజేయాలి.
–జి.శ్రీధర్‌రెడ్డి, జిల్లా వ్యవసాయాధికారి
Comments
Please login to add a commentAdd a comment