
మొయినాబాద్‌లో భారీ వర్షం
- పంటలకు జీవం పోసిందని రైతుల హర్షం
మొయినాబాద్: నెల రోజుల తరువాత వరుణదేవుడు కరుణించాడు. చాలారోజుల తరువాత భారీ వర్షం కురిసి ఎండిపోతున్న పంటలకు జీవపోసింది. గురువారం మధ్యాహ్నం మండల కేంద్రంతోపాటు పెద్దమంగళారం, చిలుకూరు, అప్పోజీగూడ, చందానగర్, రెడ్డిపల్లి, మోత్కుపల్లి, ఎలుకగూడ, కుత్బుద్దీన్‌గూడ, మేడిపల్లి, అమీర్‌గూడ, సురంగల్, శ్రీరాంనగర్, వెంకటాపూర్, నాగిరెడ్డిగూడ తదితర గ్రామాల్లో వర్షం కురిసింది. నెల రోజుల నుంచి వర్షాలు లేక ఎండలు ఎక్కువ కావడంతో చాలా చోట్ల మొక్కజొన్న, జొన్న, కంది, పెసర, కూరగాయ పంటలు ఎండుముఖం పట్టాయి. పంటలపై ఆశలు వదులుకున్న సమయంలో ఈ వర్షం జీవం పోసిందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మొయినాబాద్‌లో మళ్లీ అదే తీరు..
భారీ వర్షం పడటంతో మొయినాబాద్‌లో హైదరాబాద్-బీజాపూర్ రహదారిపై భారీగా వరదనీరు నిలిచిపోయింది. వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలిగింది. మూడు నెలలుగా మండల కేంద్రంలో వర్షం పడినప్పుడల్లా ఈ సమస్య పునరావృతమవుతోంది. మురుగు నీరు వెళ్లేందుకు అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో పాటు రహదారి లోతట్టుగా ఉండటంతో వర్షం నీరంతా నిలిచిపోయి గుంతల మయంగా మారుతోంది. ఇప్పటికే రెండుసార్లు రోడ్డుపై తాత్కాలిక మరమ్మతులు చేశారు. అయినా పరిస్థితి మళ్లీ మొదటి కొచ్చింది. దీనికి తోడు రోడ్డు పక్కనుంచి ఉన్న మురుగుకాలువను మరమ్మతు చేయడానికి వారం రోజుల క్రితం పైకప్పును తొలగించి పెట్టారు. వర్షంనీటితో రోడ్డు, మురుగుకాలువ నిండిపోవడంతో ఎక్కడ రోడ్డు ఉందో, ఎక్కడ మురుగు కాలువ ఉందో తెలియక వాహనదారులు, స్థానికులు అవస్థలు పడుతున్నారు.
శంషాబాద్‌లో.. పట్టణంలో గురువారం మధ్యాహ్నం భారీ ర్షం కురిసింది. జనాలకు ఉక్కపోత నుంచి ఉపశమనం కలిగింది. కొన్ని రోజులుగా ఎండల తీవ్రతతో సతమతమవుతున్న వారికి ఈ వర్షం కాస్త ఊరటనిచ్చింది. సుమారు గంటపాటు ఏకధాటిగా వర్షం కురిసింది.