నల్లగొండ మండలం గుండ్లపల్లిలో ఏపుగా పెరిగిన పత్తి చేను
నల్లగొండ అగ్రికల్చర్ : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి కారణంగా మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలు పత్తిచేలకు జీవం పోశాయి. పదిహేను రోజులుగా వర్షం లేకపోవడంతో పత్తి చేలు వాడుపట్టే దశకు చేరుకున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ముందు వేసిన చేలు కాయలు పగలడంతో పత్తిని కూడా ఏరుతున్నారు. జిల్లాలో 2లక్షల 26 వేల 345 హెక్టార్లలో పత్తి సాగుచేశారు. ఖరీఫ్ ప్రారంభ దశలో వర్షాలు మెట్ట పంటలకు అనుకూలంగా కురవడంతో ఆయకట్టుతోపాటు ఆయకట్టేతర ప్రాం తాలైన దేవరకొండ, నల్లగొండ డివిజన్‌లలో జూలై చివరి వారంలో పత్తి గింజలు విత్తుకున్నారు. వారం వారం వర్షాలు కురుస్తుండడంతో పత్తి చేలలో కలుపుతీసుకోవడంతో పాటు రెండు మూడు సార్లు ఎరువులకు పెట్టుకున్నారు.
దీంతో చేలు ఏపుగా పెరిగి పూత, కాయ దశకు చేరుకున్నాయి. పదిహేను రోజులుగా వరుణుడు ముఖం చాటేయడంతోపాటు ఎండాకాలాన్ని తలపించే విధంగా వాతావరణంలో ఉష్ణోగ్రతలు పెరిగాయి. పత్తి చేలు వాడుపట్టాయి. ఆకులు ఎర్రబారి కొన్ని ప్రాంతాల్లో పూత, పిందెలు రాలిపోయే పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితులు పత్తి దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉందని రైతులతోపాటు వ్యవసాయ శాఖ అధికారులు ఆందోళన చెందారు. కనీ సం పెట్టిన పెట్టుబడులు కూడా చేతికి వస్తాయో రావోనన్న భయం నెలకొంది. కానీ బంగాళా ఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి కారణంగా జిల్లావ్యాప్తంగా సోమ, మంగళ, బుధవారాలలో కురిసిన వర్షాలు పత్తిచేలకు జీవం పోశాయి. చేలు ఏపుగా కనిపిస్తున్నాయి. రైతులు తిరిగి ఎరువులకు పెట్టుకునేందుకు సిద్ధమవుతున్నారు.
34 లక్షల క్వింటాళ్ల దిగుబడి వచ్చే అవకాశం
ప్రస్తుత వర్షాలతో ఖరీఫ్‌లో పత్తి దిగుబడి ఆశించిన స్థాయిలో వచ్చే అవకాశం ఉన్నట్లు జిల్లా వ్యవసాయశాఖ అధికారులు పేర్కొంటున్నారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 34 లక్షల క్వింటాళ్ల దిగుబడి వచ్చే అస్కారం ఉందని చెబుతున్నారు. రైతులకు, మెట్ట పంటలకు అనుకూలమైన వర్షాలు కురుస్తుడడం పత్తి రైతులకు కలిసివచ్చే అవకాశం ఉంది.
25 మండలాల్లో కురిసిన వర్షం
జిల్లాలో 25 మండలాల్లో వర్షం కురిసింది. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు కురిసిన వర్షపాతం ఇలా ఉంది. హాలియా మండలంలో 34.4 మిల్లీమీటర్లు, కనగల్ 29.2, దామరచర్లలో 27.0, పెద్దవూరలో 26.4, నల్లగొండలో 15.6, గుర్రంపోడులో 15.5, చింతపల్లిలో 14.6, శాలిగౌరారం 13.6, మర్రిగూడలో 13.4, నిడమనూరులో 9.8, దేవరకొండలో 9.4, నాంపల్లిలో 9.2, కేతేపల్లిలో 9.0 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. అదే విధంగా చిట్యాలలో 6.2, మిర్యాలగూడలో 4.8, కట్టంగూరులో 3.6, మునుగోడులో 3.6, పీఏపల్లిలో 3.4, త్రిపురారంలో 2.0, డిండిలో 1.8, తిప్పర్తి 1.4, చండూరులో 0.8 మిల్లీమీటర్లు కురిసి సగటు వర్షపాతం 10.7 మిల్లీమీటర్లుగా నమోదైంది. బుధవారం మధ్యాహ్నం కూడా జిల్లా వ్యాప్తంగా వర్షం కురవడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఆనందంగా ఉంది
వర్షాలు రాకపోవడంతో పత్తి చేను వాడిపట్టింది. ఇక పెట్టుబడి కూడా చేతికి వస్తుందో రాదో నని బాధపడ్డాం. ఎకరా నికి రూ.15 వేల వరకు పెట్టుబడి పెట్టి రెండు ఎకరాల్లో పత్తి గింజలు విత్తాను. పదిహేను రోజులుగా వర్షాలు రాకపోవడంతో అప్పుల పాలవుతామని భయపడ్డా. కానీ మూడు రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో ఆనందంగా ఉంది. పత్తి చేను మంచిగా పెరిగి పూత, కాయలు బాగానే పడుతున్నాయి. దిగుబడి బాగానే వస్తుందని అనుకుంటున్నాను.– అందే నరేష్, రైతు గుండ్లపల్లి
పత్తి చేలకు మంచి అనుకూలం
మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలు పత్తి చేలకు మంచి అనుకూలం. వాడుపట్టే దశలో వర్షాలు కురవడం వల్ల చేలకు బలం చేకూరుతుంది. పూత, కాయలు బాగా వచ్చే అవకాశం ఉంటుంది. వచ్చే వారం పది రోజుల్లో మరోసారి వర్షం కురిస్తే మంచి దిగుబడులు వచ్చి రైతులు లాభాలు పొందే అవకాశం ఉంది. ఏమైనా తెగుళ్లు ఆశించినట్లు కనిపిస్తే వ్యవసాయాధికారులను సంప్రదించి సస్యరక్షణ చర్యలు తీసుకోవాలి.
– జి.శ్రీధర్‌రెడ్డి, జేడీఏ
Comments
Please login to add a commentAdd a comment