
వ్యవసాయంలో రైతు పెట్టే పెట్టుబడుల్లో కలుపుతీత కూడా ఒకటి. అయితే ఈ కాలంలో కలుపు తీసే వ్యవసాయ కూలీలకు కొరత ఉన్న నేపథ్యంలో బ్రిటన్‌కు చెందిన స్మాల్ రోబోట్ కంపెనీ ఓ సరికొత్త యంత్రాన్ని అభివృద్ధి చేసింది. ఇది పంట చేలలో మొలిచే పిచ్చిమొక్కలను మాత్రమే ఎంచుకుని మరీ కరెంటు షాకిచ్చి చంపేస్తుంది. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. ఇదే కంపెనీ గత ఏడాది వ్యవసాయ పనులను స్వతంత్రంగా చక్కబెట్టే టాం, హ్యారీ పేర్లతో రెండు రోబోలను సిద్ధం చేయడం. టాం తన కెమెరా కన్నులతో కలుపు మొక్కలను గుర్తించేదికాగా.. హ్యారి అత్యంత కచ్చితత్వంతో విత్తనాలు నాటుతుంది. స్మాల్ రోబో కంపెనీ తాజాగా అభివృద్ధి చేసిన రోబోట్ డిక్.. విద్యుత్తు షాక్‌లతో కలుపు మొక్కలను నాశనం చేస్తుంది.
ఇంకోలా చెప్పాలంటే హానికారక రసాయన మందుల వాడకం అస్సలు అవసరం లేదన్నమాట. అంతేకాకుండా.. పొలంలోని జీవవైవిధ్యాన్ని కాపాడుకుంటూ నేల సారాన్ని పరిరక్షించుకునేందుకు ఈ రోబో అవకాశం కల్పిస్తుంది. ఈ మూడు రోబోలను కలిపి ఉపయోగించడం ద్వారా పొలం పనులు చాలా వేగంగా పూర్తి చేయవచ్చునని కంపెనీ చెబుతోంది. పొలంలోని ఒక్కో మొక్కను పరిశీలించి.. మిల్లీమీటర్ సైజులో ఉన్న కలుపు మొక్కలను సైతం గుర్తించగలగడం ఈ రోబోల ప్రత్యేకత అని స్మాల్ రోబోట్ కంపెనీ వ్యవస్థాపకుడు సామ్ వాట్సన్ జోన్స్ అంటున్నారు. 2020లో సుమారు 20 చోట్ల వీటిని ప్రయోగాత్మకంగా ఉపయోగిస్తామని, ఆ తరువాతి సంవత్సరం అందరికీ అందుబాటులోకి తెస్తామని కంపెనీ వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment