అన్ని రంగాల్లోకి విస్తరించిన రోబోలు ఇప్పటివరకూ వ్యవసాయంలో అడుగు పెట్టింది మాత్రం తక్కువే. ఈ లోటును పూర్తి చేసేందుకు సిద్ధమవుతోంది బ్రిటన్‌లోని ఓ సూపర్ మార్కెట్. స్మాల్ రోబోట్ పేరున్న కంపెనీ తయారు చేసిన బుల్లి రోబోలను లెక్‌ఫోర్డ్ ఎస్టేట్‌లో మూడేళ్ల పాటు పరీక్షించేందుకు రంగం సిద్ధం చేసింది. దాదాపు 2.5 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఎస్టేట్‌లో టామ్, డిక్ అండ్ హ్యారీ అనే మూడు రోబోలు పనిచేయడం మొదలుపెట్టనున్నాయి. గోధుమలు పండించే ఈ పొలంలో రోబోల వల్ల దిగుబడి ఏమైనా పెరుగుతుందా? అన్నది పరిశీలిస్తారు. పెరిగిపోతున్న సాగు ఖర్చులను తగ్గించుకునేందుకు.. పర్యావరణానికి మేలు చేసేందుకు ఈ రోబోలు ఉపయోగపడతాయని స్మాల్ రోబోట్ కంపెనీ అంటోంది.
ఒక్కో రోబో పది కిలోల బరువు ఉంటుందని కెమెరాల సాయంతో ఇది పొలం మొత్తం తిరుగుతూ ప్రతిమొక్కను పరిశీలిస్తుందని లెక్‌ఫోర్డ్ ఎస్టేట్‌కు చెందిన ఆండ్రూ హోడ్ తెలిపారు. అంతేకాకుండా ప్రతి మొక్కకు వాటి ఆరోగ్యం ఆధారంగా కావాల్సినంత మేరకే ఎరువులు వేయడం, క్రిమి సంహారక మందులు వాడటం ఈ రోబోల ప్రత్యేకత. ఈ చర్యల ఫలితంగా పంట సాగు ఖర్చు 60 శాతం వరకూ తగ్గుతుందని, ఆదాయం 40 శాతం వరకూ పెరుగుతుందన్నది తమ అంచనా అని ఆండ్రూ తెలిపారు. చీడపీడలను నాశనం చేసేందుకు ఒక రోబో లేజర్ కిరణాలను వాడుతుందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment