కలుపు మొక్కల్ని మాత్రమే నిర్మూలించే అటానమస్ రొబో
మన దేశంలో పంట పొలాల్లో కలుపు వల్ల రైతులకు ఏటా జరుగుతున్న ఆర్థిక నష్టం రూ. 1980 కోట్లని నాలుగేళ్ల క్రితం నాటి అంచనా. పురుగులు, తెగుళ్ల నష్టాలకన్నా కలుపు నష్టమే ఎక్కువని భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి లెక్కతేల్చింది. ఆధునిక వ్యవసాయ పద్ధతుల్లో భాగంగా స్వతంత్రంగా పనిచేస్తూ కలుపు మొక్కల్ని మాత్రమే నిర్మూలించే రోబోలు (అటానమస్ రొబోటిక్ వీడ్ కంట్రోల్ సిస్టమ్స్) వస్తున్నాయి.
కృత్రిమ మేధ, జీపీఎస్, జిఐఎస్ వంటి అత్యాధునిక సాంకేతికతలతో రూపొందిన ‘రోబో కూలీలు’ ఇవి. వీటిల్లో అనేక రకాలున్నాయి. కలుపు తీసే రోబో తనను తానే నడుపుకుంటూ పంట సాళ్లలో వెళ్తూ సాళ్ల మధ్యన, వరుసల్లో మొక్కలు/చెట్ల మధ్యన ఉండే నిర్దేశించిన కలుపు మొక్కల్ని మాత్రమే గుర్తించి నాశనం చేస్తాయి. నాశనం చేసే పద్ధతులు అనేకం ఉన్నాయి.
గాలి, మంట (ఫ్లేమ్), చలి గాలి, మైక్రోవేవ్స్, లేజర్ కిరణాలు, వాటర్ జెట్‌ను ప్రయోగించటం ద్వారా (పంట మొక్కలు, చెట్లకు హాని జరగకుండా) కేవలం కలుపు మొక్కల్ని నిర్మూలించటం ఈ రోబోల ప్రత్యేకత. వీటి ఖరీదెక్కువ. నిర్వహణకు నైపుణ్యం కలిగిన పనివారి అవసరం ఉంటుంది. కూలీల సమస్యను అధిగమించే క్రమంలో కస్టమ్ హైరింగ్ సెంటర్ల ద్వారా డ్రోన్ల మాదిరిగా వీటిని మన దేశంలోనూ వినియోగించే అవకాశాలు ఉన్నాయి.
– పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్
Comments
Please login to add a commentAdd a comment