ఇక ఆన్‌లైన్‌లో ట్రాక్టర్‌ బుకింగ్‌  | Tractor booking In Online now | Sakshi
Sakshi News home page

ఇక ఆన్‌లైన్‌లో ట్రాక్టర్‌ బుకింగ్‌ 

Published Tue, Dec 11 2018 2:09 AM | Last Updated on Tue, Dec 11 2018 2:09 AM

Tractor booking In Online now - Sakshi

యాప్‌ను ఆవిష్కరిస్తున్న సీఎస్‌ ఎస్‌కే జోషి

సాక్షి, హైదరాబాద్‌: ఉబర్, ఓలా యాప్‌ల ద్వారా కార్లను అద్దెకు బుక్‌ చేసుకున్నట్లే ఇక నుంచి రైతులు ట్రాక్టర్లను బుక్‌ చేసుకునే సదుపాయాన్ని ‘టేఫ్‌’కంపెనీ అందుబాటులోకి తెచ్చింది. ట్రాక్టర్లను బుక్‌ చేసుకునేందుకు ‘జేఫామ్‌ సర్వీసెస్‌’ యాప్‌ను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి సోమవారం ప్రారంభించారు. కార్పొరేట్‌ సామాజిక బాధ్యత (సీఎస్సార్‌) కింద ఈ సర్వీసులను అందజేయనున్నట్లు ఆ సంస్థ తెలిపింది. ట్రాక్టర్లు ఉన్న రైతులు, కస్టమ్‌ హైరింగ్‌ సెంటర్లలో ఉన్న ట్రాక్టర్లను ఈ కంపెనీ వద్ద రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత సంబంధిత యాప్‌ ద్వారా ట్రాక్టర్‌ అవసరమైన రైతులు బుక్‌ చేసుకోవడానికి వీలుంటుంది. రాష్ట్రంలోని 31 జిల్లాల్లోనూ ఈ సర్వీసులను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. 

ఇతర వ్యవసాయ యంత్రాలు సైతం.. 
ట్రాక్టర్లతోపాటు ఇతరత్రా వ్యవసాయ యంత్రాలను యాప్‌ ద్వారా బుక్‌ చేసుకోవచ్చు. ట్రాక్టర్లు వచ్చి పొలం దున్నాక దానికి అవసరమైన అద్దెను రైతులు ఆన్‌లైన్‌ లేదా నేరుగా చెల్లించాల్సి ఉంటుంది. దేశంలోని 85శాతం మంది సన్న, చిన్నకారు రైతులకు సేవలు అందించేందుకే దీన్ని ప్రవేశపెట్టామని టేఫ్‌ కంపెనీ చైర్మన్‌ మల్లిక శ్రీనివాసన్‌ అన్నారు. ట్రాక్టర్లను యాప్‌ లేదా హెల్ప్‌లైన్‌ నంబర్లు 1800 4200 100, 1800 208 4242 ద్వారా బుక్‌ చేసుకోవచ్చన్నారు. తక్కువ ధర ఆండ్రాయిడ్‌ ఫోన్లలోనూ ట్రాక్టర్లను బుక్‌ చేసుకునేలా యాప్‌ను తీర్చిదిద్దామన్నారు. టేఫ్‌ ప్రెసిడెంట్‌ టీఆర్‌ కేశవన్‌ మాట్లా డుతూ.. రైతులకు ట్రాక్టర్లు, వ్యవసాయ యంత్రాలను ఆన్‌లైనన్లో అద్దెకు అందజేసేలా తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నామని తెలిపారు. ప్రస్తుతం రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, బిహార్, ఒడిశా, జార్ఖండ్, తెలంగాణల్లో జేఫామ్‌ సర్వీసుల ద్వారా 65 వేల మంది రైతులు లబ్ధి పొందారని తెలిపారు. ఇప్పటివరకు 1.45 లక్షల ఆర్డర్లు పొందినట్లు తెలిపారు. జేఫామ్‌ సర్వీసు దేశంలో ట్రాక్టర్లు, వ్యవసాయ యంత్రాలను అద్దెకు ఇచ్చే పెద్ద వేదికగా మారిందన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారథి, కమిషనర్‌ రాహుల్‌ బొజ్జా పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement