1–2 ఏళ్లలో ఈ–క్వాడ్రిసైకిల్ రాక
తొలుత యూరప్‌కు ఎగుమతి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ట్రాక్టర్ల ఎగుమతుల్లో అతిపెద్ద భారతీయ సంస్థ సోనాలికా ట్రాక్టర్స్ త్వరలో ఎలక్ట్రిక్ క్వాడ్రిసైకిల్ (చిన్న కార్లు) విభాగంలోకి ఎంట్రీ ఇస్తోంది. తొలుత యూరప్‌కు వీటిని ఎగుమతి చేయాలన్నది సంస్థ ఆలోచన. ప్రముఖ ఇంజనీరింగ్ సంస్థతో కలిసి ఇప్పటికే ప్రోటోటైప్‌కు రూపకల్పన చేసినట్టు పంజాబ్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న సోనాలికా వెల్లడించింది. ఒకట్రెండేళ్లలో ఎలక్ట్రిక్ క్వాడ్రిసైకిల్ నెదర్లాండ్స్ రోడ్లపై పరుగు తీయనుందని తెలిపింది. ఎలక్ట్రిక్ ట్రాక్టర్లు, ఎలక్ట్రిక్ క్వాడ్రిసైకిల్ అభివృద్ధి, ఈవీ ప్లాంటుకై సంస్థ రూ.1,000 కోట్లు పెట్టుబడి చేయనుంది. ఈ కొత్త మోడల్ పూర్తిగా సంస్థకు చెందిన మూడవ అత్యాధునిక, నూతన ఈవీ ఫ్యాక్టరీలో తయారు కానుంది. ఈవీ క్వాడ్రిసైకిల్‌తో పాటు సోనాలికా ఇదే ప్లాంటులో ఎలక్ట్రిక్ ట్రాక్టర్లను కూడా ఉత్పత్తి చేయనుంది. మూడవ ప్లాంటు ఉత్తరాదిన కొలువుదీరనుంది.
నడపడం సులభం..
యూరప్‌లో ఆదరణ లభిస్తున్నందున ఎలక్ట్రిక్ మైక్రోకార్ల విభాగంలోకి ప్రవేశించడానికి ఇదే సరైన సమయమని సోనాలికా గ్రూప్ అభిప్రాయపడింది. ‘ఇవి సంప్రదాయ కార్ల కంటే చాలా చిన్నవి. తేలికైనవి కూడా. రద్దీగా ఉండే వీధుల్లో పార్క్ చేయడం, నడపడం సులభం’ అని కంపెనీ వివరించింది. మైక్రోకార్లు వాటి చిన్న సైజు, పార్కింగ్ సౌలభ్యాన్ని పరిగణనలోకి తీసుకుని ప్రతి యూరోపియన్ దేశానికి అవసరమయ్యేవి అని అభిప్రాయపడింది. భారత్ మాదిరిగా కాకుండా పాశ్చాత్య దేశాలలో ప్రవేశ స్థాయి/చిన్న కార్ల ధరలను నిర్ణయించడం సవాలు కాదని తెలిపింది. కాగా, ట్రాక్టర్ల ఎగుమతుల పరంగా 34.3 శాతం వాటాతో సోనాలికా భారత్‌లో అగ్రస్థానంలో నిలిచింది. దేశీయ మార్కెట్లో కంపెనీకి 13.5 శాతం వాటా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment