Sonalika
-
సోనాలికా చిన్న కార్లు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ట్రాక్టర్ల ఎగుమతుల్లో అతిపెద్ద భారతీయ సంస్థ సోనాలికా ట్రాక్టర్స్ త్వరలో ఎలక్ట్రిక్ క్వాడ్రిసైకిల్ (చిన్న కార్లు) విభాగంలోకి ఎంట్రీ ఇస్తోంది. తొలుత యూరప్‌కు వీటిని ఎగుమతి చేయాలన్నది సంస్థ ఆలోచన. ప్రముఖ ఇంజనీరింగ్ సంస్థతో కలిసి ఇప్పటికే ప్రోటోటైప్‌కు రూపకల్పన చేసినట్టు పంజాబ్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న సోనాలికా వెల్లడించింది. ఒకట్రెండేళ్లలో ఎలక్ట్రిక్ క్వాడ్రిసైకిల్ నెదర్లాండ్స్ రోడ్లపై పరుగు తీయనుందని తెలిపింది. ఎలక్ట్రిక్ ట్రాక్టర్లు, ఎలక్ట్రిక్ క్వాడ్రిసైకిల్ అభివృద్ధి, ఈవీ ప్లాంటుకై సంస్థ రూ.1,000 కోట్లు పెట్టుబడి చేయనుంది. ఈ కొత్త మోడల్ పూర్తిగా సంస్థకు చెందిన మూడవ అత్యాధునిక, నూతన ఈవీ ఫ్యాక్టరీలో తయారు కానుంది. ఈవీ క్వాడ్రిసైకిల్‌తో పాటు సోనాలికా ఇదే ప్లాంటులో ఎలక్ట్రిక్ ట్రాక్టర్లను కూడా ఉత్పత్తి చేయనుంది. మూడవ ప్లాంటు ఉత్తరాదిన కొలువుదీరనుంది. నడపడం సులభం.. యూరప్‌లో ఆదరణ లభిస్తున్నందున ఎలక్ట్రిక్ మైక్రోకార్ల విభాగంలోకి ప్రవేశించడానికి ఇదే సరైన సమయమని సోనాలికా గ్రూప్ అభిప్రాయపడింది. ‘ఇవి సంప్రదాయ కార్ల కంటే చాలా చిన్నవి. తేలికైనవి కూడా. రద్దీగా ఉండే వీధుల్లో పార్క్ చేయడం, నడపడం సులభం’ అని కంపెనీ వివరించింది. మైక్రోకార్లు వాటి చిన్న సైజు, పార్కింగ్ సౌలభ్యాన్ని పరిగణనలోకి తీసుకుని ప్రతి యూరోపియన్ దేశానికి అవసరమయ్యేవి అని అభిప్రాయపడింది. భారత్ మాదిరిగా కాకుండా పాశ్చాత్య దేశాలలో ప్రవేశ స్థాయి/చిన్న కార్ల ధరలను నిర్ణయించడం సవాలు కాదని తెలిపింది. కాగా, ట్రాక్టర్ల ఎగుమతుల పరంగా 34.3 శాతం వాటాతో సోనాలికా భారత్‌లో అగ్రస్థానంలో నిలిచింది. దేశీయ మార్కెట్లో కంపెనీకి 13.5 శాతం వాటా ఉంది. -
ఆరుపదుల వయసులో రూ. 23,000కోట్ల అధిపతిగా.. ఎవరీ లచ్మన్ దాస్ మిట్టల్
Sonalika Tractors Founder Success Story: జ్ఞానం పెంచుకోవడానికి వయసుతో సంబంధం లేనట్లుగానే.. ఒక వ్యక్తి సక్సెస్ సాధించడానికి కూడా వయసుతో పని లేదు. పిల్లాడి దగ్గరి నుంచి వయసుడిగిన వృద్దులు వరకు తమదైన ఆలోచనలతో ఎవరైనా విజయం సాధించవచ్చు. అలాంటి కోవకు చెందిన 'లచ్మన్ దాస్ మిట్టల్' (Lachhman Das Mittal) గురించి ఈ కథనంలో తెలుసుసుకుందాం. 60ఏళ్ల వయసులో కంపెనీ.. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) నుంచి బయటకు వచ్చిన తరువాత ఓ కొత్త రంగానికి పునాది వేసాడు. అదే సోనాలిక (Sonalika) ట్రాక్టర్స్. 60ఏళ్ల వయసులో కంపెనీ ప్రారంభించి ఈ రోజు భారతదేశంలోని ప్రముఖ ట్రాక్టర్ తయారీదారులలో ఒకరుగా నిలబడ్డారు. దీన్ని బట్టి చూస్తే ఇందులో ఆయన కృషి, పట్టుదల మనకు స్పష్టంగా కనిపిస్తాయి. సోనాలికా ట్రాక్టర్.. నివేదికల ప్రకారం, 1990లో తన వ్యాపార వృత్తిని ప్రారంభించిన మిట్టల్ 1995లో పంజాబ్‌లో సోనాలికా ట్రాక్టర్లను మొదలెట్టాడు. ఇదే ప్రస్తుతం భారతదేశపు మూడవ అతిపెద్ద ట్రాక్టర్ ఉత్పత్తిదారుగా.. ఏడాది 3 లక్షల ట్రాక్టర్లను ఉత్పత్తి చేసినట్లు సమాచారం. 2021-2022 ఆర్థిక సంవత్సరంలో ఎగుమతిదారుల జాబితాలో అగ్రగామిగా నిలిచింది. దీని వాటా ఏకంగా 11.7శాతం కావడం గమనార్హం. పెద్ద ఎదురు దెబ్బ.. ఎల్ఐసీతో కలిసి పని చేయడం ద్వారా లక్మన్ దాస్ మిట్టల్ పొదుపు, పెట్టుబడి గురించి అవగాహన పొందాడు. దీంతో తన డబ్బును బ్యాంకు ఖాతాల్లో సేవ్ చేసుకోకుండా అనేక స్కీమ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టాడు. ఆ తరువాత సైడ్ వెంచర్‌గా వ్యవసాయ పరికరాల కంపెనీ స్టపించాలని నిర్ణయించుకున్నాడు. ఆ సమయంలో ఊహించని పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. పెట్టుబడులు అన్నీ పోయాయి. ఇదీ చదవండి: పాముల పెంపకం.. కోట్లలో ఆదాయం - ఎక్కడో తెలుసా? 74 దేశాలకు ఎగుమతి.. భారీ నష్టాలను చవి చూసినప్పటికీ మిట్టల్ పట్టువదలని విక్రమార్కుని మాదిరిగా ఒకసారి గోధుమ, ఎండుగడ్డిని వేరు చేసే యంత్రం గమనించాడు. దీంతో అతనికి కొత్త ఆలోచనలు పుట్టుకొచ్చాయి. ఇందులో భాగంగా నూర్పిడి యంత్రాలు నిర్మించడం ప్రారంభించాడు. ఇవి కేవలం ఎనిమిది సంవత్సరాల్లో ఊహకందని విజయం పొందింది. ఆ తరువాత ట్రాక్టర్లను నిర్మించడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈ సోనాలిక ట్రాక్టర్లు 74 దేశాలకు ఎగుమతి అవుతున్నట్లు సమాచారం. ఇదీ చదవండి: మానవాద్భుత సృష్టి.. వీడియో చూసి ఫిదా అవుతున్న నెటిజన్లు! నికర విలువ.. సోనాలికా ట్రాక్టర్స్ ఫ్లాగ్షిప్ కంపెనీ, ఇంటర్నేషనల్ ట్రాక్టర్స్ లిమిటెడ్ బాధ్యతలు మిట్టల్ కుమారులు అమృత్ సాగర్, దీపక్, మనవళ్లు రామన్, సుశాంత్ అండ్ రాహుల్‌లకు అప్పగించారు. ఫోర్బ్స్ ప్రకారం లచ్మన్ దాస్ మిట్టల్ నికర విలువ రూ. 23,000 కోట్ల కంటే ఎక్కువని తెలుస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్ 12న కేషుబ్ మహీంద్రా మరణించిన తర్వాత, మిట్టల్ ఇప్పుడు దేశంలోనే అత్యంత వృద్ధ బిలియనీర్‌గా ఖ్యాతి పొందాడు. -
చరిత్రలోనే తొలిసారి.. అమ్మకాల్లో సోనాలికా సరికొత్త రికార్డ్‌లు
హైదరాబాద్: భారత్ నెంబర్ 1 ట్రాక్టర్ ఎక్స్పోర్ట్ బ్రాండ్ సోనాలికా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్)లో రికార్డు స్థాయిలో 40,700 ట్రాక్టర్ల అమ్మకాలు జరిపింది. సోనాలికా వ్యాపార చరిత్రలో ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఇంత భారీ స్థాయిలో విక్రయాలు జరపడం ఇదే తొలిసారి. మార్కెట్ షేర్లో కూడా సంస్థ ఆధిపత్యాన్ని కొనసాగించింది. ఇదే తరహా రికార్డు విక్రయాలు మున్ముందు త్రైమాసికాల్లో కూడా కొనసాగుతాయన్న విశ్వాసాన్ని ఈ మేరకు వెలువడిన ఒక ప్రకటన తెలిపింది. వ్యవసాయం–పర్యావరణ వ్యవస్థల మధ్య సమతౌల్యత సాధిస్తూ ప్రపంచ స్థాయి ప్రమాణాలు, నాణ్యతతో కూడిన హెవీ డ్యూటీ ట్రాక్టర్లు అలాగే ఇతర సరసమైన వ్యవసాయ ఉత్పాదకతలను అందించడానికి కట్టుబడి ఉన్నట్లు ఇంటర్నేషనల్ ట్రాక్టర్స్ లిమిటెడ్ (సోనాలికా అండ్ సోలిస్)జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ రామన్ మిట్టల్ పేర్కొన్నారు. రైతులను మరింత ఉత్పాదకత దిశగా నడిపించడానికి, ప్రగతిశీల బాటలో వారిని సంపన్నులుగా మార్చడానికి సంస్థ తన వంతు కృషి చేస్తుందని కూడా ఆయన పేర్కొన్నారు. -
సోనాలిక ట్రాక్టర్స్ బంపర్ సేల్స్
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఎనిమిది నెలల్లో మొత్తం లక్ష ట్రాకర్లను అమ్మినట్లు సోనాలిక ట్రాక్టర్స్ ప్రకటించింది. అంతక్రితం ఇదే కాలంలో జరిగిన విక్రయాలతో పోలిస్తే 11.2 శాతం వృద్ధిని సాధించినట్లు తెలిపింది. (మీరు ఎస్బీఐ ఖాతాదారులా? అయితే మీకో గుడ్ న్యూస్) కాగా, ఇదే కాలంలో పరిశ్రమ కేవలం 8.8 శాతం పెరుగుదలను నమోదు చేసింది. 2017-18 నుంచి ప్రతీ ఏడాది ఒక లక్ష పైగా ట్రాక్టర్లను విక్రయిస్తున్నట్లు పేర్కొంది. కంపెనీ అత్యంత వేగంగా లక్ష ట్రాక్టర్ల అమ్మకాలను 8 నెలల్లోనే నమోదు చేయడం పట్ల కంపెనీ జాయింట్ ఎండీ రమణ్ మిట్టల్ హర్షం వ్యక్తం చేశారు. (టెక్ మహీంద్ర ఉద్యోగులకు బంపర్ ఆఫర్) -
సోనాలిక ట్రాక్టర్ అమ్మకాల జోరు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పండుగ సీజన్ నేపథ్యంలో సోనాలిక ట్రాక్టర్స్ అక్టోబర్‌లో 20,000 ట్రాక్టర్లను విక్రయించింది. పరిశ్రమ వర్గాలు అంచనా వేసిన 7అమ్మకాల వృద్ధిని అధిగమించి ఏకంగా 16 శాతం వృద్ధిని నమోదు చేసినట్లు కంపెనీ తెలిపింది. ఒక నెలలో తమకు ఇవే అత్యధిక అమ్మకాలని కంపెనీ జాయింట్ ఎండీ రమణ్ మిట్టల్ తెలిపారు. తమ ట్రాక్టర్ల తయారీలో అత్యాధునిక సాంకేతికత వినియోగిస్తున్నందున రైతుల నుంచి తమ బ్రాండ్‌కు విశేషమైన ఆదరణ లభిస్తుందని రమణ్ అన్నారు. -
మార్కెట్లో తొలి ఎలక్ట్రిక్ ట్రాక్టర్ ఇదే!
సాక్షి, ముంబై: సోనాలిక ట్రాక్టర్స్ కంపెనీ దేశంలోనే తొలి ఎలక్ట్రిక్ ట్రాక్టర్‌ను మార్కెట్లోకి తెచ్చింది. టైగర్ పేరుతో అందిస్తున్న ఈ ఎలక్ట్రిక్ ట్రాక్టర్ ధర రూ.5.99 లక్షలు(ఎక్స్ షోరూమ్) అని సోనాలిక ట్రాక్టర్స్ తెలిపింది. ఈ ట్రాక్టర్‌ను 25.5 కేడబ్ల్యూ నేచురల్ కూలింగ్ కాంపాక్ట్ బ్యాటరీతో రూపొందించామని, నిర్వహణ వ్యయాలు చాలా తక్కువగా (డీజిల్ ట్రాక్టర్ల వ్యయాలతో పోల్చితే నాలుగో వంతు)ఉంటాయని సోనాలిక గ్రూప్ ఈడీ రామన్ మిట్టల్ తెలిపారు. (అప్రీలియా ఎస్ఎక్స్ఆర్ 160 వచ్చేసింది) నాలుగు గంటల్లోనే ఫుల్ చార్జింగ్... ఈ ఎలక్ట్రిక్ ట్రాక్టర్ గరిష్ట వేగం గంటకు 24.93 కి.మీ. అని, ఒక్కసారి బ్యాటరీని చార్జింగ్ చేస్తే ఎనిమిది గంటల పాటు ఈ ట్రాక్టర్ పనిచేస్తుందని(రెండు టన్నుల ట్రాలీతో) మిట్టల్ వివరించారు. నాలుగు గంటల్లోనే పూర్తిగా చార్జింగ్ చేసే ఫాస్ట్ చార్జింగ్ సిస్టమ్‌ను కూడా ఆఫర్ చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ టైగర్ ఎలక్ట్రిక్ ట్రాక్టర్‌ను యూరప్‌లో డిజైన్ చేశామని, పంజాబ్‌లోని హోషియార్‌పూర్‌లో తయారు చేశామన్నారు. -
కేరళ పునర్నిర్మాణానికి సోనాలికా సహకారం
భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలం అయిన కేరళ రాష్ట్ర పునర్నిర్మాణంలో ప్రతిష్టాత్మక ట్రాక్టర్ బ్రాండ్ సోనాలికా ఇంటర్నేషనల్ ట్రాక్టర్స్ లిమిటెడ్ పాలుపంచుకుంది. తన వంతు సాయంగా కేరళ రిలీఫ్ ఫండ్‌కు కోటి రూపాయలను అందించింది. దీనితోపాటు ఐదు బహుళ ప్రయోజనకర హెవీ డ్యూటీ ట్రాక్టర్స్‌ను కూడా రాష్ట్రానికి ఇచ్చింది. ఇందుకు సంబంధించి ఒక చెక్కు, ట్రాక్టర్ నమూనాను సోనాలికా గ్రూప్ ప్రెసిడెంట్ ముదిత్ గుప్తా కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు అందజేశారు. కేరళ ప్రజలకు సంస్థ మరింత సాయం అందజేస్తుందని ఈ మేరకు విడుదల చేసిన ఒక ప్రకటనలో గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రామన్ మిట్టల్ పేర్కొన్నారు. -
సోనాలికా 250 హెచ్‌పీ ట్రాక్టర్ త్వరలో!
♦ ఆగస్టు తర్వాతి నుంచి అమ్మకాల జోష్ ♦ గతేడాది స్థాయిలోనే దేశీ మార్కెట్ ♦ కంపెనీ సేల్స్ డెరైక్టర్ రానా హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ట్రాక్టర్ల తయారీలో ఉన్న సోనాలికా 250 హెచ్‌పీ సామర్థ్యం గల మోడల్‌ను అభివృద్ధి చేస్తోంది. ఈ ఏడాదే దీనిని ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అయితే అంతర్జాతీయ మార్కెట్ కోసం ఈ మోడల్ రూపొందిస్తున్నారు. ప్రస్తుతం కంపెనీ 20-120 హెచ్‌పీ విభాగంలో ట్రాక్టర్లను దేశీయంగా విక్రయిస్తోంది. మరింత అధిక సామర్థ్యమున్న మోడళ్లను భారత్‌లో ప్రవేశపెడతామని సోనాలికా ఇంటర్నేషనల్ ట్రాక్టర్స్ సేల్స్, మార్కెటింగ్ డెరైక్టర్ డి.ఎల్.రానా శుక్రవారమిక్కడ మీడియాకు తెలిపారు. కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా మోడళ్లకు రూపకల్పన చేస్తున్నట్టు చెప్పారు. 2015-16లో కొత్తగా 3 ట్రాక్టర్లను ప్రవేశపెట్టామన్నారు. మార్చికల్లా మరో 2 రానున్నాయని వివరించారు. ఈ ఏడాది ఆగస్టు నుంచి.. దేశీయంగా ట్రాక్టర్ల మార్కెట్లో 2013-14లో 6.34 లక్షల యూనిట్లు నమోదయ్యాయి. 2014-15 వచ్చేసరికి ఈ సంఖ్య 5.50 లక్షలకు పడిపోయింది. 2015-16 సంవత్సరం ఏప్రిల్-డిసెంబర్ కాలంలో 3.89 లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయి. వర్షాలు ఆశించిన స్థాయిలో లేకపోవడం, పంటలకు గిట్టుబాటు ధర రాకపోవడం వంటి కారణాలతో రైతులు కొత్త ట్రాక్టర్ల కొనుగోలుకు దూరంగా ఉన్నారని కంపెనీ తెలిపింది. మొత్తంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2014-15 స్థాయిలోనే ఉంటుందని సోనాలికా అంచనా వేస్తోంది. ఆగస్టు తర్వాతి నుంచి తిరిగి అమ్మకాలు పుంజుకుంటాయని భావిస్తున్నామని రానా చెప్పారు. సోనాలికా 2014-15లో దేశవ్యాప్తంగా 66 వేల యూనిట్లను అమ్మింది. 15 శాతం వాటా లక్ష్యం.. ట్రాక్టర్ల తయారీలో దేశంలో మూడో స్థానంలో ఉన్న సోనాలికా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మార్కెట్లో 6.5 శాతం వాటా కలిగి ఉంది. ఈ రాష్ట్రాల్లో 2017 మార్చినాటికి 15 శాతం వాటా లక్ష్యంగా చేసుకుంది. పరిశోధన, అభివృద్ధికి ఏటా రూ.25 కోట్లు వెచ్చిస్తోంది. రూ.500 కోట్లతో 2 లక్షల యూనిట్ల వార్షిక సామర్థ్యంతో కంపెనీ కొత్తగా పంజాబ్‌లో ఏర్పాటు చేస్తున్న ప్లాంటులో ఉత్పత్తి మరో 3 నెలల్లో ప్రారంభం కానుందని సీనియర్ జీఎం ఎన్‌వీఎల్‌ఎన్ స్వామి తెలిపారు. నాలుగేళ్ల క్రితం దేశీయ మార్కెట్లో 8 శాతంగా ఉన్న సోనాలికా వాటా ప్రస్తుతం 12 శాతానికి ఎగబాకింది.