సోనాలికా 250 హెచ్‌పీ ట్రాక్టర్ త్వరలో! | sonalika 250 hp tractors coming soon! | Sakshi
Sakshi News home page

సోనాలికా 250 హెచ్‌పీ ట్రాక్టర్ త్వరలో!

Published Sat, Jan 23 2016 1:06 AM | Last Updated on Sun, Sep 3 2017 4:07 PM

సోనాలికా 250 హెచ్‌పీ ట్రాక్టర్ త్వరలో!

సోనాలికా 250 హెచ్‌పీ ట్రాక్టర్ త్వరలో!

ఆగస్టు తర్వాతి నుంచి అమ్మకాల జోష్
గతేడాది స్థాయిలోనే దేశీ మార్కెట్
కంపెనీ సేల్స్ డెరైక్టర్ రానా

 
 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ట్రాక్టర్ల తయారీలో ఉన్న సోనాలికా 250 హెచ్‌పీ సామర్థ్యం గల మోడల్‌ను అభివృద్ధి చేస్తోంది. ఈ ఏడాదే దీనిని ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అయితే అంతర్జాతీయ మార్కెట్ కోసం ఈ మోడల్ రూపొందిస్తున్నారు. ప్రస్తుతం కంపెనీ 20-120 హెచ్‌పీ విభాగంలో ట్రాక్టర్లను దేశీయంగా విక్రయిస్తోంది.
 
 మరింత అధిక సామర్థ్యమున్న మోడళ్లను భారత్‌లో ప్రవేశపెడతామని సోనాలికా ఇంటర్నేషనల్ ట్రాక్టర్స్ సేల్స్, మార్కెటింగ్ డెరైక్టర్ డి.ఎల్.రానా శుక్రవారమిక్కడ మీడియాకు తెలిపారు. కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా మోడళ్లకు రూపకల్పన చేస్తున్నట్టు చెప్పారు. 2015-16లో కొత్తగా 3 ట్రాక్టర్లను ప్రవేశపెట్టామన్నారు. మార్చికల్లా మరో 2 రానున్నాయని వివరించారు.
 
 ఈ ఏడాది ఆగస్టు నుంచి..
 దేశీయంగా ట్రాక్టర్ల మార్కెట్‌లో 2013-14లో 6.34 లక్షల యూనిట్లు నమోదయ్యాయి. 2014-15 వచ్చేసరికి ఈ సంఖ్య 5.50 లక్షలకు పడిపోయింది. 2015-16 సంవత్సరం ఏప్రిల్-డిసెంబర్ కాలంలో 3.89 లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయి. వర్షాలు ఆశించిన స్థాయిలో లేకపోవడం, పంటలకు గిట్టుబాటు ధర రాకపోవడం వంటి కారణాలతో రైతులు కొత్త ట్రాక్టర్ల కొనుగోలుకు దూరంగా ఉన్నారని కంపెనీ తెలిపింది. మొత్తంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2014-15 స్థాయిలోనే ఉంటుందని సోనాలికా అంచనా వేస్తోంది. ఆగస్టు తర్వాతి నుంచి తిరిగి అమ్మకాలు పుంజుకుంటాయని భావిస్తున్నామని రానా చెప్పారు. సోనాలికా 2014-15లో దేశవ్యాప్తంగా 66 వేల యూనిట్లను అమ్మింది.
 
 15 శాతం వాటా లక్ష్యం..
 ట్రాక్టర్ల తయారీలో దేశంలో మూడో స్థానంలో ఉన్న సోనాలికా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మార్కెట్లో 6.5 శాతం వాటా కలిగి ఉంది. ఈ రాష్ట్రాల్లో 2017 మార్చినాటికి 15 శాతం వాటా లక్ష్యంగా చేసుకుంది. పరిశోధన, అభివృద్ధికి ఏటా రూ.25 కోట్లు వెచ్చిస్తోంది. రూ.500 కోట్లతో 2 లక్షల యూనిట్ల వార్షిక సామర్థ్యంతో కంపెనీ కొత్తగా పంజాబ్‌లో ఏర్పాటు చేస్తున్న ప్లాంటులో ఉత్పత్తి మరో 3 నెలల్లో ప్రారంభం కానుందని సీనియర్ జీఎం ఎన్‌వీఎల్‌ఎన్ స్వామి తెలిపారు. నాలుగేళ్ల క్రితం దేశీయ మార్కెట్లో 8 శాతంగా ఉన్న సోనాలికా వాటా ప్రస్తుతం 12 శాతానికి ఎగబాకింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement