సాక్షి, అమరావతి: పచ్చ కామెర్లు అలుముకున్న పచ్చ పత్రికలు చంద్రబాబు జమానాలో జరిగినట్లుగా ఇప్పుడూ అవినీతి జరుగుతోందన్న భ్రమల్లోనే ఉంటాయి. బాబు జమానాలో పచ్చ పార్టీ నేతలకు యంత్రపరికరాలను కట్టబెట్టడమే కాదు.. సబ్సిడీ మొత్తాన్ని వారికి చెందిన వారికే పప్పుబెల్లాల్లా పంచిపెట్టారు. అదే రీతిలో ఇప్పుడు కూడా జరుగుతోందన్న భ్రమల్లో కళ్లుమూసుకొని కథనాలు అల్లేస్తున్నారు రామోజీ. క్షేత్రస్థాయికి వెళ్లి వాస్తవాలను పరిశీలించకుండా అబద్ధాలతో ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు.
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా వ్యవసాయ యాంత్రీకరణ అంటే పచ్చపార్టీ నేతలకు పండగలా ఉండేది. కమీషన్ల కోసం ట్రాక్టర్లు (రైతురథాలు), యంత్రాలను వారి తాబేదార్లకు కట్టబెట్టారు. 2014–2019 వరకు ఇష్టమైన వారితో 3,584 కమ్యూనిటీ హైరింగ్ సెంటర్లు(సీహెచ్‌సీ) ఏర్పాటు చేశారు. వీటిలో రైతులన్న వారు చాలా తక్కువ. వీటిద్వారా రూ.239.16 కోట్ల సబ్సిడీతో కూడిన ట్రాక్టర్లు పంపిణీ చేశారు.
అయితే, ఏ కంపెనీవి కొనాలో, ఏ డీలర్ దగ్గర కొనాలో కూడా మంత్రులు, ఎమ్మెల్యేలు లేదా స్థానిక టీడీపీ నాయకులే నిర్దేశించేవారు. తద్వారా కంపెనీలు, డీలర్ల నుంచి కమీషన్లు పొందే వారు. వాటికి రుణాల కోసం రైతులే బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేసేవారు. రాయితీ సొమ్మును కంపెనీ డీలర్ల ఖాతాకు జమ చేసేవారు. చాలాచోట్ల ట్రాక్టర్లు రైతులకు ఇవ్వకుండానే సబ్సిడీ సొమ్ము స్వాహా చేసినట్టుగా అప్పట్లో పెద్దఎత్తున ఆరోపణలు కూడా వచ్చాయి.
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ అక్రమాలకు చెక్ పెట్టారు. చిన్న, సన్నకారు రైతులకు ఆధునిక వ్యవసాయ యంత్ర పరికరాలను తక్కువ అద్దెకే అందించి, వారికి ఎక్కువ లాభాలు వచ్చేలా చేయాలన్న సంకల్పంతో వైఎస్సార్ యంత్ర సేవ పథకాన్ని ప్రవేశపెట్టారు. పారదర్శకతకు పెద్దపీట వేస్తూ వైఎస్సార్ యంత్ర సేవా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎలాంటి సిఫార్సులకు తావు లేకుండా పారదర్శకంగా ఎంపిక చేసిన రైతు కమిటీల (సీహెచ్‌సీ)కు వారు కోరుకున్న యంత్ర పరికరాలను అందిస్తున్నారు.
తక్కువ అద్దెకే రైతులకు వీటిని అందిస్తున్నారు. అద్దె వివరాలను ఆర్బీకేల్లో ప్రదర్శిస్తున్నారు. అయితే, ఈనాడు మాత్రం వాస్తవాలకు పాతరేస్తూ ‘వైకాపా నేతలకే యంత్ర సేవ’ అంటూ అబద్ధాలను అచ్చేసింది. జిల్లాల్లో యంత్ర పరికరాలు అమ్ముకున్నారని, వైఎస్సార్‌సీపీ నేతల బంధువుల ఇళ్లల్లో ఉన్నాయని, ఇసుక, మట్టి తవ్వకాలకు ఉపయోగిస్తున్నారని, పాత పరికరాలకు రంగులేసి సొమ్ము చేసుకున్నారంటూ ఇష్టానుసారం ఆరోపణలు చేసింది. ఈ కథనంలో వాస్తవాలేమిటో ఒక్కసారి పరిశీలిద్దాం..
ఆరోపణ: పారదర్శకతకు పాతరేశారు
వాస్తవం: గ్రామాల్లో సాగయ్యే పంటలకు కావలసిన, స్థానికంగా డిమాండ్ కలిగిన పరికరాలను ఎంపిక చేసుకునే అవకాశాన్ని రైతు కమిటీలకే అప్పగించారు. నిర్ణయాధికారం వాటికే ఇచ్చారు. అంతేకాదు.. వాటిని వారికి నచ్చిన కంపెనీల నుంచి కొనుక్కొనే అవకాశం కల్పించారు. పైగా సబ్సిడీ మొత్తం గతంలో మాదిరిగా కంపెనీల ఖాతాలకు కాకుండా నేరుగా రైతు కమిటీల ఖాతాలకు జమ చేశారు. ఇందులో ఎటువంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా చేశారు.
ఆరోపణ: ఆర్బీకేల్లో కానరాని అద్దెల బోర్డులు
వాస్తవం: ప్రైవేటు వ్యక్తులు, సంస్థలు ఇచ్చే పరికరాల రెంట్లకంటే తక్కువ అద్దెలుండేలా ప్రతి వ్యవసాయ సీజన్‌కు ముందు వ్యవసాయ సలహా మండలి సమావేశాల్లో అద్దెలను నిర్ణయించి, ఆ వివరాలను ఆర్బీకేల్లో ప్రదర్శిస్తున్నారు. ఇలా 3 ఏళ్లలో అక్షరాలా 3.3 లక్షల మంది రైతులు ఈ యంత్ర పరికరాలు, ట్రాక్టర్లను అద్దెకు తీసుకున్నారు. 8.90 లక్షల ఎకరాల్లో వ్యవసాయ పనులకు ఉపయోగించుకున్నారు.
ఆరోపణ: నాయకులు. వారి అనుచరుల పేర్లతోనే సంఘాలు
వాస్తవం: వైఎస్సార్ యంత్ర సేవా పథకం కింద ఆర్బీకే పరిధిలోని గ్రామంలో భూమి కలిగి వ్యవసాయం చేస్తున్న ఐదారుగురు రైతులతో కమిటీ (సీహెచ్‌సీ)లను ఏర్పాటు చేశారు. పార్టీ, కులం, వ్యక్తిగత వివరాలతో సంబంధం లేకుండా ఎలాంటి రాజకీయ ప్రమేయం, సిఫార్సులకు తావులేకుండా అర్హులైన రైతులతో మాత్రమే కమిటీలను ఏర్పాటు చేశారు.
ఇలా 10,444 గ్రామాల్లో ఆర్బీకే స్థాయిలో, క్లస్టర్ స్థాయిలో ఏర్పాటైన 492 రైతు కమిటీలకు రూ.1052.42 కోట్ల విలువైన యంత్ర పరికరాలు, ట్రాక్టర్లను అందించారు. వీటి కోసం రూ.366.25 కోట్లు సబ్సిడీ రూపంలో రాష్ట్ర ప్రభుత్వం భరించింది. యంత్ర సేవా కేంద్రాల్లో 6,362 ట్రాక్టర్లు, 492 హార్వెస్టర్లు, 31,356 ఇతర యంత్రపరికరాలను అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఆరోపణ: ఆన్‌లైన్‌లో కానరాని సేవలు
వాస్తవం: రైతులు గ్రామంలోనే కాకుండా, మండలంలోని ఏ ఆర్బీకే పరిధిలోఉన్న యంత్ర సేవా కేంద్రం నుంచైనా యంత్రాలను తక్కువ అద్దెకు పొందవచ్చు. ఈ రేట్లను ఆర్బీకేల్లో ప్రదర్శిస్తారు. వీటికోసం ఈ ఏడాది ఏప్రిల్ నుంచి వైఎస్సార్ యంత్ర సేవా యాప్‌ను తీసుకొచ్చారు. అగ్రీనెట్ వెబ్‌సైట్‌లో వైఎస్సార్ యాప్‌లో పొందుపరిచిన లింక్ ద్వారా రైతులు వారికి కావలిసిన పరికరాలు, యంత్రాలను 15 రోజుల ముందుగా బుక్ చేసుకుంటే సరిపోతుంది. ఆన్‌లైన్ విధానం తెలియని వారు ఆర్బీకేలోని వీఏఏ ద్వారా బుక్ చేసుకోవచ్చు.
ఆరోపణ: ఈ యంత్ర పరికరాలతో మట్టి, ఇసుక తవ్వకాలు
వాస్తవం: వైఎస్సార్ జిల్లా ఒంటిమిట్ట మండలంలో ఏర్పాటు చేసిన 9 కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు 647 మంది రైతులు యంత్ర సేవలు పొందారు. అద్దెకు తీసుకున్న యంత్ర పరికరాలను 2,008 ఎకరాల్లో వ్యవసాయ పనుల కోసం ఉపయోగించుకున్నారు. అద్దె రూపంలో కమిటీలకు రూ.9.45 లక్షల ఆదాయం వచ్చింది. విజయనగరం జిల్లా గంట్యాడ మండలంలో 21 ఆర్బీకేల్లో ఏర్పాటైన కేంద్రాల ద్వారా ఇప్పటివరకు 385 రైతులు యంత్ర సేవలు పొందారు.
అద్దెకు తీసుకున్న యంత్రాలతో 1,793 ఎకరాల్లో వ్యవసాయ పనులు చేశారు. రైతు కమిటీలకు బాడుగ రూపంలో రూ.5.47 లక్షల ఆదాయం వచ్చింది. నంద్యాల మండలంలో 19 యంత్ర సేవా కేంద్రాల ద్వారా ఇప్పటివరకు 1,106 మంది రైతులు 2,905 ఎకరాలలో అద్దెకు యంత్ర సేవలు పొందారు. ఈ కేంద్రాలు రూ.13.72 లక్షలు బాడుగ సొమ్ము పొందాయి.
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో వరి కోత యంత్రంతో కూడా యంత్ర సేవ కేంద్రాలను రైతు కమిటీలకే ఇచ్చారు. జిల్లాల్లో రైతులు గ్రామం, మండలం పరిధిలోని యంత్ర సేవా యాప్ ద్వారా పరికరాలను వినియోగించుకుంటున్నారు. ఇవి వాస్తవాలు. వీటిని పట్టించుకోకుండా యాంత్రికంగా అసత్యాలతో రాసే రాతలను ప్రజలు తిరస్కరిస్తారు రామోజీ.
ఆరోపణ: రాయితీ సొమ్ము పక్కదారి
వాస్తవం: ఎంపిక చేసిన రైతు కమిటీలకు ఆప్కాబ్, డీసీసీబీలతో పాటు హెచ్‌డీఎఫ్‌సీ, కెనరా బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఐవోబీ తదితర బ్యాంకుల ద్వారా ఎలాంటి పూచీకత్తు లేకుండా యూనిట్ మొత్తంలో 50 శాతం రుణం రూపంలో అందించారు. పైగా తీసుకున్న రుణాలను రైతు కమిటీలు సకాలంలో చెల్లించేలా వైఎస్సార్ యంత్ర సేవా యాప్ ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
ఆరోపణ: ట్రాక్టర్లు, కంబైన్డ్ హార్వెస్టర్లు అమ్మేసుకుంటున్నారు
వాస్తవం: యంత్ర సేవా కేంద్రాలకు సరఫరా చేసిన యంత్రాలను వ్యవసాయ శాఖ, బ్యాంకులు సంయుక్తంగా తనిఖీ చేసిన తరువాతే ఆ కమిటీలకు రాయితీ సొమ్ము విడుదల చేశారు. పైగా తీసుకున్న రుణాలను 3 నుంచి 5 ఏళ్లలో చెల్లిస్తేనే ట్రాక్టర్లు, కంబైన్డ్ హార్వెస్టర్లుపై హక్కులు వస్తాయి. అప్పటివరకు అవి బ్యాంకుల తనఖాలో ఉంటాయి. అలాంటప్పుడు వాటిని అమ్ముకునే అవకాశం ఎక్కడ ఉంటుందో రామోజీకే తెలియాలి.
Comments
Please login to add a commentAdd a comment