సాక్షి, అమరావతి బ్యూరో: సకాలంలో వర్షాలు కురవడంతో రైతుల పంటల సాగులో నిమగ్నమయ్యారు. జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో పొలం పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. పల్నాడు వ్యాప్తంగా అన్ని మండలాల్లో రైతులు పత్తి విత్తనాలు నాటుతున్నారు. పల్నాడు ప్రాంతంలో రైతులు పత్తి విత్తనాలు ముమ్మరంగా నాటుతున్నారు. పశి్చమ డెల్టా ప్రాంతంలో వేమూరు, పొన్నూరు ప్రాంతాల్లో వెద పద్ధతిలో వరి సాగుచేస్తున్నారు. రెంటచింతల, పిడుగురాళ్ల, క్రోసూరు ప్రాంతాల్లో ఓపెన్ నర్సరీలు, షేడ్‌నెట్‌లో మిరప నారు పోస్తున్నారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ముందస్తు ఖరీఫ్ కింద, పెసర, మినుము, నూగు పంట సాగుచేశారు. పచ్చిరొట్టె ఎరువులకు సంబంధించి 6,140 ఎకరాల్లో పంట సాగు అయింది.
గత ఏడాది పత్తి, పసుపు పంటలకు ఆశించిన మేర ధర లేదు. దీనికి తోడు పత్తి పంటకు గులాబీ రంగు పురుగు కొన్ని ప్రాంతాల్లో సోకవడంతో దిగుబడిపై ప్రభావం చూపింది. దీంతో మిరప పంటకు సంబంధించి ధరలు ఆశాజనకంగా ఉండటం, దిగుబడులు సైతం బాగానే వచ్చాయి. దీంతో ఈ ఏడాది రైతులు మిరప పంట సాగు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. దీంతో పత్తి పంట సాగు కొంత మేర తగ్గి, మిరప పంట సాగు పెరుతోందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది ఖరీఫ్‌లో పంట సాగు లక్ష్యం 12,68,970 ఎకరాల్లో సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే పత్తి పంటకు సంబంధించి సాగు లక్ష్యం 4,50,000 ఎకరాలు, మిరప పంట సాగు లక్ష్యం 1,89,265 ఎకరాలుగా నిర్ణయించారు.
జిల్లాలో పంటల సాగు ఇలా
జిల్లాలో జూన్ నెలలో సాధారణ వర్షపాతం 83.4 మిల్లీమీటరు. 114.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అంటే 32 శాతం అదనంగా వర్షపాతం నమోదైంది. దీంతో జిల్లాలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో పదునైంది. ప్రస్తుతం పల్నాడు ప్రాంతంలోని మాచర్ల, దుర్గి, రెంట చింతల, గురజాల, పిడుగురాళ్ల, దాచేపల్లి, మాచవరం, ఫిరంగిపురం, క్రోసూరు, యడ్లపాడు మండలాల్లో 26,142.5 ఎకరాల్లో పత్తి పంట సాగు చేశారు. పశి్చమ డెల్టా పరిధిలోని వేమూరు, పొన్నూరు ప్రాంతాల్లో 255 ఎకరాల్లో వెద పద్ధతిలో వరి పంటను సాగు చేశారు. ఇవి కాకుండా ముందస్తు ఖరీఫ్ కింద పెసర పంట 1032.5 ఎకరాలు, మినుము పంట 3422.5 ఎకరాలు, నువ్వులు 1740 ఎకరాల్లో మొత్తం 6,195 ఎకరాల్లో పంట సాగు చేశారు. పచ్చిరొట్ట ఎరువులకు సంబంధించిన పంటలు 6,485 ఎకరాల్లో సాగు అయ్యాయి. మిరప నారు 187.5 ఎకరాల్లో పోశారు. చిరు ధాన్యాల పంటలు 357.5 ఎకరాలు, పసుపు పంట 1505 ఎకరాల్లో సాగు అయ్యాయి. జిల్లా వ్యాప్తంగా అన్ని రకాల పంటలు కలిపి 46,557.5 ఎకరాల్లో సాగయ్యాయి.
ఉత్సాహంగా పంటల సాగు...
ఈ ఏడాది రైతులు ఉత్సాహంగా రైతులు పంటల సాగు చేస్తున్నారు. జూన్ నెల చివరి నాటికి పట్టిసీమ నీరు రావడంతో పశి్చమ డెల్టా రైతులు వెద పద్ధతితోపాటు, వరి నారు పోసుకునేందుకు పొలాలను సిద్ధం చేస్తున్నారు. కృష్ణా ఎగువ పరివాహక ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండటంతో ఈ ఏడాది శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులు త్వరగానే నిండుతాయని రైతులు ఆశిస్తున్నారు. దీని ద్వారా ఈ ఏడాది పంటలకు సంబంధించి సాగునీటికి ఇబ్బంది ఉండదని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాల ద్వారా నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అందజేస్తున్నారు. పంట రుణాలు ఇప్పించే ఏర్పాటు చేస్తున్నారు. రైతులను అన్ని విధాలా ప్రభుత్వం ప్రొత్సహిస్తుండటంతో రెట్టించిన ఉత్సాహంతో అన్నదాతలు పంటలు సాగు చేస్తూ ముందుకు వెళుతున్నారు.
విత్తనాలు, ఎరువులు సిద్ధంగా ఉన్నాయి
జిల్లాలో ఎరువులు, విత్తనాలకు ఎలాంటి కొరత లేదు. అన్ని సిద్ధంగా ఉన్నాయి. ఈ ఏడాది జిల్లాలో 14వేల క్వింటాళ్ల వరి, 1540 క్వింటాళ్ల మిరప, 12.84 లక్షల పత్తి విత్తనాల ప్యాకెట్లు, రైతులకు అందుబాటులో ఉంచాం. ఎరువులు సిద్ధంగా ఉన్నాయి. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు అవగాహన కలి్పస్తూ నాణ్యమైన ఉత్పత్తులను అందిస్తున్నాం.
– విజయభారతి, వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు
Comments
Please login to add a commentAdd a comment