49 లక్షల ఎకరాల్లో పంటల సాగు
- ఖరీఫ్‌లో ఇప్పటివరకు 45 శాతం విస్తీర్ణంలో పంటలు
-17.84 లక్షల ఎకరాల్లో ఆహారధాన్యాల సాగు
సాక్షి, హైదరాబాద్ : వర్షాలు సకాలంలో కురియడంతో పంటల సాగు ఊపందుకుంది. చేను, చెలకలు పచ్చదనంతో కళకళలాడుతున్నాయి. ఖరీఫ్‌లో సాధారణ పంటలసాగు 1.08 కోట్ల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 48.92 లక్షల ఎకరాల్లో(45%) పంటలు సాగయ్యాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ తన నివేదికలో వెల్లడించింది. అందులో ఆహారధాన్యాల సాధారణ సాగు 48.70 లక్షల ఎకరాలుకాగా, ఇప్పటివరకు 17.84 లక్షల (42%) ఎకరాల్లో ఆహార పంటలు వేశారు. పప్పుధాన్యాల సాధారణ సాగు విస్తీర్ణం 10.10 లక్షల ఎకరాలకుగాను 8.58 లక్షల (97%) ఎకరాల్లో వేశారు.
24.65 లక్షల ఎకరాల్లో వరి నాట్లు వేయాల్సి ఉండగా, ఇప్పటివరకు 1.75 లక్షల (7%) ఎకరాల్లో మాత్రమే నాట్లు వేశారు. పత్తి సాగు విస్తీర్ణాన్ని తగ్గించాలని ప్రభుత్వం ఎంత ప్రచారం చేసినా రైతులు పట్టించుకోకుండా 20.82 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. ప్రత్యామ్నాయంగా సోయాను పండించాలని చెబితే కేవలం 5.95 లక్షల ఎకరాల్లోనే వేశారు. రాష్ట్రంలో అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలో రైతులు 61 శాతం, ఆ తర్వాత ఆదిలాబాద్ జిల్లాలో 60 శాతం విస్తీర్ణంలో పంటలు వేశారు. నల్లగొండ జిల్లాలో మాత్రమే అత్యంత తక్కువగా 28 శాతం విస్తీర్ణంలో పంటలు సాగయ్యాయి.
34 శాతం అధిక వర్షపాతం
జూన్ 1 నుంచి బుధవారం వరకు రాష్ట్రంలో 34 శాతం అధిక వర్షపాతం నమోదైంది. సాధారణంగా ఖరీఫ్ సీజన్‌లో 713 మిల్లీమీటర్ల(ఎం.ఎం.) వర్షపాతం నమోదు కావాలి. ఇప్పటివరకు 163.7 ఎం.ఎం.లు కురవాల్సి ఉండగా... ఏకంగా 220.1 ఎం.ఎం.లు కురిసింది. నిజామాబాద్, వరంగల్, ఆదిలాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో అధిక వర్షపాతం రికార్డు అయింది. మెదక్, కరీంనగర్, హైదరాబాద్ జిల్లాల్లో మాత్రం సాధారణ వర్షపాతం నమోదైంది. ఉత్తర తెలంగాణలో 21 శాతం అధిక వర్షపాతం నమోదైతే... దక్షిణ తెలంగాణలో మాత్రం 52 శాతం అధికంగా రికార్డు కావడం విశేషం. అందులో అత్యధికంగా ఖమ్మం జిల్లాలో 121 శాతం అధిక వర్షపాతం నమోదైంది.
వచ్చే నాలుగు రోజులపాటు సాధారణ వర్షాలు
వచ్చే నాలుగు రోజులపాటు రాష్ట్రంలో అక్కడక్కడా ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గత 24 గంటల్లో కామారెడ్డి, బాన్సువాడ, మెదక్‌లల్లో 5 సెంటీమీటర్ల వర్షం కురిసింది. రాష్ట్రవ్యాప్తంగా అనేకచోట్ల ఓ మోస్తరు వర్షాలు కురిశాయి.