యార్డులో పెద్ద ఎత్తున మిర్చి టిక్కీలు
సాక్షి, అమరావతి బ్యూరో: ఆసియాలోనే అతిపెద్ద మార్కెట్‌గా పేరున్న గుంటూరు మిర్చి యార్డుకు భారీ ఎత్తున కొత్త సరుకు వస్తోంది. దీనికి తగ్గట్టుగా మిర్చి ధరలు ఆశాజనకంగా ఉండటంతో రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది మిర్చికి అధిక ధర పలుకుతోంది. ముఖ్యంగా బాడిగ, తేజ రకం మిర్చికి మంచి రేటు లభిస్తోంది. ఇతర రకాలకూ చెప్పుకోదగిన ధర పలుకుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని వివిధ జిల్లాలనుంచేగాక కర్ణాటక నుంచీ రైతులు పెద్దఎత్తున మిర్చిని యార్డుకు తీసుకొస్తున్నారు. కర్ణాటకలోని బళ్లారితోపాటు కర్నూలు, వైఎస్సార్, అనంతపురం జిల్లాల నుంచి గుంటూరు మిర్చి యార్డుకు భారీగా కొత్త సరుకు వస్తోంది. గుంటూరు, ప్రకాశం జిల్లాల నుంచీ రైతులు యార్డుకు మిర్చిని తీసుకొస్తున్నారు.
రోజుకు సరాసరిన 1.20 లక్షల నుంచి 1.25 లక్షల టిక్కీల మిర్చి యార్డుకు వస్తోంది. 2020–21లో ఇప్పటికే యార్డుకు 43,27,820 బస్తాల సరుకు వచ్చింది. ఈ మార్కెట్ యార్డులో ఏడాదికి రూ.6 వేల కోట్లకుపైగా టర్నోవర్ ఉంటుంది. సెస్సు ద్వారా రూ.60 కోట్లకుపైగా ఆదాయం లభిస్తోంది. రాష్ట్రంలో ఈ ఏడాది మిర్చి దిగుబడులు బాగా ఉన్నాయి. కర్నూలు జిల్లాలో ఎకరాకు 35 క్వింటాళ్లకుపైగా దిగుబడి వస్తున్నట్లు రైతులు తెలిపారు. అలాగే మిర్చిని ప్రధానంగా సాగు చేసే గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోనూ దిగుబడులు ఆశాజనకంగా ఉన్నాయి.
బాడిగ, తేజ రకాలకు మంచి ధరలు..
మిర్చిలో నాణ్యమైన బాడిగ, తేజ రకాలకు ప్రస్తుతం మంచి ధరలు లభిస్తున్నాయి. 2019 డిసెంబర్, 2020 జనవరిలో ఉన్న ధరల కన్నా ప్రస్తుతం క్వింటాకు రూ.2 వేల ధర అదనంగా లభిస్తోంది. బాడిగ రకాలు క్వింటాలు రూ.17 వేల నుంచి 21 వేలు, తేజ రకం రూ.15,500, మిగిలిన అన్నిరకాలు రూ.13 వేలకు పైగా ధర పలుకుతున్నాయి. గతేడాది కరోనా వల్ల యార్డు మూతపడటంతో అమ్ముకునే వీల్లేక ఎక్కువమంది రైతులు సరుకును కోల్డ్ స్టోరేజీల్లో ఉంచారు. ప్రస్తుతం మార్కెట్‌లో ధరలు ఆశాజనకంగా ఉండటంతో యార్డులో క్రయవిక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ఇదిలా ఉంటే.. గత డిసెంబర్ 22న మార్కెట్ యార్డులో డబ్బి బాడిగ మిర్చి క్వింటా రూ.36 వేల వరకు పలకడం విశేషం.
ధరలు ఆశాజనకం
నేను ఐదెకరాల్లో మిర్చి సాగు చేశాను. దిగుబడి 25 క్వింటాళ్లకుపైగా వస్తుందని భావిస్తున్నాను. గతేడాది క్వింటా రూ.11 వేలే. ప్రస్తుతం యార్డుకు 100 బస్తాలు తీసుకొచ్చా. క్వింటా రూ13,500 చొప్పున విక్రయించా.
–జయశంకరరావు, గుంటూరు జిల్లా
సరుకు బాగా వస్తోంది
యార్డుకు సరుకు భారీగా వస్తోంది. రోజుకు 1.20 లక్షల నుంచి 1.25 లక్షల టిక్కీల సరుకు యార్డుకొస్తోంది. గతేడాది ఇదే సమయంతో పోల్చితే ధరలు అధికంగానే ఉన్నాయి. డబ్బి బాడిగ రకం ధర క్వింటా రూ.20 వేలకుపైగా పలుకుతోంది. బాడిగ రకాలతోపాటు అన్ని రకాల మిర్చి ధరలు కూడా బాగానే ఉన్నాయి.
– వెంకటేశ్వరరెడ్డి, గుంటూరు మార్కెట్ యార్డు ఉన్నతశ్రేణి సెక్రటరీ
చదవండి:
శభాష్ ఏపీ.. ప్రతికూలతలోనూ ‘సుస్థిర’పరుగు
బాబు ఊకదంపుడు.. జారుకున్న జనం!
Comments
Please login to add a commentAdd a comment