సాక్షి, కృష్ణా: విజయవాడలో సుమారు మూడు గంటలపాటు ఏకధాటిగా భారీ వర్షం కురిసింది. కృష్ణా జిల్లాతో పాటు ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి మోస్తరు వాన పడింది. విజయవాడ నగరంలో కురిసిన భారీ వర్షానికి నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం, నందిగామ, తిరువూరు, జగ్గయ్యపేట, పెనమలూరు తదితర ప్రాంతాలలో భారీ నుంచి మోస్తరు వర్షం కురిసింది. రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
గత కొద్ది రోజులగా పెరిగిన ఉష్ణోగ్రతలతో నాట్లు ఎండిపోయే సమయంలో వర్షాలు పడుతుండటం రైతాంగం ఆనందం వ్యక్తం చేస్తోంది. ఇక విజయవాడ నగరంలో కురిసిన భారీ వర్షంతో ప్రధాన రోడ్లు సైతం జలమయమయ్యాయి. రోడ్లపై రెండు అడుగుల పైన ప్రవహిస్తున్న వరద నీటిలోనే వాహనదారులు ప్రయాణిస్తూ ఇబ్బందులు పడ్డారు. నగరంలోని పలుప్రధాన రహదారులు చెరువులని తలపించాయి.
ఎంజీ రోడ్, ఏలూరు రోడ్, లబ్బీ పేట, మొగల్రాజపురం, రెవెన్యూ కాలనీ, కృష్ణలంక, రాణిగారితోట, సింగ్ నగర్, తదితర ప్రాంతాలలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇక రెవెన్యూ కాలనీలోని రోడ్లు ఈ భారీవర్షానికి పూర్తిగా మునిగిపోయాయి. కొన్ని అపార్ట్ మెంట్లలోని సెల్లార్‌లోకి వర్షపు నీరు చేరిపోయి వాహనాలు సైతం మునిగిపోయాయి.
Comments
Please login to add a commentAdd a comment