అంగన్‌వాడీ ఆయా కళావతి (ఫైల్) వైద్యులతో మాట్లాడుతున్న మంత్రి హరీశ్‌రావు ( ఫైల్)
గజ్వేల్: తన జీవితంలో వెలుగొస్తుందని ఎదురు చూసిన ఆమె ఆశ.. ఆడియాసగానే మిగిలింది. చివరకు మృత్యువుతో పోరాడి ఓడిపోయింది. ఆపరేషన్‌లో కాళ్లు, చేతులు కోల్పోయి జీవచ్ఛవంలా మారిన తర్వాత కూడా ఇన్ఫెక్షన్ పెరగడంతో తుదిశ్వాస విడిచింది. దౌల్తాబాద్ మండలం దొమ్మాటకు చెందిన అంగన్‌వాడీ ఆయా కళావతి విషాధాంతమిది.
దౌల్తాబాద్ మండలం దొమ్మాటకు చెందిన అంగన్‌వాడీ ఆయా కరికె కళావతి జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సంబరాల్లో అపశృతి చోటు చేసుకొని విద్యుత్‌షాక్‌తో తీవ్రగాయాల పాలైన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో మరో వ్యక్తి ప్రాణాలను కోల్పోయాడు. ఆందోళనకరమైన పరిస్థితిలో ఉన్న కళావతిని హైదరాబాద్‌లోని పలు ప్రైవేటు ఆసుపత్రులకు తరలించగా.. సరైన వైద్యం అందించలేమని చేతులెత్తేయడంతో తిరిగి గజ్వేల్‌కు తీసుకొచ్చారు. 20 రోజులుగా ఆమె గజ్వేల్‌లోని జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. కళావతి దయనీయ పరిస్థితిని తెలుసుకున్న మంత్రి హరీశ్‌రావు ఈనెల 7న స్వయంగా ఆసుపత్రిని సందర్శించి కళావతి పరిస్థితిని పరిశీలించి చలించిపోయారు.
తక్షణ సాయం కింద రూ. 50 వేలు అందించడమే గాకుండా ఆమెను కాపాడడానికి అవసరమైన శస్త్ర చికిత్సలు చేయాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ మహేష్‌ను ఆదేశించారు. ఈ క్రమంలోనే కళావతి విద్యుత్‌షాక్‌కు గురైన చేతులు, కాళ్లలో రక్త ప్రసరణ అగిపోవడమే గాకుండా ఇన్‌ఫెక్షన్ పెరిగిపోయింది. దీని వల్ల ప్రాణానికే ప్రమాదమని గుర్తించిన వైద్యులు ఈనెల 10న శస్త్ర చికిత్స చేశారు. ఈ సందర్భంగా మోకాళ్ల కింది వరకు రెండు కాళ్లను, మోచేతి కిందికి ఎడమ చేయిని, మోచితిపైకి కుడి చేయిని తొలగించారు. అయినా తన జీవితంలో వెలుగొస్తుందనే ఆశతో ఆమె ఎదురు చూస్తూ వచ్చింది. ఆపరేషన్ తర్వాత కూడా ఇన్ఫెక్షన్ తగ్గకపోవడంతో బుధవారం మధ్యాహ్నం 2:15 గంటల ప్రాంతంలో కళావతి తుదిశ్వాస విడిచింది. ఈ విషయాన్ని గజ్వేల్ ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ మహేష్ తెలిపారు. కాగా కళావతి విషాధ సమాచారం తెలుసుకున్న రాష్ట్ర ఆర్థికమంత్రి హరీశ్‌రావు దిగ్భ్రాంతికి గురయ్యారు. మృతురాలు కుటుంబీకులకు సానుభూతిని ప్రకటించారు. ఇదిలా ఉంటే జిల్లా మహిళా శిశు సంక్షేమశాఖ అధికారి రాంగోపాల్‌రెడ్డి అక్కడికి చేరుకొని మృతురాలి కుటుంబీకులను పరామర్శించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తరపున రూ. 50 వేల సాయాన్ని అందజేశారు.
కళావతి కుటుంబాన్ని ఆదుకుంటాం..
సిద్దిపేటజోన్: రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రమాదవశాత్తు విద్యుత్‌షాక్‌కు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కళావతి బుధవారం మృతి చెందడం పట్ల రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె మృతి పట్ల ప్రగాడ సంతాపాన్ని తెలియచేస్తు కళావతి కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా అదుకుంటామని భరోసా ఇచ్చారు. గత 20 రోజులుగా ఇటిన్సీవ్ కేర్ యూనిట్‌లో శాస్ర చికిత్సలు నిర్వహించి మెరుగైన వైద్యం అందిస్తున్నప్పటికీ కళావతి మృతి చెందడం కలచివేసిందన్నారు. ఆమె కుటుంబానికి ఇన్స్‌రెన్స్ బీమాను అందించడంతో పాటు అండగా ఉంటామని సృష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment