సిద్దిపేట అర్బన్: నిర్మాణంలో ఉన్న రెండు అంతస్తుల భవనంపైనున్న పిట్టగోడ కూలి పక్కనే ఉన్న అంగవాడీ కేంద్రంపై పడింది. దీంతో అంగన్‌వాడీ కేంద్ర నిర్వహిస్తున్న పెంకుటిళ్లు పైకప్పు కూలగా, ముగ్గురు చిన్నారులకు స్వల్ప గాయాలయ్యాయి. ఆ సమయంలో చిన్నారులనంతా పక్కగదిలో ఉండడంతో పెనుప్రమాదం తప్పింది. ఈ సంఘటన సిద్దిపేట పట్టణంలోని భారత్‌నగర్ రెండో అంగన్‌వాడీ సెంటర్‌లో గురువారం చోటుచేసుకుంది.
ఎలా జరిగిందంటే..
పట్టణంలోని భారత్‌నగర్ రెండో అంగన్‌వాడీ కేంద్రాన్ని రూ.2 వేల అద్దె చెల్లిస్తూ ఓ పెంకుటింట్లో నిర్వహిస్తున్నారు. ఈ సెంటర్‌లో అంగన్‌వాడీ వర్కర్‌గా భవాని, ఆయాగా అంజమ్మలు పనిచేస్తున్నారు. కేంద్రలో మొత్తం 19 మంది చిన్నారులు ఉండగా, గురువారం 9 మంది చిన్నారులు హాజరయ్యారు. అంగన్‌వాడీ వర్కర్‌గా పనిచేస్తున్న భవాని ఐసీడీఎస్ కార్యాలయంలో సమావేశం ఉందని వెళ్లిపోగా, మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో ఆయా అంజమ్మ చిన్నారులను కేంద్రంలోని మరో గదిలోకి తీసుకెళ్లి భోజనం తినిపిస్తోంది.
ఈ సమయంలోనే అంగన్‌వాడీ కేంద్రం ప్రక్కన నిర్మిస్తున్న నాయకం మల్లేశంకు చెందిన రెండు అంతస్తుల భవనం పిట్టగోడ కూలి అంగన్‌వాడీ కేంద్రంపై పడింది. దీంతో పెంకుటిళ్లు కూలిపోగా, సమీపంలో ఉన్న ముగ్గురు చిన్నారులు స్వల్పంగా గాయపడ్డారు. ఒక్క సారిగా జరిగిన ఈ హఠాత్పరిణామంతో స్థానికులు, అంగన్‌వాడీ కేంద్రం ఆయా ఆందోళనకు గురయ్యారు. వెంటనే గదిలోనుంచి చిన్నారులను బయటకు తెచ్చారు. క్షణాల్లో పట్టణ వాసులు అక్కడికి చేరుకున్నారు. వెంటనే ఐసీడీఎస్ సీడీపీఓ అరుణకు సమాచారమిచ్చారు. ఆమె వెంటనే సీనియర్ అసిస్టెంట్ బాల్‌కిషన్‌ను సంఘటనా స్థలానికి పంపించి. వివరాలు సేకరించారు.
భవన యజమానిపై ఆగ్రహం
విషయం తెలుసుకున్న స్థానికులు, చిన్నారుల తల్లిదండ్రులు అంగన్‌వాడీ కేంద్రం వద్దకు తరలివచ్చారు. అంగన్‌వాడీ కేంద్రం పక్కనే భవనం నిర్మిస్తున్న మల్లేశంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. భవన నిర్మాణాలు మరీ అజాగ్రతగా చేయించడమేమిటని మండిపడ్డారు. అంగన్‌వాడీ కేంద్రాన్ని తక్షణమే ఇక్కడి నుంచి మార్చాలని, యజమానిపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఐసీడీఎస్ సీనియర్ అసిస్టెంట్ బాల్‌కిషన్‌ను డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా విషయం తెలుసుకున్న సిద్దిపేట ఆర్డీఓ ముత్యంరెడ్డి ఆర్‌ఐ సాజిత్‌ను విచారణ కోసం సంఘటనా స్థలానికి పంపి వివరాలను తెప్పించుకున్నారు.
దీంతో భవనం యజమాని మల్లేశం కూలిన పెంకుటిళ్లుకు మరమ్మతులు చేయిస్తానని, ప్రమాదంలో గాయపడ్డ పిల్లలకు వైద్యం చేయిస్తానని చెప్పడంతో ఐసీడీఎస్ సిబ్బంది ఆయనపై ఫిర్యాదు చేయలేదు. అంగన్‌వాడీ కేంద్రాన్ని అక్కడినుంచి మరోచోటుకి తరలిస్తామని సీనియర్ అసిస్టెంట్ బాల్‌కిషన్ చిన్నారుల తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు.
అంగన్‌వాడీ సెంటర్‌పై కూలిన పిట్టగోడ
Published Thu, Nov 27 2014 11:41 PM | Last Updated on Sat, Jun 2 2018 8:29 PM
Advertisement
Advertisement