సిద్దిపేట అర్బన్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్‌లో అంగన్‌వాడీల సంక్షేమం కోసం, వారి వేతనాల పెంపు కోసం ఎలాంటి నిధులను కేటాయించకుండా వారిని విస్మరించిందని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్. వీరయ్య ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ప్రథమ మహాసభలను శనివారం సిద్దిపేట పట్టణంలోని శివమ్స్ గార్డెన్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా సిద్దిపేట పట్టణం ఎర్ర జెండాలతో ఎరుపెక్కింది.
సభకు ముందు అంగన్‌వాడీలో పట్టణంలో భారీ ర్యాలీని నిర్వహించారు. అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లు మహాసభలకు ప్రవాహంలా తరలివచ్చారు. శివమ్స్ గార్డెన్‌లో ఏర్పాటు చేసిన సభ ప్రాంగణంలో జెండాను ఆవిష్కరించి సభను ప్రారంభించారు. ఈ సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్. వీరయ్య మాట్లాడుతూ, నవ తెలంగాణ నిర్మాణంలో కీలకమైన అంగన్‌వాడీల సంక్షేమాన్ని ప్రభుత్వం విస్మరించడం దారుణమన్నారు.
కార్మికుల సమస్యలపై చర్చించేందుకు కూడా సీఎం సిద్ధంగా లేరని మండిపడ్డారు. కార్పొరేట్ సంస్థల యాజ మాన్యాలకు లాభం చేకూర్చేందుకు సమయం కేటాయిస్తున్న సీఎం, ప్రజలకు విశేష సేవలందిస్తున్న అంగన్‌వాడీల సమస్యలను పరిష్కరించేందుకు ముందుకు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వందలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే పట్టించుకోకుండా, ఆత్మహత్యలపై అనుమానాలు వ్యక్తం చేయడం దారుణమన్నారు.
అంగన్‌వాడీ వర్కర్స్‌ను ప్రభుత్వ ఉద్యోగులుగా తక్షణమే గు ర్తించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని ధ్వజమెత్తారు. చరి త్ర పుస్తకాలను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం విరమించుకోవాలన్నారు. కార్మిక సంక్షేమాలకు, హక్కుల కోసం పోరాడి సాధించుకున్న చట్టాలను కార్పొరేట్ వ్యక్తుల కోసం రద్దు చేయాలని నేతలు ప్రయత్నిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
విదేశీ పెట్టుబడి దారుల కోసం దేశంలో ఉత్పత్తి చేసుకోమని ప్రకటించి, ఎక్కడైనా అమ్ముకోండని పిలుపునివ్వడం దారుణమన్నారు. ప్రణాళిక సంఘాన్ని రద్దు చేయడం వల్ల సంక్షేమ పథకాలకు తూట్లు పొడవడం జరుగుతుందన్నారు.
మరో ఉద్యమానికి సిద్ధంగా కావాలి.
ఉద్యమాల గడ్డగా నిలిచిన సిద్దిపేట ప్రాంతంలో అంగన్‌వాడీ సిబ్బంది మరో ఉద్యమానికి సిద్ధం కావాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పిలుపునిచ్చారు. దేశంలో అనేక సంస్థలు ప్రతి కుటుంబానికి జీవించేందుకు కనీస వేతనం రూ. 15 వేలు ఉండాలని తెలియజేస్తున్నాయన్నారు. పాలకు లు మాత్రం అంగన్‌వాడీ సిబ్బందికి గౌరవ వేతనం ఇవ్వడం సరికాదన్నారు. ఇప్పటికైన వారికి కనీస వేతనం అమలు చేయాలని డి మాండ్ చేశారు. గౌరవ వేతనం, పారితోషికాల పేరుతో కార్మికులు, సిబ్బందితో ప్రభుత్వం వెట్టి చాకిరి చేయించుకుంటుందన్నారు.
వాగ్ధానాలను అమలు చేయాలి
సార్వత్రిక ఎన్నికల సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్‌వాడీ సిబ్బందికి ఇచ్చిన వాగ్ధానాలను వెంటనే అమలు చేయాలని యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జయలక్ష్మి డిమాండ్ చేశారు. సిబ్బంది వేతనాల పెంపు కోసం ఈ నెల 18న నిర్వహించే చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షురాలు నల్ల భారతి అధ్యక్షతన జరిగిన ఈ మహాసభల్లో సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయిబాబా, యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు ఎ. మల్లేషం, శ్రామిక మహిళ రాష్ట్ర కన్వీనర్ ఎస్. రమ, అంగన్‌వాడీ యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పద్మ, నర్సమ్మ, డివిజన్ కార్యదర్శి రేవంత్‌కుమార్, నాయకులు జగన్, పుష్పలత, అనురాధ, రాజ్యలక్ష్మి, లక్ష్మి, అంజమ్మ, హేమలత, ఆనంద్, రాజు, బాల్‌రాజు, నాగరాజు, రమేష్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
అంగన్‌వాడీల సంక్షేమం పట్టదా?
Published Sun, Nov 9 2014 12:17 AM | Last Updated on Sat, Jun 2 2018 8:32 PM
Advertisement
Advertisement