విద్యార్థికి మిఠాయి తినిపిస్తున్న హరీశ్‌రావు
సాక్షి, సిద్దిపేట: ‘పధ్నాలుగు ఏళ్లుగా నూతన సంవత్సర వేడుకలను మీ మధ్య జరుపుకోవడం సంతోషంగా ఉంది. అది నా అదృష్టం’అని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట నియోజకవర్గమంతా తన కుటుంబమని, ఏ వేడుకైనా ప్రజల మధ్య జరుపుకోవడమే తనకు ఆనందమని ఆయన పేర్కొన్నారు. తనకు ఇటువంటి అవకాశాన్ని కల్పిస్తున్న నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతగా వారి రుణం తీర్చుకుంటానని అన్నారు. సోమవారం రాత్రి పదిన్నర గంటల సమయంలో ఆయన సిద్దిపేట పట్టణంలోని సాంఘిక సంక్షేమ, ఎస్సీ, ఎస్టీ కళాశాల విద్యార్థులతో కలసి న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి విద్యార్థులకు తినిపించారు. అనంతరం ఉద్వేగంగా మాట్లాడుతూ ఇటువంటి సందర్భాలను గర్వంగా భావిస్తానని అన్నారు.
నియోజకవర్గ ప్రజల అవసరాలు తీర్చేందుకు తాను ఏ సమయంలోనైనా, ఎప్పుడైనా సిద్ధంగా ఉంటానన్నారు. తనకు శాసనసభ్యునిగా వచ్చే వేతనం రూ.2 లక్షలు మీకే ఇచ్చేస్తానని, ఆ సొమ్ముతో మంచి లైబ్రరీ ఏర్పాటు చేసుకుని, దానిని సద్వినియోగం చేసుకోవాలని, తద్వారా జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోవాలని విద్యార్థులకు సూచించారు. మీరంతా ఉన్నత స్థాయికి ఎదిగితేనే మీ తల్లిదండ్రులతో పాటు తానూ సంతోష పడతానని, అదే మీరు నాకు ఇచ్చే గురుదక్షిణగా భావిస్తానని విద్యార్థులనుద్దేశించి హరీశ్ అన్నారు. విద్యార్థులు చిన్ననాడే ఒక లక్ష్యాన్ని పెట్టుకోవాలని, తెలంగాణ బిడ్డలంటే గర్వపడే స్థాయికి చేరుకోవాలని ఉద్బోధించారు. కొత్త సంవత్సరంలో అందరి జీవితాల్లో వెలుగులు నిండాలని ఆయన ఆకాంక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment