సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) కొనసాగిస్తున్న అభివృద్ధి ప్రాజెక్టులపై తాజా బడ్జెట్ ప్రభావం స్పష్టంగా కనిపించనుంది. ఓఆర్‌ఆర్ జైకా రుణం, ఓఆర్‌ఆర్ బీఓటీ అన్యూటీ పేమెంట్‌ల కింద గతంలో పెండింగ్‌లో ఉన్న వాటితో కలుపుకొని రూ.1687 కోట్లు కేటాయించాలని హెచ్‌ఎండీఏ ప్రతిపాదనలిస్తే కేవలం రూ.20 లక్షలు మాత్రమే కేటాయించింది. గతేడాది మాదిరిగానే ఈసారి కూడా రాష్ట్ర ప్రభుత్వం నిరాశపరచడంతో హెచ్‌ఎండీఏ అధికారులకు ఏమీ చేయాలో పాలుపోవడం లేదు. 2020–21 సంవత్సరంలో ఓఆర్‌ఆర్ జైకా రుణం కింద కాంట్రాక్టర్లకు రూ.20 కోట్లు, బీఓటీ అన్యూటీ పేమెంట్‌ల కింద రూ.331.38 కోట్లు చెల్లించాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కేవలం రూ.20 లక్షలు మాత్రమే కేటాయించడంతో ఈ ఏడాదికి మొత్తం చెల్లించాల్సిన రూ.351.38 కోట్లలో రూ.351.18 కోట్లు హెచ్‌ఎండీ సొంత నిధులను సమకూర్చుకోవాల్సి ఉంది. హెచ్‌ఎండీఏకు ఆదాయం సమకూరే ఓఆర్‌ఆర్ టోల్ ఫీజు ఆదాయంతో పాటు ఎల్‌ఆర్‌ఎస్ నిధులు, బిల్డింగ్, లేఅవుట్ పర్మిషన్ల రూపంలో వచ్చే రెవెన్యూతో సరిపెట్టుకోవాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అంతర్గత ఆదేశాలివ్వడంతో కాస్త ఊరటనిచ్చే అంశం. ఇప్పటికే హెచ్‌ఎండీఏకు ఎల్‌ఆర్‌ఎస్ రూపంలో సమకూరిన రూ.1100 కోట్లలో రూ.800 కోట్లతో వివిధ అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టారు. వీటిలో చాలావరకు సగంలోనే ఉండటంతో మరిన్ని నిధుల అవసరముంది.
అభివృద్ధి ప్రాజెక్టులకు కష్టకాలమేనా..?
అంతర్జాతీయ స్థాయి హంగులతో నగరంపై పడుతున్న ట్రాఫిక్‌ను తగ్గించే క్రమంలో నిర్మించాలనుకున్నా మియాపూర్‌లోని ఇంటర్‌సిటీ బస్ టెర్మినల్ (ఐసీబీటీ) ఇప్పటికీ మొదలుకాలేదు. పెద్దఅంబర్‌పేటలో ఐసీబీటీ, శంషాబాద్‌లో మల్టీ మోడల్ ట్రాన్స్‌పోర్టు, . శంషాబాద్, మనోహరబాద్, పటాన్‌చెరు, శామీర్‌పేటలోనూ లాజిస్టిక్ హబ్‌లను ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో చేపట్టిన రూ.200 కోట్ల వరకు వ్యయం అవుతుందని అధికారులు అంచనా వేశారు. ఇవి కూడా పట్టాలెక్కడం కష్టంగానే కనిపిస్తోంది.
మినీ పట్టణాలకు సైతం..
2008లో మాస్టర్ ప్లాన్ గ్రోత్ కారిడార్ ప్రకారం దాదాపు 158 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఓఆర్‌ఆర్ చుట్టూ ఇరువైపులా దాదాపు 764 కిలోమీటర్ల మేర వందలాది గ్రిడ్ రోడ్లను అభివృద్ధి చేయాలని హెచ్‌ఎండీఏ అధికారులు నిర్ణయించారు. ఇందుకోసం దాదాపు లక్ష ఎకరాలు అవసరముంటుంది. చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూములు, అటవీ భూములు ఇలా దాదాపు 30 వేల ఎకరాలు పోనుంది. దాదాపు పది వేల ఎకరాలు ప్లాటింగ్ చేసిన భూములున్నాయి. వీటిని కూడా ఏం చేసేందుకు వీలులేదు. మిగిలుతున్నది 60 వేల ఎకరాలే. ఈ లెక్కన చూసుకున్నా 60వేల ఎకరాల్లో గ్రిడ్ రోడ్లు అభివృద్ధి చేస్తే నగర శివారు ప్రాంతాలు మినీ పట్టణాలుగా ప్రగతివైపు అడుగులు పడటం ఖాయం. కానీ భూసేకరణ కష్టమని, వేల కోట్ల ఖర్చవుతుందని ఆ వైపే ఎవరూ చూడటం లేదు. తాజా బడ్జెట్ పరిస్థితి చూశాక హెచ్‌ఎండీఏపైనే భారం పడటంతో మినీ పట్టణాల పరిస్థితి కష్టమే కావచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment