
రైతుల్లో ఆత్మవిశ్వాసం నింపాలి: హరీష్‌రావు
హైదరాబాద్, న్యూస్‌లైన్: రేపటి తెలంగాణ రాష్ట్రంలో అధికార, ప్రతిపక్ష రాజకీయ పార్టీలన్నీ కలిసి రైతు కుటుంబాల్లో ఆత్మ విశ్వాసం నింపేందుకు కృషి చేయాలని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే టి.హరీష్‌రావు కోరారు. ప్రపంచ మహిళా దినోత్సవం మార్చి 8 పురస్కరించుకొని ఇందిరాపార్కు ధర్నా చౌక్‌లో గురువారం కేరింగ్ సిటిజన్స్ కలెక్టివ్, రైతు ఆత్మహత్య బాధిత కుటుంబాల పోరాట వేదిక, రైతుస్వరాజ్య వేదిక తదితర 13 సంఘాల ఆధ్వర్యంలో రైతుల ఆత్మహత్య బాధిత కుటుంబాల మహిళల, పిల్లల హక్కుల ధర్నా కార్యక్రమం గురువారం జరిగింది.
టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత ఎడ్మ కిష్టారెడ్డి, ప్రొఫెసర్ కేఆర్ చౌదరి, ప్రొఫెసర్ రమా మేల్కోటే, సీపీఎం రైతు సంఘం అధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి, సీపీఐ రైతు సంఘం అధ్యక్షురాలు పశ్య పద్మ, ప్రముఖ సంపాదకులు కె. రామచంద్రమూర్తి, ప్రముఖ విద్యావేత్త చుక్కారామయ్య, మానవహక్కుల వేదిక కన్వీనర్ జీవన్‌కుమార్, వ్యవసాయ శాస్త్రవేత్త రామాంజనేయులు హాజరై రైతు ఆత్మహత్య కుటుంబాలకు సంఘీభావం ప్రకటించారు.
హరీష్‌రావు మాట్లాడుతూ.. ప్రభుత్వాలు బాధ్యతలను విస్మరించి, వ్యవసాయాన్ని పట్టించుకోకపోవడం వల్లే రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. పరిశ్రమలు దివాళా తీస్తే ఆదుకునే ప్రభుత్వాలు రైతులను ఎందుకు ఆదుకోవడం లేదని ప్రశ్నించారు. ఎడ్మ కిష్టారెడ్డి మాట్లాడుతూ 1995 నుంచి ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియో అందించాలని డిమాండ్ చేశారు. రైతు ఆత్మహత్య కుటుంబంలోని మహిళలకు ఫించన్ రూ. 200 నుంచి రూ. 2 వేలకు, ఎక్స్‌గ్రేషియాను రూ. లక్ష నుంచి రూ 5 లక్షలకు పెంచాలన్నారు. రైతు ఆత్మహత్యల నివారణకు రాజకీయ పార్టీల విధాన ప్రణాళికను ప్రకటించాలని డిమాండ్ చేశారు. కేఆర్ చౌదరి మాట్లాడుతూ ఈ కుటుంబాలకు బ్యాంకు, సహకార సొసైటీ రుణాలను మాఫీ చేయాలనీ, అంత్యోదయ పథకం వర్తింప చేయాలని, వీరి ఆరోగ్యం, పిల్లల చదువులను ప్రభుత్వమే భరించాలని, ప్రభుత్వం భూమి పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.