100% టీకాలే లక్ష్యం: మంత్రి హరీశ్‌ రావు | T Harish Rao Set A Target Of 100 Per Cent Corona Vaccination In Telangana | Sakshi
Sakshi News home page

100% టీకాలే లక్ష్యం: మంత్రి హరీశ్‌ రావు

Published Sun, Nov 14 2021 4:15 AM | Last Updated on Sun, Nov 14 2021 4:19 AM

T Harish Rao Set A Target Of 100 Per Cent Corona Vaccination In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్‌ నూరు శాతం జరిగేలా లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి టి.హరీశ్‌రావు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. గ్రామా లు, మండలాలవారీగా లక్ష్యాలను ఖరారు చేసి ఈ ప్రక్రియను వేగవంతం చేయాలన్నా రు. ఆర్థికమంత్రి హరీశ్‌ తాజాగా వైద్య, ఆరోగ్య శాఖ అదనపు బాధ్యతలను చేపట్టిన నేపథ్యంలో శనివారం బీఆర్‌కేఆర్‌ భవన్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. వాక్సినేషన్‌తోపాటు కొత్త వైద్య కళాశాలల నిర్మాణం, ఆరోగ్యశ్రీ కింద అందుతున్న సేవల తీరుతెన్నులను అడిగి తెలుసుకొని జిల్లా కలెక్టర్లు, డీఎంహెచ్‌వోలు, డీసీహెచ్‌లకు పలు ఆదేశాలిచ్చారు. 

ఇతర శాఖల సహకారం తీసుకోండి... 
వాక్సినేషన్‌ ప్రక్రియను విజయవంతం చేసేందుకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖతోపాటు ఇతర శాఖల సహకారాన్ని తీసుకోవాలని హరీశ్‌ ఉన్నతాధికారులకు సూచించారు. ప్రతి వారం వ్యాక్సినేషన్‌లో సాధించిన లక్ష్యాలను సమీక్షించాలని కలెక్టర్లకు స్పష్టం చేశారు. రాష్టంలో 18 ఏళ్లు దాటిన వారు 2.77 కోట్ల మంది ఉండగా 2.35 కోట్ల మందికి మొదటి, 1.08 కోట్లమందికి రెండు డోసులు తీసుకున్నట్లు అధికారులు వివరించారు. మరో 18.66 లక్షలమంది రెండో డోస్‌ వేసుకొనేందుకు కేంద్రాలకు రావాల్సి ఉందన్నారు. 

డిసెంబర్‌లోగా కొత్త వైద్య కళాశాలలు
రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసిన 8 వైద్య కళాశాలల భవనాలను డిసెంబర్‌లోగా పూర్తి చేయాలని కలెక్టర్లను హరీశ్‌ ఆదేశిం చారు. కాలేజీలకు అనుబంధంగా ఉన్న ఆసుపత్రుల పడకల సామర్థ్యాలను పెంచాలని, విద్యార్థుల వసతికి అనువైన హాస్టల్‌ భవనాలను గుర్తించాలన్నారు. సీఎం కేసీఆర్‌ చొరవతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలికవసతుల కల్పన, ఆధునిక పరికరాలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. 

ఆసుపత్రుల తనిఖీలు.. 
ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా 946 రకాల వైద్య సేవలు అందిస్తుండగా, కేంద్ర పథకమైన ఆయుష్మాన్‌ భారత్‌ కింద 646 రకాల వైద్య సేవలను చేర్చినట్లు మంత్రి హరీశ్‌ తెలిపారు. వైద్యానికి మరో రూ. 10 వేల కోట్లు ఖర్చు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. తెలంగాణ డయాగ్నోస్టిక్‌ కేంద్రాల సేవలను ప్రజలకు విస్తృతంగా అందించాలన్నారు. ఇకపై పీహెచ్‌సీ మొదలు మెడికల్‌ కాలేజీ వరకు అన్నిం టినీ తనిఖీ చేస్తామని, ఆశా వర్కర్‌ నుంచి హాస్పిటల్‌ సూపరింటెండెంట్‌ వరకు అందరి పనితీరు ఆధారంగా పోస్టింగ్‌లు, ప్రోత్సాహకాలు ఉంటాయన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ, డీపీహెచ్‌ శ్రీనివాసరావు, డీఎంఈ రమేష్‌ రెడ్డి, ఓఎస్‌డీ గంగాధర్‌ పాల్గొన్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement