
మీరేగా నిర్ణయం తీసుకోవాలన్నది?: హరీష్‌రావు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణపై తక్షణమే నిర్ణయం తీసుకోవాలంటూ ప్రధానికి లేఖ రాసిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు తీరా నిర్ణయం తీసుకున్న తర్వాత తొందరపడి తీసుకున్నారని ఎలా అంటారని టీఆర్‌ఎస్ పార్టీ మండిపడింది. ఆ పార్టీ శాసనసభాపక్ష ఉప నాయకుడు టి.హరీష్‌రావు, ఎమ్మెల్యేలు ఏనుగు రవీంద్రరెడ్డి, గంగుల కమలాకర్, పలువురు పార్టీ నేతలు మంగళవారం తెలంగాణభవన్‌లో విలేకరులతో మాట్లాడారు. ‘అసలు తెలంగాణపై నిర్ణయం తీసుకోవడానికి ఐదేళ్ల కిత్రమే ఐదుగురితో కమిటీ వేసింది మీరు కాదా? 2009 ఎన్నికలకు ముందు తెలంగాణకు అనుకూల ప్రకటన చేయలేదా? టీడీపీ ఎన్నికలలో మేనిఫెస్టోలోనూ తెలంగాణ అంశం చేర్చలేదా? కేసీఆర్ అమరణ దీక్షకు దిగినప్పుడు రాష్ట్ర అసెంబ్లీలో తెలంగాణ తీర్మానం మీరు పెడతారా, నన్ను పెట్టమంటారా అని ప్రభుత్వాన్ని అడిగింది మీరు కాదా? ఇన్ని జరిగాక తెలంగాణపై నిర్ణయం జరిగితే దాన్ని ప్రశ్నించడానికి నోరెలా వచ్చింది’ అంటూ చంద్ర బాబు వైఖరిపై నిప్పులు చెరిగారు. చంద్రబాబుది అధికారం కోసం ఏ ఎండకు ఆ గొడుగు పట్టే మనస్తత్వం అని దుయ్యబట్టారు. రాత్రికి రాత్రికి మాట మార్చే, సిద్ధాంతాలు మార్చుకునే వ్యక్తి దేశంలోనే చంద్రబాబుకు మించిన వారుండరని అన్నారు. చంద్రబాబు మాటలు చూశాక టీడీపీ ఇన్నాళ్లు తెలంగాణ అంశంపై డ్రామాలాడిందన్న విషయం స్పష్టమైందని, ఇక తేల్చుకోవాల్సింది టీ- టీడీపీ నేతలేనన్నారు.
మంత్రుల భార్యల తీరుపై టీఆర్‌ఎస్ మండిపాటు
రాష్ట్రం సమైక్యంగా ఉంచాలంటూ గవర్నర్ వద్దకు వెళ్లి వినతిపత్రం ఇచ్చిన సీమాంధ్ర ప్రాంత మంత్రుల భార్యలు... తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కోరుతూ అనేక మంది బలిదానాలు చేసుకున్నప్పుడు ఎందుకు స్పందించలేదని టీఆర్‌ఎస్ శాసనసభాపక్ష నాయకుడు ఈటెల రాజేందర్ ప్రశ్నించారు. తెలంగాణ భవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఒక యాదయ్య, మరొక శ్రీకాంతాచారి కాల్చుకుని చనిపోతున్నప్పుడు కన్నతల్లుల బాధలు తెలిసిన సాటి మహిళలుగా ‘అలాంటి ఆత్మహత్యలను ఆపండి’ అని వాళ్లు తమ భర్తలను కోరి ఉంటే తామూ సంతోషించేవాళ్లమని చెప్పారు.