యాసంగికి ‘అనంతగిరి’ నీళ్లు | Minister Harish Rao Visits Ananthagiri Reservoir Works | Sakshi
Sakshi News home page

యాసంగికి ‘అనంతగిరి’ నీళ్లు

Published Thu, May 3 2018 4:11 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

Minister Harish Rao Visits Ananthagiri Reservoir Works - Sakshi

టన్నెల్‌ను పరిశీలిస్తున్న మంత్రి హరీశ్‌రావు

ఇల్లంతకుంట (మానకొండూర్‌): వచ్చే యాసం గికి అనంతగిరి రిజర్వాయర్‌ నీళ్లు అందిస్తామని నీటిపారుదల మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. కాళేశ్వరం– 10వ ప్యాకేజీలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం అనంతగిరిలో 3.5 టీఎంసీల రిజర్వాయర్, ఆనకట్ట పనులతోపాటు, తిప్పాపూర్‌ వద్ద టన్నెల్‌ నిర్మాణం, సర్జుఫుల్‌లో విద్యుత్‌ మోటార్ల బిగింపు పనులను మంత్రి పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ అనంతగిరి రిజర్వాయర్‌ నుంచి పంట కాల్వల ద్వారా 30 వేల ఎకరాలకు సాగు నీరందిస్తామని చెప్పారు.

రెండేళ్లలోనే కాళేశ్వరం ప్రాజెక్టు పనులను రికార్డుస్థాయిలో చేపట్టామని, పంప్‌హౌస్‌లు, బ్యారేజీల నిర్మాణం వేగవంతంగా సాగుతోందన్నారు. లక్ష్యాన్ని త్వరలోనే చేరుకోబోతున్నామని మంత్రి చెప్పారు. మరో 25 లక్షల క్యూబిక్‌ మీటర్ల మట్టి పనులు పూర్తి చేస్తే అనంతగిరి రిజర్వాయర్‌ నిర్మాణం పూర్తవుతుందన్నారు. అనంతగిరి రిజర్వాయర్‌లో భాగమైన నాన్‌ ఓవర్‌ ఫుల్‌ స్పిల్‌ వే 3 లక్షల పైచిలుకు క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ పనులు పూర్తి చేశామన్నారు. మరో 14 వేల క్యూబిక్‌ మీటర్ల పనులు వారంలోగా పూర్తవుతాయని చెప్పారు.

400 కేవీ సబ్‌స్టేషన్‌ నిర్మాణ జాప్యంపై మంత్రి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సబ్‌స్టేషన్‌ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని, 46 కిలోమీటర్ల దూరం నుంచి నిర్మిస్తున్న విద్యుత్‌ టవర్ల పనులను వర్షకాలం ప్రారంభమయ్యేలోగా పూర్తి చేయాలని హరీశ్‌ సూచించారు. తిప్పాపూర్‌ సర్జుఫుల్‌లో నాలుగు మోటార్ల బిగింపు పనులు ఏకకాలంలో చేపట్టామని, సర్జుఫుల్‌లో గేట్ల నిర్మాణాలను మరో 45–50 రోజుల్లో పూర్తి చేస్తామన్నారు. అనంతగిరి నిర్వాసితులు కోరుకున్న విధంగా ప్యాకేజీ వర్తింపజేస్తామని ఆయన చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement