గురువారం సొరంగం పనులను పరిశీలించి వస్తున్న మంత్రి హరీశ్‌రావు
సాక్షి, సిద్దిపేట: గోదావరి జలాలను తెలంగాణలోని బీడు భూములకు మళ్లించేందుకు నిర్మించే కాళేశ్వరం ప్రాజెక్టు పనులు యుద్ధంగా భావించి చేపడుతున్నామని భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. గురువారం సిద్దిపేట జిల్లాలోని చంద్లాపూర్‌లో నిర్మిస్తున్న రంగనాయక సాగర్ రిజర్వాయర్ పనులను, సొరంగ మార్గంలో జరుగుతున్న పనులను ఆయన పరిశీలించారు. టన్నెల్ ద్వారా సొరంగం తొలియడం, కాల్వల నిర్మాణ పనులను మంత్రి నేరుగా చూశారు.
భూ అంతర్భాగంలో నిర్మించే కాల్వలు, సర్జిబుల్ సంప్ నిర్మాణాలు, అక్కడి నుంచి రిజర్వాయర్లకు నీరు మళ్లించడం మొదలైన అంశాలపై నీటిపారుదల శాఖ ఇంజనీర్లను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భూ పైభాగానికి సగటున 100 మీటర్ల లోతులో భూమిని తొలిచి సొరంగ మార్గం ద్వారా కాల్వల నిర్మాణాలు చేపడుతున్నామని పేర్కొన్నారు. ఇలాంటి పనులు ఇప్పటి వరకు దేశంలో ఎక్కడా చేపట్టలేదని ఇది ఒక రికార్డుగా మంత్రి అభివర్ణించారు.
ప్రతీ పాయింట్ వద్ద మూడు షిఫ్టుల పని జరుగుతుందని, ప్రతిచోట షిఫ్టుకు 2 వేల మంది కార్మికులు పనిచేస్తున్నారని మంత్రి వివరించారు. 95 శాతానికి పైగా టన్నెల్ పనులు పూర్తయ్యాయని పేర్కొన్నారు. జూలై చివరి నాటికి సిద్దిపేటకు.. అనంతరం దశలవారీగా తెలంగాణలో సగభాగానికి గోదావరి జలాలు పారిస్తామన్నారు. నీటిపారుదల శాఖ ఈఎన్‌సీ మురళీధర్ మాట్లాడుతూ.. రూ.80 వేల కోట్లతో ఈ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుందని చెప్పారు. ఎల్లంపల్లి నుంచి మిడ్‌మానేరు వరకు 49.15 కిలోమీటర్లు సొరంగ మార్గంలో ఇప్పటి వరకు 46 కిలోమీటర్ల పని జరిగిందని చెప్పారు.
మిడ్‌మానేరు నుంచి 32 కిలోమీటర్ల సొరంగ మార్గం కాలువ పనులకు గాను ఇప్పటి వరకు 31 కిలోమీటర్ల పని పూర్తి చేసి ఫినిషింగ్ వర్క్ జరుగుతోందని వివరించారు. ఇందుకోసం ఇప్పటి వరకు రూ.22 వేల కోట్లు ఖర్చు చేశామన్నారు. జూలై చివరి నాటికి ఎల్లంపల్లి నుంచి కొండపోచమ్మ సాగర్ వరకు గోదావరి నీటిని పారిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఎల్లంపల్లి నుంచి మల్లన్నసాగర్ వరకు 600 మీటర్ల ఎత్తుకు గోదావరి జలాలు తీసుకెళ్లేందుకు అధునాతన పరిజ్ఞానంతో పంప్‌హౌస్‌లు, మోటార్లు బిగిస్తున్నామని, వీటిని ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామని ఆయన వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment