
నాంపల్లి (హైదరాబాద్): ఆరోగ్యరంగంలో దేశానికి తెలంగాణ ఆదర్శమని ఆర్థిక, వైద్య శాఖల మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. వ్యాక్సినేషన్‌లో దేశ సగటు కన్నా ముందంజ లో ఉన్నామని చెప్పారు. కరోనా సమయంలో వైద్య సిబ్బంది అందించిన సేవలు విశేషమని అభినందించారు. నిలోఫర్‌ను 1,800 పడకల ఆస్పత్రిగా మారుస్తామని హామీఇచ్చారు. శనివారం నిలోఫర్ ఆస్పత్రిలో వంద పడకల ఐసీయూ వార్డును ప్రారంభించిన అనంతరం హరీశ్ మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ సాఫ్ట్‌వేర్ ఎంటర్‌టైనర్ సంయుక్తంగా కరోనా థర్డ్‌వేవ్‌ను ఎదుర్కోవడానికి సీఎస్‌ఆర్ నిధుల నుంచి రూ.18 కోట్లు అందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఎలాంటి పరికరాలున్నాయో సీఎం కూడా అవే పరికరాలను అందజేసినట్లు హరీశ్ తెలిపారు. ‘హైదరాబాద్ నలువైపులా నాలుగు మెడికల్ టవర్స్ తెచ్చి కార్పొరేట్ వైద్యం అందించాలని సీఎం నిర్ణయించారు. మెడికల్ కాలేజీల సంఖ్య కూడా పెంచుతాం. రాష్ట్రం ఏర్పడిన అనంతరం ప్రభుత్వ మెడికల్ కాలేజీల సంఖ్యను 5 నుంచి 21కి పెంచాం’అని వివరించారు. కరోనా థర్డ్‌వేవ్‌ను ఎదుర్కొనేం దుకు రాష్ట్రప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుందని, ఇందుకు రూ.133 కోట్లు మంజూరు చేసినట్లు వెల్లడించారు. చిన్న పిల్లల కోసం 5 వేల పడకలు సిద్ధం చేశామని హరీశ్ పేర్కొన్నారు.