
తెలంగాణ సీఎం హరీష్!
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు వడివడిగా అడుగులు పడుతుండడంలో ముఖ్యమంత్రి పదవికి ప్రధాన పార్టీల్లో రోజుకో కొత్త పేరు తెరపైకి వస్తోంది. టీఆర్ఎస్ పార్టీ తరపున హరీష్రావు పేరు వెలుగులోకి వచ్చింది. కాంగ్రెస్ నుంచి జైపాల్ రెడ్డి, జానారెడ్డి, సర్వే సత్యనారాయణ, మర్రి శశిధర్రెడ్డి పేర్లు ప్రధానంగా వినబడుతున్నాయి. ఇక తెలంగాణ వస్తే తానే సీఎం అవుతానని టీడీపీ నాయకుడు ఎర్రబెల్లి దయాకరరావు ఇప్పటికే ప్రకటించుకున్నారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రానికి దళితుడినే తొలి సీఎం చేస్తానని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇప్పటికే పలుమార్లు పునరుద్ఘాటించారు. కొత్త రాష్ట్రానికి కాపలా కుక్కలా ఉంటానే తప్పా సీఎం పదవి తీసుకోనని ఆయన చాలాసార్లు స్పష్టం చేశారు. తాజాగా హరీష్ పేరు తెరపైకి రావడం టీఆర్ఎస్లో చర్చనీయాంశంగా మారింది. కేసీఆర్ తన కుమారుడు, కుమార్తెలను ప్రోత్సహిస్తూ మేనల్లుడైన హరీష్ను దూరం పెడుతున్నారన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ వ్యవహారం ప్రాధాన్యం సంతరించుకుంది.
తెలంగాణ రాష్ట్రానికి హరీష్రావు ముఖ్యమంత్రి అయ్యే అవకాశముందని వరంగల్ జిల్లాకు చెందిన మహిళా నేత ఒకరు మంగళవారం నాడు వ్యాఖ్యానించారు. హరీష్ సీఎం అయితేనే తమ సమస్యలు త్వరగా పరిష్కారం అవుతాయని తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ ఉద్యోగుల సంఘం మహిళా నేత ఎన్. సువర్ణకుమారి అన్నారు. తమ పార్టీలో కోహినూర్ వజ్రంగా హరీష్ను టీఆర్ఎస్ నేత రెహముల్లా ఖాన్ వర్ణించారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ జరుగుతుండగానే సీఎం పదవిపై అన్ని పార్టీల్లోనూ ఆశావహులు బయటపడుతున్నారు. తెలంగాణ రాష్ట్రానికి దళితుడిని సీఎం చేస్తానని కేసీఆర్ ముందునుంచి చెబుతుండడంతో టీఆర్ఎస్ పార్టీలో ఎవరూ బయటపడలేదు. సీఎం రేసులో ఉన్నామని చెప్పడానికి ఎవరూ సాహించలేదు. అయితే కార్యకర్తలు హరీష్ పేరు తెరపైకి తేవడంతో కేసీఆర్ ఎలా స్పందిస్తారనే దానిపై ఇప్పుడు ఆసక్తి నెలకొంది.