
సాక్షి, మెదక్ : అభివృద్ధి పనులను అడుగడుగునా అడ్డుకుంటున్న కాంగ్రెస్ పార్టీని పాతరేద్దామని భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి హరీశ్‌రావు పిలుపునిచ్చారు. మెదక్- మక్త భూపతిపూర్ రోడ్డుకు ఆయన శంకుస్థాపన చేశారు. అంతేకాక ప్రభుత్వ ఆస్పత్రిలో ఐసీయూ కేంద్రం ప్రారంభోత్సవం, ఇటీవల నియమించిన గ్రంథాలయ సంస్థ పాలక మండలి సభ్యుల ప్రమాణ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలన అంటేనే కరెంట్ కోతలు, మంచినీళ్ల బాధలు తప్ప రాష్ట్ర ప్రజలకు వారు చేసిందేమీ లేదని విమర్శించారు. టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత 24 గంటల పాటు ఉచిత విద్యుత్, కాళేశ్వరం ప్రాజెక్టు పనులు ప్రారంభం, మిషన భగీరథ, కాకతీయ, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్, రైతు పెట్టుబడికి ఏడాదికి రూ. 8 వేలు అందిస్తుంటే.. కాంగ్రెస్ అడ్డుపడుతోందని ఆయన విమర్శించారు.
అందుకే ఆ పార్టీని భూస్థాపితం చేసేందుకు సిద్ధంగా ఉండాలని ప్రజలకు పిలుపునిచ్చారు. తెలంగాణ వ్యతిరేకి అయిన సీపీఎంతో జేఏసీ చైర్మన్ కోదండరాం చెట్టాపట్టాలు వేసుకోవడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. విపక్షాల పంచన చేరి కోదండరాం వేస్తున్న ఎత్తుగడలు ఫలించవని మంత్రి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment