
లిఖిత పూర్వకంగా కోరితేనే..
ఏపీకి కృష్ణా నీటి విడుదలపై మంత్రి హరీశ్
సాక్షి, హైదరాబాద్: నాగార్జునసాగర్ నీటి వినియోగంలో ఆంధ్రప్రదేశ్ లేని హక్కులకోసం ఆశపడుతోం దని, తెలంగాణే తమకు అన్యాయం చేస్తోందన్న అపోహ సృష్టించేందుకు ప్రయత్నిస్తోందని మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. బచావత్ అవార్డు మేరకు జరిపిన కేటాయింపులకు మించి నీటిని వాడేసుకొని... ఇప్పుడు ఉన్న నీటిని ఇస్తావా.. చస్తావా? అన్న ధోరణితో వ్యవహరిస్తోందని మండిపడ్డారు. చివరిదశలో ఉన్న పంటలను కాపాడుకునేందుకు ఎన్ని నీళ్లు కావాలో లిఖితపూర్వకంగా ప్రతిపాదన ఇస్తే సహృదయంతో పరిశీలిస్తామని... ఆ నీటిని తర్వాతి ఏడాదిలో సర్దుబాటు చేసుకుందామని హరీశ్ సూచించారు.
అంతే తప్ప సాగర్ గేట్ల వద్ద ధర్నాలు, డ్రామాలు చేస్తే తీవ్రంగా పరిగణిస్తామని హెచ్చరించారు. డ్యామ్ గేట్లు పగలగొడతామంటూ కొం దరు ఏపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై హరీశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. శుక్రవారం సచివాలయంలో నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌కే జోషి, ఈఎన్‌సీ మురళీధర్‌తో కలిసి మంత్రి హరీశ్‌రావు విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా కృష్ణా జలాల్లో ఇప్పటివరకు ఉన్న కేటాయింపులు, వినియోగంపై ఆయన స్పష్టత ఇచ్చారు.
అదనంగా వాడుకుంది ఏపీనే..
‘‘ప్రస్తుతం లభ్యతగా ఉన్న 63 టీఎంసీల్లో హైదరాబాద్ తాగునీటి అవసరాలకు 8 టీఎంసీలు, కుడి కాలువ కింద 5, ఎడమ కాలువ కింద 8 టీఎంసీలు, ఏఎంఆర్‌పీకి 2 నుంచి 3 టీఎంసీలు, కృష్ణా డెల్టాకు 3 టీఎంసీలు కలిపి మొత్తంగా 25 టీఎంసీల తాగునీటి అవసరాలున్నాయి. మిగతా సుమారు 40 టీఎంసీల నీటిని మొత్తంగా ఏపీ తమకే కావాలంటోంది. వాటాలు, లెక్కలు ఏవీ లేకుండా ఉన్న నీరంతా మాకే కావాలంటే తెలంగాణ రైతులు ఏం కావాలి..?’’ అని హరీశ్‌రావు ప్రశ్నించారు.
బచావత్ అవార్డు తీర్పును ప్రస్తావిస్తూ ‘‘బచావత్ ట్రిబ్యునల్ ఏపీకి 512, తెలంగాణకు 299 టీఎంసీలను కేటాయించింది. ఈ నీటిని తెలంగాణలో ఎక్కడైనా వాడుకోవచ్చని తెలిపింది. అసలు 41.60 శాతం వాటా తెలంగాణకు, 58.40 శాతం వాటా ఆంధ్రాకు దక్కాలి. ఈ న్యాయసూత్రం ఆధారంగా నీటి లెక్కలను తేల్చుదాం. లేదంటే ఈ ఏడాది కృష్ణా బేసిన్‌లో మొత్తంగా లభించిన నీటిలో తెలంగాణకు 229.9 టీఎంసీలు, ఏపీకి 322.611 టీఎంసీలు దక్కాలి. ఈ సూత్రాల మేరకైనా నడుచుకోవాలి. నిజానికి ఏపీ ఇప్పటికే తన వాటాను మించి 365.75 టీఎంసీలను వాడుకుంది. అంటే 43.13 టీఎంసీలు అదనంగా వాడుకుంది. తెలంగాణ మాత్రం తన వాటాలో కేవలం 140.4 టీఎంసీలనే వినియోగించుకుంది. ఈ లెక్కన మరో 89.5 టీఎంసీలు వాడుకునే హక్కు ఉంది. అలాంటప్పుడు సాగర్‌లో లభ్యతగా ఉన్న నీటిని మొత్తం తమకే కేటాయించాలని ఏపీ కోరడం సమంజసం కాదు..’’ అని హరీశ్ స్పష్టం చేశారు.
ఈ విషయాన్ని కేంద్ర జల వనరుల శాఖ మంత్రి ఉమాభారతి దృష్టికి సీఎం కేసీఆర్ తీసుకెళతారని తెలిపారు. ప్రస్తుతమున్న నీటిలో ఎన్ని టీఎంసీలు కావాలో ఏపీ లిఖితపూర్వకంగా కోరితే... వాటిని సర్దుబాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని మంత్రి చెప్పారు. సాగర్ గేట్ల వద్ద ధర్నాలు, డ్రామాలు తీవ్రమైన అంశమని, డ్యామ్ గేట్లు పగలగొడతామన్న వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. డ్యామ్ పగలకొడతామంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.