తన్నీరు హరీష్‌రావు. తెలంగాణ రాజకీయాల్లో ఆయన గురించి తెలియనివారుండరు. పార్టీలో ఆయనను అందరూ ట్రబుల్ షూటర్ గా పిలుస్తారు. తండ్రి తన్నీరు సత్యనారాయణరావు వైద్య, ఆరోగ్యశాఖలో ఉద్యోగి. కరీంనగర్ జిల్లా బెజ్జంకి మండలం తోటపల్లి స్వగ్రామం. పాలిటెక్నిక్ డిప్లమో చదివేందుకు హైదరాబాద్ వచ్చారు. మేనమామ కేసీఆర్ ఇంట్లోనే ఉండేవారు. ఆయనకు రాజకీయ కార్యకలాపాల్లో చేయూతనందించేవారు. వ్యక్తిగత సహాయకుడిగా ఉంటూ నమ్మకాన్ని, అభిమానాన్ని సంపాదించుకున్నారు. అదే సమయంలో తన మిత్రులతో కలిసి చిట్‌ఫండ్స్, హోటల్ వ్యాపారాల్లోనూ భాగస్వామిగా ఉండేవారు.
కష్టపడేతత్వమే ఆయన బలం
ప్రజలు ఏమాలోచిస్తున్నారు, వారి ఆశలకనుగుణంగా మనమేం చేయొచ్చు, ఆ క్రమంలో ఏ అడుగువేయాలి, దానికి ఉపయోగపడే శక్తిసామర్థ్యాలు ఎవరి దగ్గర ఉన్నాయని అంచనా వేయడంలో హరీష్‌రావు దిట్ట. పనిపై అంచనా వచ్చిన తర్వాత లక్ష్యం చేరడానికి రేయింబవళ్లు కష్టపడేతత్వం ఆయనను విజేతగా నిలిపింది. అనుకున్న పని పూర్తయ్యేవరకు ఎన్ని గంటలైనా, ఎంత మందితోనైనా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా విసుగు, విరామం లేకుండా డీల్ చేయగలగడం హరీష్‌రావు ప్రధానబలం. ట్రబుల్ షూటర్. మన మాటలు వింటూనే మరో విషయం గురించి మనసులో ప్రణాళిక రచించడం ఆయన ప్రత్యేకత. కొత్త విషయం చెబుతున్నపుడు ఆసక్తిగా వినడం, తెలియని విషయాలపై అవగాహన పెంచుకోవడం ఆయనకు అలవాటు. రాజకీయ నాయకుడికి ప్రధానంగా ఉండాల్సిన అర్హత ప్రసంగం. 16 మంది శాసనసభ్యులు రాజీనామా చేసిన సందర్భంగా శాసనసభల్లో హరీష్‌రావు చేసిన ప్రసంగం గురించి కేసీఆర్ మాట్లాడుతూ హరీష్ ప్రసంగం నన్నే ముగ్ధుడ్ని చేసింది. తెలంగాణకు జరిగిన అన్యాయం, కాంగ్రెస్ చేసిన మోసం ప్రజలకూ అర్ధమైంది అని పొగిడారు. అద్భుతమైన వక్తగా పేరుగాంచిన కేసీఆర్ అందించిన ప్రశంస హరీష్ ప్రతిభకు నిదర్శనం.
విమర్శలూ ఉన్నాయి..
అవసరం తీరిన తర్యాత హరీష్‌రావు ఎవరినీ పట్టించుకోరని పార్టీ నాయకులు, ఆయన సన్నిహితులు చెబుతుంటారు . అవసరమున్నప్పుడు ఎన్నిసార్లయినా ఫోన్లు చేస్తారని, అయితే ఆయన సాయం కోసం ఫోన్లు చేస్తే స్పందించరన్న విమర్శ సన్నిహితుల నుంచే వినిపిస్తుంది. కేసీఆర్ రాష్ట్ర మంత్రిగా ఉన్నప్పుడు హరీష్ చాలా చురుకైన పాత్రను నిర్వహించారు. 1999 ఎన్నికల తర్వాత కేసీఆర్‌కు మంత్రి పదవి రానపుడు దూరంగా ఉన్నారు. ఆ సమయంలో తన వ్యాపారాల విస్తరణపైనే హరీష్‌రావు దృష్టి కేంద్రికరించారని టీఆర్‌ఎస్ ముఖ్యులు చెప్పుకుంటారు. హరీష్‌రావు పార్టీలోని కొందరితో కలిసి సొంత గ్రూపును కాపాడుకుంటుంటారన్న మాట కూడా వినిపిస్తుంటుంది. హరీష్‌లో అందుకు తగిన శక్తిసామర్థ్యాలున్నాయని కూడా పార్టీ నాయకులు అంగీకరిస్తారు.
మనో సిద్దిపేట
కేసీఆర్ రాజకీయ ప్రస్థానానికి ఆలంబనగా ఉన్న సిద్దిపేట నియోజకవర్గమే హరీషరావుకు వేదికైంది. సిద్దిపేట నియోజకవర్గానికి మూడుసార్లు ఉప ఎన్నికలు జరిగితే ఒకసారి కేసీఆర్, రెండుసార్లు హరీష్‌రావు ఎన్నికయ్యారు. టీఆర్‌ఎస్ ఆవిర్భావ సమయంలో పోటీ చేసినపుడు కేసీఆర్ కంటే హరీషరావుకు ఎక్కువ మెజారిటీ వచ్చింది. 2004లో కేసీఆర్ సిద్దిపేట ఎమ్మెల్యేగా, కరీంనగర్ ఎంపీగా ఎన్నికయ్యారు. సిద్దిపేటకు కేసీఆర్ రాజీనామా చేసి హరీష్‌రావును మంత్రిగా చేసి సిద్దిపేట ఎమ్మెల్యేగా గెలిపించారు. ఆ తరువాత ఉప ఎన్నికల్లో కూడా హరీష్‌రావుకే అధిక మెజారిటీ వచ్చింది. ప్రస్తుత ఎన్నికల గురించి ఎవరు లెక్కలేసుకున్నా టీఆర్ఎస్ గెలిచే మొదటి సీటు అంటే సిద్ధపేట అనే చెబుతారు.
నేపథ్యం :
జననం : జూన్ 3,1972
పుట్టిన స్థలం : కరీంనగర్ జిల్లా, బెజ్జంకి మండలం తోటపల్లి గ్రామం
తల్లిదండ్రులు : లక్ష్మీబాయ్, సత్యనారాయణరావు
కుటుంబం : భార్య శ్రీనితారావు, కుమారుడు ఆర్చిస్‌మన్, కుమార్తె వైష్ణవి
చదువు : కరీంనగర్ వాణినికేతన్ పాఠశాలలో ప్రాథమిక విద్య, కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ (బీఏ)
రాజకీయ నేపధ్యం :
► సిద్ధిపేట నియోజకవర్గం నుంచి వరుసగా (2004, 2008, 2010 ఉప ఎన్నికల్లో 2009, 2014 సాధారణ ఎన్నికల్లో) ఎన్నిక.
► తెలంగాణ తొలి నీటి పారుదల శాఖ మంత్రి గా పనిచేశారు
► వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వంలో యువజన శాఖ మంత్రిగా పనిచేశారు
- కె అఖిల్
Comments
Please login to add a commentAdd a comment