అడ్వకేట్ నుంచి డిప్యూటీ స్పీకర్ దాకా...!!! | Padma Devender Reddy Telanagana State First Deputy Speaker | Sakshi
Sakshi News home page

అడ్వకేట్ నుంచి డిప్యూటీ స్పీకర్ దాకా...!!!

Published Thu, Nov 29 2018 5:53 PM | Last Updated on Thu, Apr 14 2022 1:12 PM

Padma Devender Reddy Telanagana State First Deputy Speaker - Sakshi

పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రానికి తొలి డిప్యూటీ స్పీకర్‌ పద్మా దేవేందర్‌ రెడ్డి. తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న పద్మాదేవేందర్‌ రెడ్డి 2001లో టీఆర్‌ఎస్‌లో చేరినప్పటి నుంచి ఆ పార్టీలో చురుకుగా పనిచేస్తున్నారు. వృత్తి రీత్యా న్యాయవాది అయిన పద్మా దేవేందర్ రెడ్డి రాజకీయాల్లో అనేక ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. అడ్వకేట్ గా పనిచేసిన అనుభవం ఆమెకు రాజకీయాల్లో కలిసొచ్చిన అంశం.  
టీఆర్ఎస్‌ పార్టీ నుంచి సస్పెండ్‌ అయినప్పటకీ ఆమె మాత్రం తన ధైర్యం కోల్పోలేదు. ఆమె పోరాట పటిమ చూసి పార్టీయే  దిగివచ్చింది. ఈ ఒక్క విషయం చాలు పద్మా దేవేందర్‌ రెడ్డి ఏంటో తెలుసుకోవడానికి! విద్యార్థి దశ నుంచే రాజకీయాలంటే ఆసక్తి కనబర్చిన పద్మా దేవేందర్‌ రెడ్డి రాజకీయాల్లోకి ప్రవేశించిన అనతి కాలంలోనే జెడ్పీటీసీ మెంబర్‌గా గెలిచి తన సత్తా చాటారు. పద్మా దేవేందర్‌ రెడ్డి చేరికతో బీజేపీలో క్రియాశీలక కార్యకర్తగా ఉన్న ఆమె భర్త కూడా టీఆర్‌ఎస్‌లో చేరిపోయారు. 

పెద్ద కుటుంబంలో జన్మించిన పద్మాదేవేందర్‌ రెడ్డి బాల్యమంతా ఊర్లోనే సాగింది. చిన్నప్పడు ఎప్పుడూ చదువులో ముందుండేవారు.చదువులో అందరికన్నా ముందుండాలనే పట్టుదలతో ఉండేవారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో జన్మించిన పద్మా దేవేందర్‌ రెడ్డి చదువంతా కరీంనగర్‌ పట్టణంలోనే సాగింది. ఎల్ ఎల్ బీ పూర్తి కాగానే న్యాయవాద వృత్తి ప్రాక్టీస్ ప్రారంభించారు. రంగారెడ్డి జిల్లా కోర్టులో దాదాపు మూడేళ్ల పాటు న్యాయవాదిగా ప్రాక్టీసు  చేశారు. 17 ఏళ్ల ప్రాయంలోనే వివాహం జరిగినప్పటికీ తాను మాత్రం లక్ష్యాన్ని పక్కన పెట్టలేదు. ఏ మాత్రం రాజకీయ అనుభవం లేని కుంటుంబం నుంచి వచ్చిన పద్మాదేవేందర్‌ రెడ్డి రాజకీయ నేతగా నిలదొక్కుకోగలిగారంటే అది ఆమె సంకల్ప బలమే అని సన్నిహితులు చెబుతుంటారు. మంత్రివర్గంలో చేరాలని బలమైన ఆకాంక్ష ఉన్నప్పటికీ కేసీఆర్ సూచనల మేరకు డిప్యూటీ స్పీకర్ పదవిని స్వీకరించారు. బాధ్యతలను నిర్వర్తించడంలో కష్టపడే తత్వం పద్మా దేవేందర్ రెడ్డిది. ఉద్యమంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. ఉద్యమంలో భాగంగా టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌తో కలసి సిద్దిపేట నుంచి వరంగల్‌ వరకు సైకిల్‌ యాత్రలో పాల్గొని ఏ విషయంలోను మహిళలు పురుషుల కన్నా తక్కువ కాదని చాటి చెప్పారు.

కుటుంబ నేపథ్యం :
పేరు  : మాధవరెడ్డిగారి పద్మా దేవేందర్‌ రెడ్డి
జన్మస్థలం  : ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా 
పుట్టిన తేదీ : జనవరి6,1969
తల్లిదండ్రులు : విజయా రెడ్డి,భూమి రెడ్డి
చదువు : బీ.ఏ ఎల్.ఎల్‌.బి (ఉస్మానియా యూనివర్సిటీ)
వివాహం : 22 పిబ్రవరి,1988
భర్త : ఎం దేవేందర్‌ రెడ్డి
కుటుంబం : కుమారుడు పునీత్‌ రెడ్డి

రాజకీయ నేపథ్యం :
►2001 లో టీఆర్ఎస్ ద్వారా రాజకీయాల్లోకి రంగ ప్రవేశం
►2001 లో మెదక్‌ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో రామాయంపేట నుంచి జెడ్పీటీసీగా గెలుపు (జెడ్పీలో పార్టీ ఫ్లోర్ లీడర్ కూడా)
►2004 లో రామాయంపేట నుంచి ఎమ్మెల్యేగా ఎన్నిక
► 2008 ఉప ఎన్నికల్లో ఓటమి (ఉద్యమంలో భాగంగా పదవి రాజీనామా, తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో ఓటమి)
► 2009 లో ఎన్నికల్లో ఓటమి
►2009 లో టీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి సస్పెండ్‌ (కూటమి పొత్తుల్లో భాగంగా టీఆర్‌ఎస్‌ అథిష్టానం టికెట్‌ నిరాకరించడంతో ఇండిపెండెంట్‌ గా పోటీ చేసి ఓడిపోయారు)
► 2010 లో తిరిగి పార్టీలో చేరిక
► 2014 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసి గెలుపు  (మళ్లీ ప్రస్తుత ఎన్నికల్లో మెదక్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ)
►2014-2018 తెలంగాణ తొలి డిప్యూటీ స్పీకర్‌గా పని చేశారు.

ఎ.రమణా రెడ్డి (ఎస్‌.ఎస్‌.జే)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement