
ఎప్పుడూ నిలకడగా కనిపిస్తారు. ఆకారానికి తగ్గట్టుగానే మృదు స్వభావి. ఉద్యమ వాగ్దాటి ఉన్నవారు. అందరినీ పలకరిస్తూ కలుపుగోలుగా ఉండే ఆయన రాజకీయ జీవితం ఉద్యమ పోరాటంతో మొదలై తెలంగాణ తొలి ఆర్థిక మంత్రిగా ఘనతకెక్కారు. తెలంగాణ ఉద్యమం, టీఆర్ఎస్ ఎదుర్కొన్న ఆటుపోట్లన్నింటిలోనూ ఉన్నారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నుంచి అజేయుడిగా నిలుస్తున్నారు. 2001 టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి ఉద్యమ పార్టీలో కొనసాగుతూ మిగులు బడ్జెట్ కలిగిన తెలంగాణ తొలి ప్రభుత్వంలో తొలి ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో టీఆర్‌ఎస్ ఎల్పీ నేతగా ఉన్న ఈటల తన వాగ్ధాటితో అందరిని ఆకట్టుకున్నారు.
పేరు : ఈటల రాజేందర్
జననం : 1964 మార్చి 20 కరీంనగర్
తండ్రి పేరు : ఈటల మల్లయ్య
నియోజకవర్గం : హుజురాబాద్
చదువు : బీఎస్సీ (ఉస్మానియా యూనివర్సిటీ)
భార్య : ఈటల జమున,
కొడుకు : నితిన్, కూతురు : నీతా
ఈటల రాజేందర్ కుమారుడు నితిన్ పెళ్లి ఫోటో
రాజకీయ జీవితం :
టీఆర్ఎస్ సీనియర్ నేత. 2009లో ఆ పార్టీ శాసనసభ పక్ష నేతగా ఉన్న ఈటల రాజేందర్ హుజురాబాద్ లో మూడోసారి(మొత్తంగా 5సార్లు) గెలిచి కేసీఆర్ మంత్రివర్గంలో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2004, 2008ఉప ఎన్నికలో కమలాపురం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. 2009లో కమలాపురం నియోజకవర్గం హుస్నాబాద్‌గా మారడంతో ఆయన హుజూరాబాద్ నుంచి పోటీకి దిగుతూ వస్తున్నారు. 2009 సాధారణ ఎన్నికతో పాటు, 2010 ఉప ఎన్నికలల్లోనూ ఆయన గెలుపొందారు. తెలంగాణ ఉద్యమంలో భాగంగా ఆయన తన ఎమ్మెల్యే పదవికి రెండు సార్లు రాజీనామా చేశారు. 2014 సాధారణ ఎన్నికల్లో హుజురాబాద్ నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి కె.సుదర్శన్‌రెడ్డిపై 57,037 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు. వెనకబడినవర్గాలకు చెందిన ఈటల తెలంగాణ ఉద్యమంలోనూ, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలోనూ నిర్విరామంగా కృషి చేశారు. ప్రత్యేక రాష్ట్ర సాధనలో భాగంగా 2008లో రాజీనామా చేసిన 16 మంది టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలలో ఒకరిగా ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో భాగంగా మరోసారి పార్టీ నిర్ణయం మేరకు 2010 ఫిబ్రవరిలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తిరిగి ఉప ఎన్నికలో టీడీపీ నేత ముద్దసాని దామోదర రెడ్డిపై ఘన విజయం సాధించారు.
- రొడ్డ స్నేహలత (సాక్షి జర్నలిజం స్కూల్)