
హుజూరాబాద్: తప్పుడు సర్వేలతో తెలంగాణ ప్రజలను మోసం చేయాలని ప్రయత్నం చేసిన లగడపాటి రాజగోపాల్ కుట్రలను ప్రజలు పాతరేసి ఓటుతో తగిన బుద్ధి చెప్పారని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. ఎమ్మెల్యేగా ఆరోసారి గెలిచిన ఆయన.. మొదటిసారిగా హుజూరాబాద్‌కు వచ్చారు. టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఈటల మాట్లాడారు. మహాకూటమి పేరుతో చంద్రబాబునాయుడు తెలంగాణకు వచ్చి రాజకీయం చేద్దామని చూశారని, కానీ ఇక్కడ బాబు కుట్రలు చెల్లలేదన్నారు. చంద్రబాబు తెలంగాణలో కాదు కదా ఆంధ్రాలో కూడా గెలువలేడని చెప్పారు.
రేవంత్‌రెడ్డి వంటి కొందరు పిట్టల దొరలు తెలంగాణ ప్రజలను మోసం చేయాలని చూసినా, ప్రజలు మాత్రం ఓటుతో బుద్ధి చెప్పారన్నారు. సోషల్ మీడియా, ఆంధ్ర పత్రికల్లోనే కూటమి ఉందని, టీఆర్‌ఎస్ పార్టీ మాత్రం తెలంగాణ ప్రజల గుండెల్లో ఉందన్నారు. ఆనాటి ఉద్యమ నేతగా, సీఎం కేసీఆర్ 100 సీట్లు వస్తాయని చెప్పారని, 90 సీట్లు గెలిచి టీఆర్‌ఎస్ పార్టీ దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిందని అన్నారు. పార్టీలో ఉంటూ పార్టీకి ద్రోహం చేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని, అటువంటి వారిపై చర్యలు తప్పవని ఈటల స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment